లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీ?! | lagadapati to enter into politics again| andhra| octopus| election| surveys| state
posted on Sep 6, 2023 5:58PM
ముందస్తు ఎన్నికలు జరగనున్నాయన్న అంచనాల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు రోజు రోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. ముందస్తు లేకపోయినా ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడింది. ఎన్నికలకు ఇంకా ఏడెనిమిది నెలల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రజాక్షేత్రంలో దిగి ప్రత్యక్ష యుద్ధం మొదలు పెట్టాయి. అధికార పార్టీ కూడా ఒకవైపు ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తున్నది. ఇలాంటి తరుణంలో కొందరు సీనియర్ నేతలు మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ అయ్యేందుకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తుంది. అలాంటి వారిలో ఆంధ్రా ఆక్టోపస్ గా పేరు తెచ్చుకున్న లగడపాటి రాజగోపాల్ కూడా ఒకరు. ప్రత్యక్ష రాజాకీయాలతో పాటు ఎన్నికల సర్వేలు నిర్వహించి తన ఫలితాలతో తెలుగు రాష్టాల ప్రజలకు బాగా సుపరిచితుడైన లగడపాటి ఇప్పుడు మళ్ళీ రాజకీయాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
విజయవాడ ఎంపీగా పనిచేసిన లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 2004 ఎన్నికలకు ముందు వైఎస్ తో కలసి రాష్ట్రమంతా పాదయాత్ర చేసినవారిలో లగడపాటి కూడా ఒకరు. ఆ తర్వాత వైఎస్ కోటరీలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన లగడపాటికి ఆర్ధిక పుష్టి ఉండడంతో వైఎస్ 2004 ఎన్నికల్లో తొలిసారి అవకాశం ఇచ్చారు. 2004లో టీడీపీ అభ్యర్థి ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ను ఓడించగా.. 2009లో టీడీపీ తరఫున పోటీ చేసిన ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై విజయం సాధించారు. ఇక 2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ లగడపాటి గట్టిగా పోరాడిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ తలపులు మూసి విభజన చేసిన సమయంలో లగడపాటి పెప్పర్ స్ప్రే చల్లారంటూ తీవ్ర ఆరోపణలను కూడా ఎదుర్కొన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమైనా.. లగడపాటి రాజగోపాల్ నిర్వహించే ఎన్నికల సర్వేలకు విపరీతమైన ఆదరణ ఉండేది. సొంతంగా తన టీమ్ ద్వారా సర్వేలు నిర్వహించే లగడపాటి చెప్పే ఎన్నికల ఫలితాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఆతృతగా ఎదురు చూసేది. అయితే 2019 ఎన్నికల ముందు లగడపాటి నిర్వహించిన సర్వే ఆధారంగా.. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని చెప్పారు. కానీ, అందుకు విరుద్ధంగా వైసీపీ ఘనవిజయం సాధించింది. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు రావడంతో ఇకపై సర్వేలు కూడా నిర్వహించనని ప్రకటించారు. అప్పటి నుండి పూర్తిగా తన వ్యాపారాలపై దృష్టి పెట్టిన లగడపాటి ఇప్పుడు మళ్ళీ రాజకీయాలలోకి పునఃప్రవేశానికి సిద్ధమవుతున్నట్టు విజయవాడ రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తుంది. ఆ మాటకొస్తే గతంలో 2019 ఎన్నికల్లో కూడా లగడపాటి టీడీపీలో చేరతారని, మళ్ళీ ఆయన రాజకీయాలలోకి వస్తారని ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాలేదు.
అయితే, ఈసారి ఆయన రీఎంట్రీ ఖాయమని గట్టిగా వినిపిస్తుంది. ఈ మధ్యనే విజయవాడలో రాజగోపాల్ తన మద్దతుదారులతో సమావేశమైన నేపథ్యంలో ఈ ప్రచారం ఊపందుకుంది. త్వరలోనే విజయవాడలోని అన్ని నియోజకవర్గాల్లో లగడపాటి ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్ నెలాఖరులో లగడపాటి సమావేశాలకి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక, ఆయన స్థానమైన విజయవాడ ఎంపీగా ప్రస్తుతం కేశినేని నానీ ఉండగా.. వచ్చే ఎన్నికలలో ఆయన పోటీ చేయనని ప్రకటించారు. దీంతో ఇక్కడ టీడీపీ నుండి కేశినేని నానీ తమ్ముడు చిన్నీ కానీ మరో బలమైన నేతను రంగంలోకి దింపాలని టీడీపీ ప్రయత్నిస్తుంది. వైసీపీ కూడా ఇక్కడ గట్టి అభ్యర్థి కోసం వెతుకులాడుతుంది. ఈ క్రమంలో లగడపాటి మళ్ళీ రాజకీయాలలోకి వస్తే టీడీపీలో చేరతారా? లేక వైసీపీ నుండి పోటీ చేస్తారా అన్న ఆసక్తి కలుగుతున్నది. దీంతో పాటు అసలు లగడపాటి మళ్ళీ రాజకీయాలలోకి వస్తారా? లేక గతంలో మాదిరి ఈసారి కూడా ఇది ప్రచారంగానే మిగిలిపోతుందా అన్న చర్చ కూడా సాగుతోంది.