posted on Sep 6, 2023 3:33PM
భారతీయ జనతాపార్టీ.. దేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ. విపక్షాల ఐక్యతా యత్నాలను భగ్నం చేసి కేంద్రంలో ముచ్చటగా మూడో సారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న పార్టీ. ఇందు కోసం ఆ పార్టీ అనసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి దోహదం చేసేవిగా లేవన్న విమర్శలను ఇసుమంతైనా పట్టించుకోకుండా బీజేపీయేతర పార్టీలను బలహీనం చేసేందుకు ఎత్తులు, పై ఎత్తులూ వేస్తున్న పార్టీ. అనుకూల సర్వేలనండి, మరోటేదైనా అనండి 2024 సార్వత్రిక ఎన్నికలలో మోడీ నాయకత్వానిదే విజయం అని మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఓ వైపు కాంగ్రెస్ బలంగా పుంజుకుందని చెబుతున్న సర్వేలే.. మోడీ మరోసారి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని పేర్కొంటున్నాయి.
ఇవన్నీ పక్కన పెడితే కేంద్రంలో అధికారంలో ఉన్నది పేరుకు ఎన్డీయే సర్కారే కానీ.. ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాలన్నీ ఎప్పుడో నామావశిష్ఠంగా మారిపోయాయి. ఎన్డీయే కూటమిలో ఉన్న ఏ పార్టీకీ కూడా సార్వత్రిక ఎన్నికలలో సింగిల్ డిజిట్ కు మించి స్థానాలొచ్చే అవకాశం లేదనీ.. మరో సారి కేంద్రంలో మోడీ సర్కార్ ఖాయమంటే తేల్చిన సర్వేలే కుండబద్దలు కొడుతున్నాయి. అంటే భాగస్వామ్య పార్టీలను నిర్వీర్యం చేసి బీజేపీ ఆయా పార్టీలు గతంలో బలంగా ఉన్న రాష్ట్రాలలో వాటి ఉనికిని నామమాత్రం చేయడంలో బీజేపీ విజయవంతమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉదాహరణగా శివసేన, ఎన్సీపీల పరిస్ధితిని చూపుతున్నారు.
ఇక ఉత్తరాదిన ప్రాంతీయ పార్టీలన్నీ ఎప్పుడో బీజేపీ తోక పార్టీలుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తున్నది. ఎక్కడో బీహార్ వంటి ఒకటి రెండు చోట్ల ఇందుకు మినహాయింపు ఉండే ఉండొచ్చు కానీ మొత్తంగా బీజేపీ పెద్దన్న పాత్ర పోషించి దేశంలోని చిన్నా చితకా పార్టీలన్నిటినీ దాదాపు నిర్వీర్యం చేసేసింది. అయితే ఈ క్రమంలో ఆమెకు దక్షిణాది రాష్ట్రాలు ఏ మాత్రం కొరుకుడు పడలేదు. దొడ్డి దారిన కర్నాటకలో అధికారాన్ని చేజిక్కించుకున్నా.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారాన్ని చేజార్చుకుంది. ఆ ఒక్క ఓటమి దక్షిణాదిలో బీజేపీ ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా బలహీన పరిచింది. సరే తెలంగాణలో ఏదో మేరకు పార్టీ అధికారం కోసం తలపడుతోందనిపించే పరిస్థితిని కాపాడుకుంటోంది. కానీ ఏపీలో మాత్రం బీజేపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఆ రాష్ట్రంలో బీజేపీ నాయకులు త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నట్లుగా ఉన్నారు. ఏపీలో బీజేపీ రాజకీయం ఏమిటో? ఆ పార్టీ రాష్ట్ర నేతలకు ఇసుమంతైనా తెలియదు.
