Leading News Portal in Telugu

ఇండియా కాదు భారత్ మాత్రమే.. పార్లమెంటులో తీర్మానానికి మోడీ సర్కార్ సమాయత్తం?! | not india only bharat| bjp| resolution| parliament| special| session


posted on Sep 5, 2023 3:27PM

ఇండియా.. ఈ పేరు వింటే కమలనాథులకు గుండెల్లో వణుకు పుడుతోందా? నిన్న మొన్నటి దాకా భుజాన మోసిన ఇండియా పేరంటేనే వెగటైపోయిందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. గత తొమ్మదేళ్లకు పైగా కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో విర్రవీగిన కమలనాథులు ఇప్పుడు ఇండియా అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే ఇండియా అని బెంగటిల్లుతున్నారు. అధికారం చేతిలో ఉంది కనుక ఇండియా పేరునే కనుమరుగు చేస్తే పోలా? ఇండియా అనే పేరును చరిత్ర గర్భంలో కలిపేసి భారత్ అన్నది మాత్రమే దేశం నామధేయంగా పార్లమెంటులో తీర్మానం చేసేస్తే పోలా అన్న భావనకు వచ్చారు.

ఇందుకోసం ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలోనే తీర్మానం చేసి రాజ్యాంగ సవరణ చేసేయాలని భావిస్తున్నారు. చేతిలో అధికారం ఉండటంతో ఏం తలుచుకుంటే అది చేసేయగలమన్న ధీమాతో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉంది. అసలు ఇండియా పేరంటేనే భయపడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే హ్యాట్రిక్ ధీమాతో నిన్న మొన్నటి వరకూ ధీమాతో ఉన్న మోడీ సర్కార్..  ఇటీవలి కాలంలో దేశంలో రాజకీయ మూడ్ మారుతున్న పరిస్థితిని గుర్తించి కంగారు పడుతోంది. మోడీ సర్కార్ పై పెరుగుతున్న వ్యతిరేకత.. సమాంతరంగా విపక్షాల ఐక్య కూటమికి సానుకూలంగా మారుతున్న సంకేతాలతో  అధికార బీజేపీ కంగారుపడుతోంది.

ఈ నేపథ్యంలోనే విపక్షాల ఐక్య కూటమి  ఇండియన్ నేషనల్ డెవలప్ మెంటల్ ఇనక్లూజివ్ అలయెన్స్ అలియాస్ ఇండియా పేరు కారణంగానే ఆ సానుకూలత సాకారమైందా అన్న అనుమానం వ్యక్తం అవుతున్నది. విపక్షాల ఐక్య కూటమి ఇండియాగా అవతరించిన క్షణం నుంచీ ఆ పేరుపై బీజేపీ విషం చిమ్ముతూనే ఉంది. ఆ పేరును సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అవేమీ చాలవన్నట్లుగా దేశం పేరు ఇండియా కాదు కేవలం భారత్ మాత్ర్ మాత్రమే అంటూ కొత్త రాగం అందుకుంటోంది. ఈ విషయంగా కేంద్రం నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలవడకపోయినప్పటికీ.. ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు సంకేతాలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.  జీ 20 శిఖరాగ్ర సదస్సు ఈ నెలలో భారత్ అధ్యక్షతన జరగనున్న సంగతి విదితమే. ఆ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు హాజరు కానున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సదస్సుకు హాజరు కానున్న పలు దేశాల అధినేతలకు రాజ్ భవన్ లో విందు ఏర్పాటు చేశారు. ఈ నెల 9న జరిగే ఆ విందుకోసం ముద్రించిన ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటంతో బీజేపీ ఆలోచనలు ఏ దిశగా సాగుతున్నాయి.. అడుగులు ఎటు పడుతున్నాయి అన్న విషయం తేటతెల్లమైపోయిందని పరిశీలకులు అంటున్నారు. సాధారణంగా ఆంగ్లంలో దేశం పేరును ఇండియాగా, ఇతర భాషల్లో భారత్ అని పేర్కొనడం కద్దు. ఇప్పటి వరకూ ఇదే ఒరవడి నడుస్తున్నది. కానీ రాష్టపతి ముర్ము ఆహ్వానపత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఆంగ్లంలో ముద్రించడంతో ఇండియా పేరు ఎక్కడ కనిపించకూడదన్న లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తున్నదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ముందుగా ఆహ్వాన పత్రికలో దేశం పేరును ఆంగ్లంలో కూడా భారత్ అని ముద్రించడాన్ని గుర్తించిన కాంగ్రెస్ కేంద్రంలోని మోడీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఏకపక్ష నిర్ణయాలతో మోడీ సర్కార్ ఫెడరల్ స్ఫూర్తిని దేబ్బతీస్తోందని విమర్శించింది. అంతే కాకుండా ఇండియా అన్న పేరు అంటేనే వణికి పోతున్న మోడీ.. ఆ పేరుకు శాశ్వతంగా సమాధి కట్టే దిశగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారని దుయ్యబట్టింది. ఇండియా పేరును శాశ్వతంగా చెరిపేసే దిశగా వేస్తున్న అడుగులలో భాగమే రాష్ట్రపతి ఆహ్వానపత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జమిలి, ఇండియా పేరు తుడిచేయడం వంటి ప్రత్యేక అజెండాతోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను కేంద్రం నిర్వహిస్తోందని అంటున్నారు. ఆ అజెండాను అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ అనివార్యమని.. అందుకే ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించి.. నయానో భయానో కలిసి వచ్చే పార్టీలను అలంబనగా చేసుకుని కాగల కార్యాన్ని సాధించేందుకు మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదంటున్నారు.  ఇండియా పేరును ఎరాడికేట్ చేసేయాలన్న బీజేపీ తపన వెనుక విపక్షాల ఐక్య కూటమిని దెబ్బతీయడంతో పాటు.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఇండియా అన్న పేరును పలుచన చేయడమన్న లక్ష్యం కూడా ఉందంటున్నారు. భారతీయ జనతా పార్టీ పేరులో ఉన్న భారత్ అన్న పదమే దేశానికి ఏకైక ప్రతీకగా నిలుస్తుందన్న భావన కూడా ఉందని చెబుతున్నారు.