Leading News Portal in Telugu

వారానికి మూడు రోజులు విశాఖలోనే జగన్?.. దసరాకి గృహ ప్రవేశం! | jagan to shift vizag| three| days| rule| residence


posted on Sep 7, 2023 1:26PM

ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే తప్పేంటి?.. ఏమో మన ఏపీకి కూడా మూడు రాజధానులు వస్తాయేమో. ఇదీ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ 2019లో చేసిన ప్రకటన. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ మోహన్ రెడ్డే ఈ విషయాన్ని ముందు బయటపెట్టగా.. ఆ తర్వాత మిగతా వైసీపీ నేతలు ప్రజల చెవులలో ఊదరగొట్టారు. అయితే ప్రభుత్వం ఇది ప్రకటించి నాలుగేళ్లు అయ్యింది. మూడు రాజధానులు లేవు. ఉన్న అప్పటి వరకూ ఉన్న ఒక్క రాజధాని అమరావతిలో కొత్తగా ఒక్క ఇటుక పెట్టింది లేదు. రాష్ట్రంలో ఎన్నికలకు మరో ఏడెనిమిది నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికీ మా నినాదం మూడు రాజధానులే. అందులో పరిపాలన విశాఖ నుండే అన్నది వైసీపీ నేతల వాదన. అయితే, ప్రస్తుతం ఈ అంశం కోర్టుల పరిధిలో ఉండగా అక్కడ విచారణ పూర్తయ్యేసరికి ఈ ప్రభుత్వానికి ఉన్న ఐదేళ్ల గడువూ పూర్తయిపోతుంది.  అందుకే అనధికారికంగా అయినా విశాఖ నుండి పరిపాలన చేసి తన పరువు కాపాడుకోవాలని సీఎం జగన్ ఆరాటపడుతున్నారు.

జగన్ అధికారంలోకి రాగానే మూడు రాజధానుల బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టం చేశారు. అమరావతి రైతులు ఉవ్వెత్తున ఉద్యమాన్ని తీసుకురావడం, విపక్షాల తీవ్ర వ్యతిరేకత, కోర్టులలో పిటిషన్ల దాఖలు చేయడంతో కోర్టులు అమరావతి రాజధానికే అనుకూలంగా తీర్పులు ఇచ్చాయి.  హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్లగా అక్కడ కూడా వ్యతిరేక తీర్పు వస్తుందనే ఆలోచనతో మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్నారు కూడా. అయితే  సుప్రీం కోర్టులో వ్యవహారం మాత్రం ఇంకా విచారణ దశలోనే ఉంది. గతంలో ప్రభుత్వం అమరావతి రైతుల నుండి భూములను తీసుకున్న సమయంలో చేసుకున్న ఒప్పందాలను బట్టి చూస్తే ఈ అంశంలో ఇప్పటి ఏపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఈ విషయం ఇప్పటి ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు. కానీ, తాము చెప్పినట్లుగా విశాఖను పరిపాలన రాజధాని చేయాలి. అధికారికంగా ఎలాగూ వీలు పడదు కనుక కనీసం అనధికారికంగా విశాఖ నుండి పరిపాలన చేసి పరువు నిలుపుకోవాలన్నది సీఎం జగన్ ఆరాటం.

ఇందుకోసమే విశాఖలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది. రుషికొండపై కట్టడాల నిర్మాణం గురించి ఆంధ్ర ప్రజానీకం మొత్తానికి తెలిసిందే. పర్యాటక భవనాల పేరిట ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలు పరిపాలన భవనాలని ముందుగా వైసీపీ అధికారికంగా ప్రకటించి తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుంది. ఇది కాకుండా విశాఖ నగరంలో కూడా మరో చోట సీఎం నివాసానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సీఎం నగరానికి వస్తున్నారని పలుచోట్ల త్వరితగతిన అభివృద్ధి పనులు కూడా చేపడుతున్నారు. ఇవి నాసిరకంగా ఉంటున్నాయన్న విమర్శలు కూడా ఇప్పటికే వినపడుతున్నాయి. కాగా  జగన్ విశాఖ నుండి పరిపాలనకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తున్నది. ఈ దసరాకి సీఎం విశాఖ నుండి పరిపాలన మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారుల నుండి సమాచారం వస్తున్నది.

ఇప్పటికే విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ హోదాను పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటి దాకా ఐజీ ర్యాంక్ హోదాలో ఉన్న విశాఖ కమిషనరేట్ ని అడిషనల్ డీజీ హోదాకు అప్ గ్రేడ్ చేశారు. ఈ మేరకు హోం శాఖ   ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇదంతా జగన్ ఇక్కడ నుండే  పాలన సాగించేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగమేనని చెప్పొచ్చు. ఇక  రుషికొండ వద్ద కొత్తగా నిర్మిస్తున్న భవనాలలో ఒకటి మంచి వ్యూ పాయింట్ తో ఉన్నదానిలో సీఎం జగన్ నివాసం ఉండనున్నట్లు తెలుస్తుంది. అలాగే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు సంబంధించిన ఒక భవనంలో క్యాంప్ కార్యాలయాన్ని  ఏర్పాటు చేసుకోనున్నట్లు చెప్తున్నారు.

ఈ దసరా ముహూర్తాలలో ఈ రెండు భవనాలకు సీఎం దంపతులు గృహ ప్రవేశం చేయనుండగా..  దాదాపుగా వైసీపీ పార్టీ వ్యవహారాలను కూడా విశాఖ కేంద్రంగా నడిపించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. వారానికి మూడు రోజుల పాటు విశాఖ నుండి జగన్ పరిపాలన సాగిస్తారని..  సోమవారం నుండి బుధవారం వరకూ జగన్ విశాఖలోనే ఉండనున్నారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. దసరా తర్వాత మూడు రోజులు విశాఖ, నాలుగు రోజులు తాడేపల్లిలో జగన్ అందుబాటులో ఉండనున్నట్లు చెప్తున్నారు.  మరి ఇది ఎంత వరకు వాస్తవ రూపం దాలుస్తుందో చూడాల్సి ఉంది.