స్టాలిన్-శివకుమార్ మధ్య వర్తులుగా వైఎస్ ఆస్తుల పంపకం.. షర్మిల, జగన్ మధ్య డీల్ ఒకే! | stalin and shivkumar mediaters| jagan| sharmila| ys| assets| distribute| deal
posted on Sep 6, 2023 10:09AM
ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం అనంతరం ఆయన కుటుంబం ఏకతాటిపైకి వచ్చిన సంగతి తెలిసిందే. వైఎస్ మరణాంతరం ఆయన రాజకీయ వారసుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలని ఆశపడ్డారు. అయితే వైఎస్ఆర్ సీఎంగా పనిచేసింది ఆయన సొంత పార్టీ కాదు కనుక అది సాధ్యపడలేదు. అప్పటికే కాంగ్రెస్ పెద్దలు రెండు మూడుసార్లు జగన్ క్రమశిక్షణ విషయంలో వైఎస్ఆర్ కు క్లాస్ కూడా పీకిన నేపథ్యంతో జగన్ ను సీఎం చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు అంగీకరించలేదు. అదే సమయంలో జగన్ కాంగ్రెస్ లో విభేదించి అప్పటికే తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి రిజిస్టర్ చేసుకున్న వైఎస్ఆర్ పార్టీని హస్తగతం చేసుకొని సొంత కుంపటి పెట్టుకున్నారు. ఈ సమయంలో కూడా వైఎస్ కుటుంబం అంతా జగన్ వెంటే ఉన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ 16 నెలల పాటు జైల్లో ఉండగా.. ఆ కుటుంబమే పార్టీని కాపాడింది.
ముఖ్యంగా జగన్ జైల్లో ఉండగా.. తల్లి విజయమ్మను వెంటపెట్టుకొని సోదరి షర్మిల రంగంలోకి దిగారు. జగన్ స్థానంలో పాదయాత్రను పరుగులు పెట్టించి జగనన్న వదిలిన బాణంగా పేరు తెచ్చుకున్నారు. ఈ సమయంలో ఎక్కడా ఈ కుటుంబంలో ఎలాంటి పొరపొచ్చాలు లేవు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చాక, జగన్ సీఎం అయ్యాక ఈ కుటుంబంలో లుకలుకలు మొదలయ్యాయి. ముఖ్యంగా జగన్.. ఆయన భార్య భారతి ఒకవైపు.. మిగిలిన కుటుంబ సభ్యులంతా మరొక వైపు అన్నట్లుగా చీలిపోయారు. జగన్ అధికారంలోకి వచ్చాక చెల్లి షర్మిలను దూరం పెట్టడం తల్లి విజయమ్మను బాధించగా.. వివేకా హత్య ఆ కుటుంబంలో మిగతా వారిని జగన్ కు దూరం చేసింది. ఈ రాజకీయ, వ్యక్తిగత సమస్యల కారణంగానే వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకాలలో వివాదాలు కూడా బయటపడినట్లు తెలుస్తుంది. ఈ వివాదాల కారణంగానే షర్మిల, విజయమ్మలను జగన్ బెదిరించారని కూడా మీడియాలో కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.
అయితే, ఇప్పుడు ఫైనల్ గా వైఎస్ఆర్ ఆస్తుల పంపకం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ నాయకురాలిగా మారిపోతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటారని ప్రచారం కూడా జరిగింది. పరిణామాలన్నిటినీ గమనించిన వైఎస్ జగన్ సోదరి షర్మిలతో వివాదాలను చక్కదిద్దుకొనే పనిలో భాగంగా ఆస్తి పంపకాల వివాదాలను సరిచేసుకున్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది. వైఎస్ కుటుంబ ఆస్తి పంపకాలు ఇద్దరు బడా నేతల సమక్షంలో జరిగినట్లు తెలుస్తుంది. దక్షణాది రాజకీయాలలో కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్ కు ట్రబుల్ షూటర్ గా పేరున్న సంగతి తెలిసిందే. షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం క్రెడిట్ కూడా శివకుమార్ దే. కాగా ఇప్పుడు ఆయనే వైఎస్ ఆస్తి పంపకాల విషయంలో కూడా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తున్నది. శివకుమార్ షర్మిల తరపున ఈ పంపకాలలో పాల్గొనగా.. వైఎస్ జగన్ తన తరపున తమిళనాడు సీఎం స్టాలిన్ ను పంపినట్లు తెలుస్తోంది.
మొత్తం మీద వైఎస్ ఆస్తి పంపకాల వివాదం ఈ ఇద్దరి సమక్షంలో పరిష్కారమైనట్లు, ముఖ్యంగా సీఎంగా వైఎస్ సంపాదించిన తెలంగాణ ఆస్తులలో షర్మిల వాటా తేల్చి అప్పగించినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఈ ఆస్తి పంపకాలతో షర్మిల సంతృప్తి చెందగా.. ఇకపై జగన్ వాటా ఆస్తులతో షర్మిలకు ఎలాంటి సంబంధం లేకుండా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది. అంతే కాదు, షర్మిల భవిష్యత్తులో ఏపీ రాజకీయాలలోకి అడుగుపెట్టరాదన్నట్లుగా కూడా ఒప్పందం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. షర్మిల ఇకపై ఏపీ తప్ప మిగతా ఏ రాష్ట్రం నుండైనా రాజకీయాలు చేసుకోవచ్చని, అలాగే కుటుంబ, వ్యక్తిగత విషయాలపై షర్మిల ఎలాంటి విమర్శలు చేయకూడదని స్టాలిన్, శివకుమార్ సాక్షిగా డీల్ కుదిరినట్లు చెప్తున్నారు. ఈ పంపకాలు, వివాదాల తర్వాతనే షర్మిల ఏపీ రాజకీయాలలోకి వెళ్లే విషయంలో వెనక్కి తగ్గినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.