Leading News Portal in Telugu

గురువంటే గూగులే.. ఉపాధ్యాయులు ఎందుకు.. విద్యాశాఖ మాజీ మంత్రి పాండిత్యం! | google enough teachers not necessary| adimulapu| suresh| former| education| minister| jagan


posted on Sep 7, 2023 1:41PM

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్.. సెప్టెంబర్ 5వ తేదీన ఒంగోలులో నిర్వహించిన గురుపూజోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్లొన్నారు. ఈ సందర్బంగా ఆయన  బైజూస్‌తో టెక్నాలజీ అంతా ట్యాబ్‌ల్లో వచ్చిందని.. గురువులు బదులు ఇప్పుడు గూగుల్ వచ్చిందన్నారు. గురువులకు తెలియనివి కూడా గూగుల్‌లో కొడితే తెలిసిపోతుందని చెప్పారు. ఇంకా కాస్త ముందుకెళ్లి గూగుల్ వచ్చిన తర్వాత గురువుల అవసరం లేదంటూ మంత్రి సురేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువుల్లో కంటే గూగుల్‌లో మెటిరియల్ ఎక్కువగా లభిస్తుందంటూ ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. 

ఈ వ్యాఖ్యలు అటు మీడియలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్  అయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యాలపై ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. మంత్రి సురేశ్ వ్యాఖ్యలు అర్థరహితం.. అసంబద్దమని వారు  కొట్టిపారేస్తున్నారు. అసలు ఆయన గురుపూజోత్సవ కార్యక్రమంలో గురువులను సన్మానించారో? లేక అవమనించారో? ముందుగా ఆయన తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ప్రపంచంలో ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం ఇంతవరకు ఎక్కడా ఏదీ లేదని వారు వివరిస్తున్నారు. సాంకేతికత అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం గురువులతో బోధనలు జరుగుతున్నాయని.. ఈ విషయాన్ని మంత్రిగారు గమనించాలంటూ.. ఉపాద్యాయ సంఘాల నేతలు మంత్రిగారికి హితవు పలుకుతున్నారు. 

మరోవైపు మంత్రి సురేశ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. జగన్ తొలి కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పదవి వెలగబెట్టారని.. ఆ సమయంలో ఈ మంత్రి పుంగవులకి గురువు కంటే గూగుల్‌లోనే ఎక్కువ మెటిరియల్ దొరుకుతుందని తెలిసి ఉంటుందని  చురకలంటిస్తున్నారు. అయినా పెద్ద చదువులు చదువుకొని…. సెంట్రల్ సర్వీస్‌లో ఉద్యోగం చేసిన సురేష్   గురువుకి గూగుల్‌కి మధ్య తేడా తెలుసుకోకుండా మాట్లాడుతున్నారంటే.. ఆయన జ్ణానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనంటున్నారు.   

జగన్ తొలి కేబినెట్‌లో విద్యా శాఖ మంత్రిగా.. జగన్ మలి కేబినెట్‌లో మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రిగా ఉన్నఆదిమూలపు సురేష్ కు గురు పూజోత్సవంలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో  తెలియనంత అజ్ణానం గూడుకట్టుకుందని అంటున్నారు.

అయినా జగన్ తొలి, మలి కేబినెట్‌లో మంత్రి పదవులు తారుమారు అయినా.. బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌లు ఇద్దరు ఇద్దరేనని.. వీరిరువురూ కూడా సింగిల్ పీస్  డైమండ్ లనీ నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు. అయినా ముఖ్యమంత్రి  జగన్‌కి ఇలాంటి వాళ్లే కావాలని.. అందుకే వీరిద్దరు.. జగన్ తొలి, మలి కేబినెట్‌లలో  కొనసాగుతున్నారని అంటున్నారు. 

అదీకాక…  మన పెద్దలు గురు బ్రహ్మ, గురు విష్ణు, 

గురు దేవో మహేశ్వరహ

గురు సాక్షాత్ పరబ్రహ్మ 

తస్మై శ్రీ గురువే నమ: అని అన్నారని.. 

కానీ అదే మీరైతే.. గూగుల్ బ్రహ్మ, గూగుల్ విష్ణు,

గూగుల్ దేవో మహేశ్వరహ

గూగుల్ సాక్షాత్ పరబ్రహ్మ

తస్మై శ్రీ గూగులే నమ: అని అన్నా అంటారని నెటిజన్లు..  మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు తమదైన శైలిలో చురకలంటిస్తున్నారు. 

ఇక మాతృదేవో భవ.. పితృ దేవో భవ.. ఆచార్య దేవో భవ అని మన పూర్వికులు అన్నారని.. అదే మీరైతే.. ఆచార్య దేవో భవాకు బదులు గూగుల్ దేవో అన్న అనగల   సమర్థులని నెటిజన్లు ఆదిమూలపు సురేష్ ను ఓ ఆటాడుకుంటున్నారు.