మా ఎన్నికలు మరోసారి గోల గోల?! | maa elections next month| film| circles| hungama| disappear| manchu| vishnu| promises| fail| next
posted on Sep 8, 2023 2:45PM
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు పదవీ కాలం ఆక్టోబర్ రెండో వారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆక్టోబర్ 10 తేదీన మళ్లీ మా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ అందుకు సంబంధించిన హడావుడి ఏమీ మూవీ ఆర్టిస్ అసోసియేషన్‌లో కనిపించకపోవడం పట్ల ఫిలింనగర్ వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి మా ఎన్నికలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే.. ఆ క్రమంలో 2021, ఆక్టోబర్ 10న మా ఎన్నికలు జరిగాయి. ఆక్టోబర్ 13న మా అధ్యక్షుడిగా మంచు విష్ణు అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
మళ్లీ ఈ ఏడాది అంటే 2023, అక్టోబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉందని.. కానీ దీనిపై ఇప్పటి వరకు టాలీవుడ్ పెద్దలు పెదవి విప్పకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమౌతోంది. 2021లో జరిగిన మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ వర్గం, మంచు విష్ణు వర్గం హోరా హోరీగా తలపడ్డాయి. అందులో భాగంగా వారు సవాళ్లు, ప్రతి సవాళ్లు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకొన్నారు.
ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. అప్పటి మా ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి.. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే తాను మా అధ్యక్షుడిగా ఎన్నికైతే… చిత్ర పరిశ్రమకు సంబంధించి పలు కార్యక్రమాలు చేస్తానంటూ ఆ సమయంలో స్పష్టమైన హామీలు ఇచ్చారు. అయితే ఆ హామీలు ఎంత వరకు అమలు అయ్యాయన్న ప్రశ్నకు మంచు విష్ణు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఫిలింనగర్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరి మా అధ్యక్ష పదవి కాలం అక్టోబర్‌లో ముగియనుంది. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ మా ఎన్నికల హడావుడి మొదలు కాకపోవడంపై పిలింనగర్ వర్గాలు ఓకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఈ సారి మా ఎన్నికల్లో ఎవరు బరిలో దిగుతారు? ఒ కరే నిలబడి.. మా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా చేసుకుంటారా? లేక పోటీ అనివార్యమౌతుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అదీకాక.. జగన్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ చాలా ఒడుదుడుకులు ఎదుర్కొంది. సినిమా థియేటర్ల టికెట్ ధరల తగ్గింపు అంశంలో జగన్ పార్టీ వ్యవహారించిన తీరు.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న చందంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంతో జగన్ పార్టీపై చిత్ర పరిశ్రమ చాలా గుర్రుగా ఉందనే ప్రచారం జరిగింది. జరుగుతోంది. మరోవైపు ప్రస్తుత మా అధ్యక్షుడు మంచు విష్ణు.. ఏపీ సీఎం జగన్‌కు సమీప బంధువు అన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇదే విషయాన్ని గత మా ఎన్నికలకు ముందు మంచు విష్ణు వివిధ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్యూలో వివరించిన విషయం కూడా తెలిసిందే. కానీ సినిమా థియేటర్ల టికెట్ల ధరలు తగ్గింపు అంశంపై మా అధ్యక్షుడిగా మంచు విష్ణు కానీ.. ఆయన తండ్రి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కానీ చొరవ తీసుకొని.. ఏపీ ప్రభుత్వంతో భేటీ అయి చర్చింలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు.. టాలీవుడ్ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు ఎక్కడ ఉన్నారనే ఓ ప్రశ్న సైతం నేటికి ఫిలింనగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
మా ఎన్నికలు మళ్లీ అక్టోబర్‌లో నిర్వహిస్తే.. అధ్యక్ష పదవికి ఎవరు నిలబడతారు? టాలీవుడ్‌లోని సమస్యలపై ప్రభుత్వంతో పోరాడే సత్తా ఉన్న వాళ్లు నిలబడతారా? లేకుంటే.. మాటల్లో తప్ప చేతల్లో హీరోయిజాన్ని ప్రదర్శించలేని వారే నిలబడతారా? అని ఫిలింనగర్ వర్గాల్లో ఓ చర్చ అయితే వైరల్ అవుతోంది. మా ఎన్నికలకు సమయం అసన్నమవుతోన్నా…. సినిమా పెద్దల్లో మాత్రం ఉలుకు పలుకు లేకపోవడం వెనుక కారణం ఏమై ఉంటుందన్న అనుమానం కూడా ఫిలింనగర్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.