posted on Sep 6, 2023 4:32PM
తనను ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందని మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో పల్లె ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమంలో చంద్రబాబు బుధవారం ప్రసంగించారు. ఆ సందర్భంగా చంద్రబాబునాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అధికారపక్షం తనను బయటకు రాకుండా అడ్డుకుంటున్నదనీ.. తనపై కూడా దాడులు చేస్తున్నారని.. తమ పార్టీ శ్రేణులపై కూడా రౌడీలతో దాడులు చేయిస్తున్నారని.. ఇప్పుడు తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ అరాచక పాలన అంతం కోసం ఇంటికొకరు చొప్పున తనతో పాటు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని.. తనపై కూడా దాడులు జరిగే అవకాశం కూడా ఉందని వ్యాఖ్యానించారు.
అయితే వైసీపీ నేతలు ఎన్ని చేసినా ఏం చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న చంద్రబాబు, మహాభారతం, రామాయణంలో ధర్మం గెలిచినట్టు చివరకు తెలుగుదేశమే విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ రాని మెజార్టీ ఈ ఎన్నికల్లో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన.. నిప్పులా బతికిన తనను తప్పుడు వ్యక్తిగా చూపేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అంగళ్ళలో తనమీద హత్యా ప్రయత్నం చేసి తిరిగి తనపైనే ఐపీసీ 307కింద కేసు పెట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. అంతేకాదు తామే దాడులు చేసినట్టు ఒత్తిడి చేస్తూ స్టేట్మెంట్లు రాయిస్తున్నారని, కావాలని తప్పుడు కేసులలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. యువగళం పాదయాత్రకు వచ్చి దాడులు చేసి టిడిపి నేతలపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని.. ఏపీ సీఎం సైకోలా వ్యవహరిస్తున్నారని, సైకో పాలన నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.
కాగా, చంద్రబాబు తనను అరెస్ట్ చేస్తారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో సంచలనంగా మారింది. అసలు చంద్రబాబును ఏ కేసులో అరెస్ట్ చేస్తారనే చర్చలు మొదలయ్యాయి. ఇటీవల కాలంలో ఐటీ శాఖ నుండి చంద్రబాబుకు షోకాజ్ నోటీసులు వచ్చినట్టుగా ఓ జాతీయ పత్రిక కథనం ప్రచురింది. గత ప్రభుత్వ హయంలో వివిధ కాంట్రాక్టుసంస్థల నుంచి చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని, ఈ కేసులోనే ఐటీశాఖ నోటీసులు ఇచ్చినట్లు జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది. లెక్క చూపని డబ్బు రూ.118 కోట్లు ఆయన వద్ద ఉందని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించినట్లు కథనంలో రాసుకొచ్చారు. ఈ కథనం ఆధారంగానే చంద్రబాబుపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. కాగా, ముందస్తు సమాచారం లేకుండా చంద్రబాబు ఎప్పుడూ మాట తూలరు. సరైన ఆధారం ఉంటేనే ఆయన మీడియాకు చెబుతారు. ఇలాంటి సమయంలో తన అరెస్ట్ ను ఆయనే ఇప్పుడు ధృవీకరించడం టీడీపీ వర్గాల్లో అలజడి సృష్టిస్తున్నది.
అయితే వస్తున్న కథనాల ప్రకారం చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇచ్చింది ఐటీ విభాగం. కానీ, ఐటీ విభాగానికి అరెస్ట్ చేసే అధికారం లేదు. ఈడీకి అరెస్ట్ చేసే అధికారాలు ఉన్నాయి. అంటే ఈ వ్యవహారం ఇప్పుడు ఈడీకి అప్పగించనున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజులలో ఈ వ్యవహారం ఈడీకి వెళ్తుంది.. అప్పుడు తనను అరెస్ట్ చేస్తారని చంద్రబాబు చెప్పినట్లు భావించాల్సి వస్తుంది. మరోవైపు చంద్రబాబును అరెస్ట్ చేసేది కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాదని.. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచే ఈ అరెస్టులు ఉండనున్నాయని కూడా మరో వాదన వినిపిస్తుంది. ఏపీ సర్కారే తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారని, అక్రమ కేసులు బనాయించి ఒక్కసారైనా చంద్రబాబును అరెస్ట్ చేయాలని సీఎం జగన్ ఆశపడుతున్నారని.. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న జగన్ వచ్చే సమయానికి ఆయన కోరిక తీర్చాలని కొందరు ప్రభుత్వ పెద్దలు కంకణం కట్టుకున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మరి ఇంతకీ చంద్రబాబు ఏ కేసులో అరెస్ట్ కాబోతున్నారు. ఒక వేళ ఆయన అరెస్ట్ అయితే టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకోనున్నాయో చూడాల్సి ఉంది.