Leading News Portal in Telugu

ఏపీలో ముందస్తేనా?.. జగన్ కు మరో దారి లేదా? | early election in ap| jagan| captive| bjp| hands| center| decision| obey| cases


posted on Sep 8, 2023 10:21AM

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ అడుగు ముందుకు వేయాలన్నా, వెనక్కు వేయాలన్నా ఆదేశాలు కేంద్రంలోని మోడీ సర్కార్ నుంచే రావాల్సి ఉంటుంది. అడ్డగోలు అప్పుల కోసం.. కేసుల నుంచి రక్షణ కోసం జగన్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రంలోని మోడీ సర్కార్ కాళ్లు ముందు మోకరిల్లేలా చేసింది. వ్యవసాయ మోటార్లకు మీటర్ల దగ్గర నుంచి కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయానికీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాల కంటే ముందుగానే జై కొడుతోంది. అటువంటి పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తే జగన్ కూడా అందుకు సై అంటూ ఏపీ అసెంబ్లీ రద్దు కు సిద్ధపడక తప్పదు.

ఇప్పటికే మోడీ సర్కార్ ఈ ఏడాది డిసెంబర్ చివరిలో లేదా జనవరి మొదటి వారంలో ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. కేంద్రంలోని మోడీ సర్కార్ జమిలి యోచనలో ఉందనీ, అందుకోసం అవసరమైన సన్నాహాలన్నిటినీ చాపకింద నీరులా సాగించేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో అందరి దృష్టి సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలపైనే ఉంది. మరీ ముఖ్యంగా ఒడిషా, ఏపీ రాష్ట్రాలలోని ప్రభుత్వాలు ఏం నిర్ణయం తీసుకుంటాయన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎందుకంటే బీజేపీ ముందస్తుకు వెడితే.. ఈ రెండు రాష్ట్రాలూ కూడా ముందస్తుకు సై అంటాయా నో అంటాయా అన్ని చర్చ జరుగుతోంది. ఒక వేళ మోడీ సర్కార్ ప్రతిపాదనకు ఈ రెండు రాష్ట్రాలూ నో అనడమంటూ జరిగితే మోడీ జమిలి లేదా మినీ జమిలి ప్రతిపాదనకు పురిట్లోనే సంధి కొట్టినట్లు అవుతుంది. అయితే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు ముందస్తుకు వెళ్లినా వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ కారణంతోనే ఆయన ఇప్పటికే ముందస్తుకు సిద్ధమని కేంద్రానికి తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక ఏపీ విషయానికి వస్తే అన్ని వైపుల నుంచీ సమస్యలతో సతమతమౌతున్న జగన్ ముందస్తుకు వెడితే ముందస్తు మునక తప్పదన్న భావనలో ఉన్నారు. అప్పులు పుట్టడం గగనంగా మారి బటన్ నొక్కుడు కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదం కనిపిస్తుండటంతో ముందస్తుకే మొగ్గు చూపాలా? లేదా  చివరి క్షణం వరకూ అధికారంలో కొనసాగి ఆ తరువాతే అదృష్టాన్ని పరీక్షించుకోవాలా? అన్న మీమాంసలో జగన్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి శ్రీశ్రీ రాసిన సంధ్యా సమస్యలు కవితలోలా ఏం చేయాలో, ఏం తేల్చుకోవాలో అర్ధం కాని అయోమయంలో ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నిటికీ మించి బీజేపీ ఆదేశిస్తే జగన్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు సై అనక తప్పదు. ఆయన ప్రభుత్వం బీజేపీ గుప్పెట్లో బందీ అయిన పరిస్థితిలో ఉందని అంటున్నారు.   బీజేపీముందస్తుకు  సిద్ధపడితే జగన్ ఆ పార్టీని అనుసరించక తప్పదని.. నో అనే అవకాశమే లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 ప్రజలు ఐదేళ్ల పాటు అధికారంలో  ఉండేందుకు తీర్పు నిచ్చారనీ, తము ఐదేళ్లూ అధికారంలో కొనసాగుతామని అందులో మరో ఆలోచనే లేదనీ ప్రభుత్వ సలహాదారు సజ్జల వంటి వారు గంభీర ప్రకటనలు చేస్తున్నా..అదంతా మేకపోతు గాంభీర్యమేనని అంటున్నారు.  అసలు రాష్ట్రంలో ముందస్తు ప్రస్తావన తెచ్చినదే సజ్జల అని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఇక ఇప్పుడు బీజేపీ ముందస్తు దిశగా అడుగులు వేస్తే.. జగన్ ఆ అడుగుల్లో అడుగులు వేయడం తప్ప మరో గత్యంతరం లేదని చెబుతున్నారు.   అయితే బీజేపీకి ఉన్న అతి పెద్ద ఆందోళన ఏమిటంటే.. ముందస్తు సరే ఎలాగోలా ఎదుర్కోగలం.. కానీ జమిలి అయితే మాత్రం మునిగిపోవడం ఖాయం అన్న భయం వైసీపీలో వ్యక్తం అవుతోంది. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పై ప్రజా గ్రహం ఎంత ఉందో.. అంత కంటే ఎక్కువ కేంద్రంలోని మోడీ సర్కార్ పై ఉంది. జగన్ అడ్డగోలు విధానాలకు అంతకు మించి అడ్డగోలుగా మద్దతు ఇచ్చిన బీజేపీకీ గతం కంటే ఓటు గణనీయంగా తగ్గింది. ఈ విషయాన్ని ఇటీవల పలు సర్వేలు బయటపెట్టాయి.  

అంటే జమిలి అంటూ జరిగితే జగన్ తన ప్రభుత్వం పట్ల ప్రజావ్యతిరేకతనే కాకుండా బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేకతను కూడా మోయాల్సి ఉంటుంది. అంటే ముందుస్తుగానే జగన్ సర్కార్ దుకాణం మూతపడుతుందన్న భయం వైసీపీలో వ్యక్తం అవుతోంది.  ఈ నేపథ్యంలోనే జమిలిపై ఏకాభిప్రాయం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఏదో గొణుగుడు వ్యవహారం కాకుండా.. గట్టిగా బీజేపీని వ్యతిరేకించలేని  బలహీనత వైసీపీలో ఉంది. బీజేపీ నిర్ణయం తీసుకుని ఆదేశించినా జగన్ సర్కార్ ముందస్తుకు ముందుకు రాకపోతే కేసులు చుట్టుముట్టి పుట్టిముంచుతాయని జగన్ ఆందోళన. అందుకే మునిగిపోతామని తెలిసినా బీజేపీ ఆదేశిస్తే జగన్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు  సై అనక తప్పని అనివార్య పరిస్థితిలో ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.