Leading News Portal in Telugu

భారీ వర్షంతో చిగురుటాకులా వణికిన విశ్వనగరం | viswanagaram shewered with heavy rains| water| roads| ponds| traffic| zam| schools


posted on Sep 5, 2023 11:54AM

భారీ వర్షంతో విశ్వనగరం చిగురుటాకులా వణికిపోయింది. మంగళవారం (సెప్టెంబర్ 5) తెల్లవారు జామునుంచీ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మహానగరం తడిసి ముద్దైంది. జలమయమైంది. ట్రాఫిక్ జామ్ లతో జనం నరకయాతన అనుభవించారు. పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించినా, గతంలోలాగే  ఆ సెలవు ప్రకటన ఆలస్యంగా వెలువడటంతో విద్యార్థులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది.  ఇక స్వల్ప సమయంలోనే హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలలో రికార్డు స్థాయిలో అత్యధిక వర్ష పాతం నమోదైంది. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులయ్యాయి. కాలనీలకు కాలనీలు నీట మునిగాయి. మొత్తంగా నగరం నరకాన్ని తలపించింది. ఇక గ్రేటర్ పరిధిలో వివిధ ప్రాంతాలలో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి..

మియాపూర్ లో  14.7 సెంటీమీటర్లు,  కూకట్పల్లిలో 14.3 సెంటీమీటర్లు, శివరాం పల్లిలో 13 సెంటీమీటర్లు, గాజుల రామారావు లో 12.5 సెంటీమీటర్లు,  బోరబండ లో 12.5 సెంటీమీటర్లు,  జీడిమెట్లలో 12.1 సెంటీమీటర్లు,  షాపూర్, మూసాపేట్,జూబ్లీ హిల్స్ లో 12 సెంటీమీటర్లు,  కుత్బుల్లాపూర్ లో 11.5 సెంటీమీటర్లు, మాదాపూర్ లో 11.4 సెంటీమీటర్లు, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ లో 11.2 సెంటీమీటర్లు, బేగంపేట్, కెపిహెచ్బి, అల్వాల్, శేలింగంపల్లిలో 10 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది. అలాగే  ముషీరాబాద్ లో 9.9,  గోషామహల్ లో 9.5, మలక్ పేటలో 9.4 , ఫలక్ నూమాలో 9.2, కార్వాన్ లో 8.8 , సరూర్ నగర్ లో 7.9 ఎల్బీనగర్, అంబర్పేట్ లో 6.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక మల్కాజ్ గిరి, మౌలాలిలో 4.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.  భారీ వర్షం కారణంగా పలు కాలనీల్లో ఇళ్లల్లోకి వర్షపునీరు చేరింది. లింగంపల్లి అండర్ పాస్ వద్ద భారీగా నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.  

ఇక నాలాల సమీపంలో నివసిస్తున్న వారు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గడుపుతున్నారు.  యధా ప్రకారంగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దనీ జీహెచ్ఎంసీ ఒక ప్రకటన విడుదల చేసేసింది. ఇలా ఉండగా భారీ వర్షం కారణంగా ఉస్మాన్ సాగర్ లోకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తివేసి నీటికి కిందకి విడుదల చేశారు.