తెలంగాణలో చతుర్ముఖ పోటీ.. కమలనాథుల వ్యూహమేనా? | is four way competition in telangana bjp strategy| tdp| congress| brs| mp| support| aim| king
posted on Sep 8, 2023 11:49AM
కర్నాటక ఎన్నికల తరువాత తెలుగు రాష్ట్రాల విషయంలో బీజేపీ తన వ్యూహాలను పూర్తిగా మార్చేసింది. కర్నాటక ఓటమితో ఆ పార్టీ నేర్చుకున్న గుణపాఠాలు ఏమిటన్నది పక్కన పెడితే.. ఆ పార్టీ అంత వరకూ అనుసరించిన పెళ్లికి, తద్దినానికి ఒకే మంత్రం పఠించే విధానానికి తెలుగు రాష్ట్రాలలో చెల్లు చీటీ అయితే చెప్పేసింది. ఉత్తరాది వ్యూహాలు దక్షిణాదిలో వర్కౌట్ కావని డిసైడైపోయిన కమలనాథులు తెలుగు రాష్ట్రాలలో కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు.
తెలంగాణలో అప్పటి వరకూ తిరుగులేని పార్టీగా, రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం ఖాయంగా భావిస్తూ వచ్చిన కమలం హైకమాండ్ .. కర్నాటక ఫలితాల తరువాత తెలంగాణ బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలను చూసి తెల్లబోయింది. వెంటనే ప్రక్షాళన అంటూ రాష్ట్ర పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టింది. బండి సంజయ్ నుంచి రాష్ట్ర పగ్గాలు తప్పించి వాటిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కట్టబెట్టింది. అయితే రాష్ట్ర పార్టీలో ప్రక్షాళన పేర బీజేపీ హైకమాండ్ చేసిన వైద్యం వికటించింది.
అప్పటి వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న పార్టీలో విభేదాలు.. ఈ మార్పుల తరువాత ఒక్క సారిగా బహిర్గతమయ్యాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన సభ వేదికపై నుండే బండి మద్దతు దారులు హడావుడి చేశారు. దీంతో కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం కాస్తా బండి సంజయ్ సన్మాన సభగా మారిపోయింది. అధిష్టానం నిర్ణయం పట్ల తన అసంతృప్తిని, వ్యతిరేకతను కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందనరావు వంటి వారు అన్యాపదేశంగానైనా అదే సభావ వేదిక పై నుంచి వెల్లడించేశారు. ఇక విజయశాంతి వంటి వారు ఆ కార్యక్రమం నుంచి అర్ధంతరంగా వాకౌట్ చేసి తన నిరసన తెలియ చేశారు. అది మొదలు తెలంగాణ బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోయింది. చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అస్త్ర సన్యాసం చేసేశారు. దీంతో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయంటూ బీజేపీ ఆర్భాటంగా చెప్పిన అమిత్ షా ఖమ్మం సభ చప్పగా ముగిసింది.
దీంతో అప్పటి వరకూ రాష్ట్రంలో కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా.. రాష్ట్రంలో ద్విముఖ పోరుతోనే తమకు ప్రయోజనంగా భావించి అడుగులు వేసిన బీజేపీ వ్యూహం మార్చి రాష్ట్రంలో త్రిముఖ పోరు జరిగితేనే రాజకీయంగా లబ్ధి పొందుతామన్న నిర్ణయానికి వచ్చింది. ఈ వ్యూహంలో భాగంగానే బీజేపీ తెలుగుదేశంతో పొత్తుకు దూరంగా ఉంటున్నట్లు కలర్ ఇస్తోందనీ, తెలంగాణలోని అన్ని స్థానాలలోనూ తెలుగుదేశం పోటీ నిర్ణయం వెనుక బీజేపీ వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా తెలుగుదేశం తెలంగాణలో ఇప్పటికీ బలమైన పార్టీయే ఇందులో సందేహం లేదు. అయితే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం గత ఎనిమిదిన్నరేళ్లుగా కాడె వదిలేయడం వల్ల క్యాడర్ స్దబ్దుగా మిగిలిపోయింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మారిపోయిందో.. అప్పటి నుంచీ తెలుగుదుశం తెలంగాణలో తన కార్యకలాపాలను ముమ్మరం చేసింది. తెలంగాణ సెంటిమెంట్ ఇక పని చేయదన్న అంచనాతో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో.. మరీ ముఖ్యంగా విశ్వనగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందే విషయంలో తెలుగుదేశం పాత్ర, చంద్రబాబు దార్శనికతను తెలంగాణ ప్రజకు గుర్తు చేస్తూ విస్తృతంగా జనంలోకి వెడుతున్నది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం ఖమ్మంలో నిర్వహించిన సభ అంచనాలకు మించి సక్సెస్ అయ్యింది. దీంతో తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా తెలుగుదేశం కూడా పోటీలో నిలవడం ఖాయమన్న భావన పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమౌతోంది.
ఈ పరిస్థితినే బీజేపీ కేంద్రంలో మరో సారి అధికారంలోకి రావడానికి అనువుగా మార్చుకునే విధంగా పావులు కదుపుతోంది. తెలంగాణలో పొత్తులు లేకుండా బలమైన శక్తిగా తెలుగుదేశం బరిలో నిలిస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు దెబ్బతింటాయనీ, రాజకీయంగా కమలం లబ్ధి పొందుతుందనీ భావిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు ఇప్పటికే తన ఖాతాలో పడిందని అంచనా వేస్తున్న బీజేపీ.. ఇప్పుడు తెలుగుదేశం తెలంగాణ ఎన్నికల బరిలో గట్టిగా నిలబడితే కాంగ్రెస్ బలహీనం అవుతుందని భావిస్తున్నది. రాష్ట్రంలో నేరుగా అధికారంలోకి రాలేకపోయినా.. చతుర్ముఖ పోటీ వల్ల తెలంగాణలో హంగ్ ఏర్పడితే.. అప్పుడు రాష్ట్రంలో చక్రం తిప్పే అవకాశం తమదే అవుతుందని కమలనాధులు భావిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
ఇందుకోసమే ఏపీలో కమలం పార్టీ తటస్థ వైఖరిని అవలంబిస్తోందనీ, తెలుగుదేశం పార్టీతో పూర్తి అవగాహనతోనే.. ఈ వ్యూహాన్ని పక్కాగా ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తోందనీ వివరిస్తున్నారు. దీంతో తెలుగురాష్ట్రాలలో నేరుగా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోయినా.. ఆ రెండు రాష్ట్రాలలో కింగ్ మేకర్ పాత్ర పోషించి తద్వారా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద పంఖ్యలో లోక్ సభ సభ్యుల మద్దతు కూడగట్టేలా కమలనాథులు వ్యూహరచన చేశారని చెబుతున్నారు.