శాశ్వత అధికారం దిశగా మోడీ అడుగులు.. విపక్షాల ఆందోళన! | modi steps towards permanent power| opposition| unity| nation| name| change| one| nation| one
posted on Sep 6, 2023 12:35PM
ప్రధాని నరేంద్రమోడీ నియంతృత్వ పోకడలు దేశానికి చేటుగా పరిణమిస్తున్నాయని విపక్షాలు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నాయి. అంతేనా మోడీ నేతృత్వంలో కేంద్ర సర్కార్ రాష్ట్రాల ఆదాయాన్నీ, హక్కులను హరించేస్తున్నదన్న ఆందోళన బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలోనే మోడీ మరో సారి ప్రధాని అయితే.. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తారంటూ విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.
అసలింతకీ మోడీ మరో సారి అధికారంలోకి వస్తారా? రారా అన్నది పక్కన పెడితే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల పేరిట ఆయన రాజ్యాంగాన్ని మర్చే ప్రయత్నాలు ఇప్పుడే ప్రారంభించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఇటీవలే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. సమావేశాలు మణిపూర్ హింసాకాండపై సుదీర్ఘ ప్రతిష్ఠంభణతో వాయిదాల పర్వం నడిచింది. ఈ సమావేశాలలోనే విపక్షాలు మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి కూడా. ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయిందనుకోండి అది వేరే సంగతి. ఆ సమావేశాలు ముగిసిన వెంటనే మళ్లీ ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణ ఎందుకు? అజెండా ఏమిటి? అన్న విపక్షాల ప్రశ్నలకు మోడీ సర్కార్ సమాధానం చెప్పడం లేదు. కానీ ఇస్తున్న లీకులు.. మంత్రులు, బీజేపీ నేతల మాటలను బట్టి రెండు కీలక అంశాలను ఈ ప్రత్యేక సమావేశాలలో చేపట్టి సభ ఆమోదం పొంది చట్టం చేయాలన్న లక్ష్యంతో కేంద్రంలోని మోడీ సర్కార్ ఉన్నట్లు అవగతమౌతున్నదని పరీశీలకులు వివరిస్తున్నారు.
వాటిలో ఒకటి జమిలి ఎన్నికలు కాగా మరొకటి దేశం పేరు మార్పు. ఈ రెండు అంశాలలో బీజేపీ సక్సెస్ అయితే మోడీ హ్యాట్రిక్ సాధించే వరకూ ఆగనవసరం లేకుండానే నియంత అయిపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయినా మోడీలోని నియంతృత్వ పోకడలు ఆయన ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. కీలక అంశాల విషయంలో ఇసుమంతైనా ఆమోదయోగ్యం కాని మౌనం వహించడం.. ఎన్నికల ప్రచారాలలో ఉద్వేగభరిత ప్రసంగాలు, విపక్షాలపై విమర్శల దాడులతో విరుచుకుపడటం తప్ప మోడీ కనీసం తన ప్రభుత్వ విధానాలను వివరించేందుకు మీడియా సమావేశాలు సైతం ఏర్పాటు చేయరని పరిశీలకులు అంటున్నారు. భారత్ గా దేశం పేరు మార్పు, జమిలి ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశాల నిర్వహణ ద్వారా మరో మారు తాను అధికారంలోకి రావడానికి రాచబాట పరుచుకుని.. ఆ తరువాత చైనా అధ్యక్షుడి బాటలో జీవితకాల ప్రధానిగా ప్రకటించు కుంటారన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, శాశ్వతంగా అధికారంలో ఉండేలా, రాజ్యంగాన్ని మార్చి రాజరిక వ్యవస్థను ప్రవేశ పెడుతుందని ఇప్పటికే ఆప్ ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా, మోడీ కుట్రలను ఎదుర్కొనేందుకు విపక్షాల ఐక్యత అనివార్యమని పదే పదే చెబుతోంది. నిజానికి, 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావలసిన అవసరాన్ని, ఒక్క ఆప్ మాత్రమే కాదు, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఎప్పుడో గుర్తించాయి. అందుకే దేశాన్ని ఈ విపత్తు నుంచి కాపాడేందుకు, విపక్ష పార్టీలు అన్నీ కలిసి పోటీ చేయాలని, లేదంటే, 2024 ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ ను అడ్డుకోవడం అయ్యే పనికాదన్న భావన దాదాపు అన్ని బీజేపీయేతర పార్టీలలోనూ వ్యక్తమౌతున్నది.