పార్టీకి మొహం చాటేస్తున్న వైసీపీ క్యాడర్! | cadre distance themselves from ycp| party| encouragement| works| bills| expenditure
posted on Sep 5, 2023 3:39PM
అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్త అంటే ఆ ధైర్యం.. ఆ ఠీవి.. ఆ పొగరు వేరే లెవెల్ లో ఉంటుంది. పల్లెలకి వెళ్లి చూస్తే ఓ పంచాయతీ లీడర్ కూడా తన పార్టీ అధికారంలో ఉందంటే.. తానే ఓ మంత్రిలా ఫీలైపోతుంటారు. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ అధికారులు నిర్వహిస్తుంటే.. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను ఈ కార్యకర్తలు, నేతలే అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. ఖర్చుకు వెనకాడకుండా పార్టీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజలలోకి తీసుకెళ్తుంటారు. పార్టీకి సంబంధించి ఏ చిన్న కార్యక్రమం తలపెట్టినా దగ్గరుండి సొంత ఇంట్లో వేడుకలా నిర్వహిస్తుంటారు. ఏపీలో అధికార పార్టీ వైసీపీ లో కూడా రెండు మూడేళ్ళ కిందటి వరకూ ఇలాంటి పరిస్థితే కనిపించేది. వైఎస్ఆర్ జయంతి, వర్థంతి.. సీఎం జగన్ బర్త్ డే.. పార్టీ ఆవిర్భావం దినోత్సవం.. జగన్ ప్రభుత్వానికి ఏడాది, రెండేళ్ల వరకు ఇలా అన్ని కార్యక్రమాలనూ వైసీపీ క్యాడర్ తమ సొంత ఇంటి వేడుకల్లా ఘనంగా, భారీగా నిర్వహించేది. అయితే వైసీపీ క్యాడర్ లో ఆ ఆసక్తి తగ్గిపోయింది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్ స్థాయి నేతలు బాగానే వెనకేసుకున్నారు. ఎక్కడికక్కడ ముడుపుల కొండలను అనకొండలా మింగేశారు. అక్కడక్కడా ఇసుక దందాలు, అక్రమ మట్టి తవ్వకాలతో పెట్టిన ప్రతి రూపాయికి పదింతలు వసూలు చేసి ఖజానా నింపుకున్నారు. కానీ పార్టీలో ద్వితీయ శ్రేణి నేతల నుండి కింది స్థాయి కార్యకర్తల వరకూ చివరికి మిగిలింది నిరాశే. ఇంకా చెప్పాలంటే ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పార్టీ నట్టేట ముంచేసింది అని చెప్పొచ్చు. ఏదో ఆశించి వైసీపీ పెద్దలను నమ్ముకున్న ద్వితీయ శ్రేణి నేతలు పూర్తి స్థాయిలో దివాలా తీశారు. జగన్ కాంగ్రెస్ ను విభేదించిన రోజు నుండి పదేళ్లకు పైగా పార్టీ కోసం కష్టపడి భారీగా ఖర్చు పెట్టుకున్నారు. అధికారంలోకి రావడంతో వీరి సంతోషం అంతా ఇంతా కాదు. మీకెందుకు మేమున్నామంటూ అధికారంలోకి వచ్చాక కూడా వీరితో భారీగానే ఖర్చు పెట్టించారు.
కానీ పదేళ్లలో పెట్టినదాంట్లో పది శాతం కూడా వెనక్కి రాలేదు. అధికారంలోకి వచ్చాక పెట్టిన ఖర్చులు కూడా వెనక్కి రాని పరిస్థితి. ఒకవేళ పనిచేస్తే ఆ బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియక వాటి వడ్డీలు కట్టడానికి కూడా చేతి చమురు వదిలించుకోవాల్సి వచ్చింది. ఇక గ్రామాలలో, పట్టణాలలో నేతల విషయానికి వస్తే వార్డు వాలంటీర్ కి ఉన్న మర్యాద కూడా వీరికి లేకుండా పోయింది. గ్రామాలలో, పట్టణాలలో వీరితో పని లేకుండా పోగా.. ఏదైనా అభివృద్ధి పనులు చేసుకొని అయినా కాస్త పార్టీ పరంగా లబ్ది దొరుకుతుందని భావించిన వీరందరికీ నాలుగేళ్ళలో మొండి చేయే మిగిలింది. నిధుల కొరతతో వీరికి కేటాయించేందుకు పనులు లేవు.. దారి తప్పి ఎక్కడైనా పనులు చేస్తే ఆ బిల్లులు ఎప్పుడు వస్తాయో కూడా ఎవరికీ క్లారిటీ ఉండదు. దీంతో అసలు కరుడు గట్టిన కార్యకర్తలు అనే వారు కూడా ఇప్పుడు మాదేముందిలే, మనకెందుకు వచ్చిన గొడవలే అంటూ మొహం తిప్పుకొని వెళ్లే పరిస్థితికి వచ్చేశారు.
గత ఏడాది నుండి చూస్తే వైసీపీకి ఆ పార్టీ క్యాడర్ దూరమవుతున్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నది. అంతకు ముందు పార్టీ కార్యక్రమాలను భారీగా నిర్వహించిన కార్యకర్తలు అన్నదానాలు, రక్తదానాలు చేసేవారు. సంబరాలు చేసుకుంటూ ఊరువాడా దుమ్మరేపేవారు. పేపర్లు, టీవీలలో ప్రకటనలిచ్చి రీ సౌండ్ చేసేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ వేడుకలు చప్పగా మారిపోయాయి. కొన్ని చోట్ల తూతూ మంత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. మరికొన్ని చోట్ల దాదాపుగా అసలు చేయడం లేదు. గతంలో పార్టీ కార్యక్రమాలకు ఎమ్మెల్యే, మంత్రి వస్తుంటే ఆ దారి ఫ్లెక్సీల మయమై కనిపించేది. కానీ, ఇప్పుడు వాలంటీర్ల ఫ్లెక్సీలు మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప నేతల ఫ్లెక్సీలు కాగడాపెట్టి వెతికినా కనిపించడం లేదు. నేతలు ఎలాగూ ఫ్లెక్సీలు పెట్టడం లేదు కనుక పార్టీ పరువు పోకుండా కనీసం వాలంటీర్లకు ఈ ఫ్లెక్సీల బాధ్యత అప్పగించినట్లు తెలుస్తున్నది. ఈ మధ్యనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని వైసీపీ భావించినా క్యాడర్ నుండి స్పందన లేక గతంలో ఉన్న వారినే కొనసాగించాలని తీర్మానం చేశారంటే వైసీపీ పార్టీ కార్యకర్తలకు ఏ స్థాయిలో దూరమైందో అర్ధం చేసుకోవచ్చు.