ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు.. సంకటంలో ఇండియా కూటమి | congress in trouble with udayanithi stalin| india| parties| condemn| sangh
posted on Sep 7, 2023 12:58PM
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిథి స్టాలిన్ చేసిన ఒక ప్రకటన దేశ వ్యాప్తంగా ఇచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకీ, ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమికి ఏర్పడిన సానుకూల వాతావరణాన్ని భగ్నం చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూమటి భాగస్వామ్య పక్షంలోని పార్టీకి చెందిన మంత్రి అన్న కారణంతో ఉదయనిథి స్టాలిన్ వ్యాక్యలు సమర్థిస్తే ఒక తంటా.. ఖండిస్తే మరో తంటా అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి తయారైంది. పోనీ ఎటువంటి స్పందనా లేకుండా వదిలేద్దామా అంటే అదీ కుదిరే పని కాదు. ఆయన మొత్తంగా హిందుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న భావన ప్రజలలో బలంగా ఏర్పడే విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, సంఘ్ పరివార్ పార్టీలూ, హిందుత్వ వాదులూ బలంగా ప్రచారం చేస్తున్నారు. అన్నిటికీ మించి సనాతన ధర్మాన్ని కరోనా వంటి మహమ్మారితో పోల్చడం ద్వారా ఉదయనిథి స్టాలిన్ దేశంలోని మెజారిటీ హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్న భావన మెజారిటీ ప్రజలలో వ్యక్తం అవుతున్నది.
అన్నిటికీ మించి ఉదయనిథి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటూ హ్యాట్రిక్ అనుమానం అన్నట్లుగా మారిన బీజేపీ అధికార ఆశలకు ఊపిరులూదిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రధానిగా మోడీ వైఫల్యాల మీద జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో ఉదయనిథి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ఆ చర్చను పక్కదారి పట్టించడమే కాకుండా హిందుత్వే వచ్చే సార్వత్రిక ఎన్నికల అజెండాగా మార్చేశాయని అంటున్నారు. ఇక సంఘ్ పరివార్ ఉదయనిథి స్టాలిన్ సనాతన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళనలతో వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ ఈ వివాదాన్ని రగులుస్తూనే ఉంటుందని చెబుతున్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ కు ఇప్పటి వరకూ కనిపిస్తున్న సానుకూలత మాయమైపోయి ప్రమాదం కనిపిస్తోందనీ, ఇప్పుడ కాంగ్రెస్ హిందు వ్యతిరేకం కాదన్నది రుజువు చేసుకోవాల్సిన అనివార్యతను తెచ్చి పెట్టిందని అంటున్నారు.
ఏది ఏమైనా సనాతన ధర్మంపై ఎన్నికల వేళ ఉదయనిథి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఆయాచిత బ్రహ్మాస్త్రంగా లభించాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి బలోపేతానికి కూడా ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు గండి కొట్టినట్లేనని చెబుతున్నారు. ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకుంటే విపక్ష పార్టీలు ఇండియా కూటమితో కొనసాగలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఉదయనిథి వ్యాఖ్యలను విస్మరించి డీఎంకే ఉన్న ఇండియా కూటమిలో కొనసాగితే.. కూటమిలోని భాగస్వామ్య పక్షాల ఉనికే ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే స్టాలిన్ వ్యాఖ్యలను ఖండిస్తూ కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం.. ఇలా ఒకటేమిటి కాంగ్రెస్ సహా ఇండియా భాగస్వామ్య పార్టీలన్నీ సనాతన ధర్మంపై ఉదయనిథి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఖండించాయి.
ఉదయనిథి స్టాలిన్ మాటలతో ఏకీభవించడం లేదని ప్రకటించాయి. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కీలక నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఇంతవరకూ స్పందించపోవడాన్ని బీజేపీ ఎత్తి చూపుతూ ఈ విషయంలో గాంధీ ద్వయం వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఆది నుంచీ సెక్యులరిజం ముసుగులో హిందూత్వకు వ్యతిరేకంగానే పని చేస్తున్నదంటూ హిందూ సంఘాలు విమర్వలు గుప్పిస్తున్నాయి. దీనిని బట్టే ఉదయనిథి స్టాలిన్ సతానత ధర్మంపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ను ఏ స్థాయిలో ఇరుకున పడేశాయో అర్ధం చేసుకోవచ్చు.
ఈ విషయంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు మరెన్నో రోజులు మౌనంగా ఉండే అవకాశం లేదు. వారి మౌనం కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చక తప్పదు. సనాతన ధర్మంపై ఉదయనిథి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తమ స్టాండ్ ఏమిటన్నది ఎటువంటి శశబిషలకూ తావు లేకుండా సోనియా రాహుల్ లు నోరు విప్పక తప్పని పరిస్థితి. ఏది ఏమైనా సనాతన ధర్మంపై ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నిస్సందేహంగా బీజేపీ వ్యతిరేక కూటమి ఐక్యతపై ప్రభావం చూపకతప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.