రాజకీయంగా మద్దాలి గిరికి ఇక ఫుల్ స్టాపేనా? | is it a full stop to maddali giri political life| ycp| vijayasai
posted on Sep 6, 2023 10:34AM
గుంటూరు తూర్పు శాసనసభ నియోజక వర్గానికి వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా షేక్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, పశ్చిమ నియోజకవర్గానికి తెలుగుదేశం ఎమ్మెల్యే మద్దాలి గిరి ప్రతినిధ్యం వహిస్తున్నారు. అయితే మద్దాలి గిరి వైసీపీలో కి జంప్ అయిన విషయం తెలిసిందే. దాంతో గుంటూరు రెండు నియోజకవర్గాలు వైసీపీ చేతిలోకి వచ్చేసినట్లైంది. అలా నాలుగేళ్లు గడిచి పోయాయి. కానీ మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఈ రెండు నియోజకవర్గాలలో ఎవరికి ఇవ్వాలనే దానిపై జిల్లా ఇన్‌ఛార్జ్ విజయసాయి రెడ్డి ఇటీవల సమీక్షా సమావేశం జరిపారు.
తూర్పు నియోజకవర్గం మహమ్మద్ ముస్తఫా షేక్ పనితీరు, ఐప్యాక్ నివేదిక అంతా బాగానే ఉందంటూ నివేదిక ఇవ్వడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫాకే మళ్లీ టిక్కెట్ ఖాయమని భావిస్తున్నారు. అయితే ఈసారి తనకు బదులు తన కుమార్తె షేక్ నూరి ఫాతిమాకు అవకాశం ఇవ్వాలని ముస్తాఫా జగన్‌ను అభ్యర్ధించారు. అందుకు… విజయసాయి రెడ్డి సమీక్షా సమావేశంలో చర్చించి సుముఖత వ్యక్తం చేశారు. దీంతో గుంటూరు తూర్పు అభ్యర్థి ఎవరన్న విషయంలో వ్యవహారం అంతా సాఫీగానే ముగిసినట్లైంది. అయితే గుంటూరు వెస్ట్ నియోజకవర్గం అభ్యర్థి ఎంపిక మాత్రం వైసీపీకి తలనొప్పి తెస్తున్నది. గుంటూరు పశ్చిమ టికెట్ కోసం గత ఎన్నికలలో పోటీ చేసి… మద్దాలి గిరి చేతిలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్ధి ఏసు రత్నంకి జగన్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా నేటికీ ఆయననే పశ్చిమ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగిస్తున్నారు.
కనుక మళ్ళీ తనకే ఎమ్మెల్యే టికెట్ వస్తుందనే నమ్మకంతో ఆయన నియోజకవర్గంలో పని చేసుకొంటున్నారు. నియోజకవర్గంలో కులాల లెక్కల ప్రకారం చూసినా మళ్ళీ తనకే టికెట్ గ్యారెంటీ అను ఏసురత్నం ధీమాగా ఉన్నారు. అయితే విజయసాయి రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో వీరిద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయం తేల్చ లేదు. దీంతో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎవరు నిలబడతారన్న విషయంలో పార్టీ వర్గాల్లోనే కాకుండా ఆ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న మద్దాలి గిరి, ఏసురత్నంలలో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసే విషయంలో అటు గిరి ఇటు ఏసురత్నం ఇద్దరూ పట్టుదలగా ఉన్నారు. ఒకవేళ ఏసురత్నంకే టికెట్ కేటాయిస్తే తెలుగుదేశం నుంచి వైసీపీలోకి జంప్ చేసిన మద్దాలి గిరి రాజకీయ జీవితానికి చుక్కప డినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
గన్నవరంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు… వైసీపీ టిక్కెట్ తో పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావ్… మళ్లీ టిక్కెట్ వచ్చే పరిస్థితి లేదన్న విషయం నిర్ధారణ అయిపోవడంతో తెలుగుదేశం గూటికి చేరి ఆ పార్టీ టికెట్ ను దాదాపుగా దక్కించేసుకున్నారు. అయితే మద్దాలి గిరి తెలుగుదేశం నుంచి విజయం సాధించి వైసీపీ గూటికి చేరి ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిగా మారిపోయారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.