బీజేపీ అధినాయకత్వం ఏపీ విషయంలో అనుసరిస్తున్న విధానం ఢిల్లీలో దోస్తీ, గల్లీలో ఘర్షణ అన్నట్లుగా ఉంది. దీంతో బీజేపీ ఏపీ నేతలు తాము యుద్ధం చేస్తున్నామా? సొంత పార్టీ చేతుల్లోనే పావులుగా మారి ఉన్న కొద్ది పాటి గౌరవాన్నీ కోల్పోతున్నామో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. తాము రాష్ట్రంలో అధికార పార్టీతో పోరాడుతున్నామా? లేక తమ విమర్శలన్నీ అధినాయత్వం రాష్ట్రంలో జగన్ సర్కార్ కొనసాగిస్తున్న రహస్య మైత్రి కారణంగా గాలిలో కలిసిపోతున్నాయా అర్థం కాని అయోమయంలో ఉన్నారు. రాష్ట్రంలో తమ ప్రత్యర్థి ఎవరో తెలియని గందరగోళంలో ఉన్నారు. చీకట్లో కన్నుకొడుతున్నారు. హస్తినలో బీజేపీ అధినాయకత్వం జగన్ సర్కార్ కు అన్ని విధాలుగా అండదండలు అందిస్తుంటే.. ఇక్కడ మాత్రం తాను యుద్ధం చేస్తున్నట్లు చేయాల్సి వస్తున్నది. ఆ కరణంగానే తమ విమర్శలు తమలపాకుతో తడిమినట్లుగాఢిల్లీ రాజు ఇక్కడ తమ ప్రత్యర్ధికి దన్నుగా నిలిస్తే, తాము మాత్రం అదే ప్రత్యర్ధిపై యుద్ధం చేయాల్సిన వైచిత్రి. తమ గమ్యం.. గమనం ఏమిటో.. ఎటువైపో తెలియని విషాదం. పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టగానే జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వంపై గణాంకాలతో సహా కేంద్ర విత్త మంత్రి నిర్మలాసీతారామన్ కు వివరించారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు కూడా చేశారు.
అయితే విత్త మంత్రి నుంచి ఇంత వరకూ ఎలాంటి స్పందనా లేదు. పైపెచ్చు నిబంధనలకు విరుద్ధంగా జగన్ సర్కార్ ఎటువంటి రుణాలూ తీసుకోలేదంటూ కేవలం ఆర్బీఐ నివేదికలను ఉటంకిస్తూ క్లీన్ చిట్ ఇచ్చేశారు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకులు దిగ్భ్రాంతి చెందారు. ఏపీలోని అధికార వైసీపీపై తమను ఉత్తుత్తి యుద్ధం చేయమని పార్టీ అధిష్ఠానం చెబుతోందా అన్న అనుమానాలు పార్టీ రాష్ట్ర నాయకులలో వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు ఏపీ సీఎం-వైసీపీ అధినేత జగనన్న.. ఢిల్లీ నేతలతో అంటకాగుతుంటే, మరోవైపు తాము మాత్రం అదే జగనన్న సర్కారుపై.. యుద్ధం చేయాల్సిన విచిత్ర పరిస్థితుల్లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. జగన్ పై బీజేపీ ఏపీ నాయకులు విమర్శలు గుప్పించడం.. అభాసుపాలు కావడం రివాజుగా మారిపోయింది. ఈ పరిస్థితి బీజేపీ నాయకులలో పార్టీ పట్ల విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నది. ఏపీలో మా పార్టీ అగ్రనాయకత్వం ఏం చేస్తోందో, ఏం చేయాలనుకుంటోందో మాకైతే అర్ధం కావడం లేదు. కనీసం పార్టీ అగ్రనాయకత్వానికైనా అర్ధం అవుతోందా? అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయనీ ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారంటేనే ఏపీలో బీజేపీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం అవుతోంది. ఇటీవల జగన్ సర్కార్ టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యులను నియమించింది. ఆ నియామకాల్లో బోర్డు సభ్యుడిగా నియమితులైన వారిలో సగం మందికి పైగా బీజేపీ అగ్రనేతల సిఫారసు మేరకు నియమితులైన వారే కావడాన్ని బట్టే జగన్ ప్రభుత్వం, బీజేపీ అధినాయకత్వం మధ్య సమన్వయం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో తమ పార్టీ పెద్దల సిఫారసులకు అనుగుణంగానే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యుల నియామకాలు జరిగాయన్న సంగతి రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి తెలియకపోవడాన్ని బట్టే పార్టీ అధిష్ఠానం రాష్ట్ర నాయకీత్వానికి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటన్నదిద తేటతెల్లమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉంటేనే ఆబోరు దక్కుతుందన్న భావనకు వచ్చినట్లుగా చెబుతున్నారు.