Leading News Portal in Telugu

హోంగార్డ్ రవీంద్ర మృతి.. దిగి వచ్చిన ప్రభుత్వం    


posted on Sep 8, 2023 5:21PM

అసెంబ్లీ ఎన్నికలు దూసుకొచ్చేస్తున్నాయి.. ముచ్చటగా మూడోసారి అధికారం అందుకొనేందుకు బీఆర్ఎస్  పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అండ్ కో ఓటర్లను కాకా పట్టేందుకు.. తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. అందులోభాగంగా.. డబుల్ బెడ్ రూం ఇళ్లు లబ్దిదారులకు కేటాయించే కార్యక్రమాన్ని కారు పార్టీ నేతల కనుసన్నల్లో కేటాయిస్తున్నారు.  అలాగే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని.. అందుకోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ఇప్పటికే గులాబీ బాసు సూచించారు. అలాగే ప్రజలకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రభుత్వం యుద్దప్రాతిపదికన వాయు వేగంతో కదులుతోంది. అలాంటి వేళ.. జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని.. ఉన్నతాధికారులు తమను వేధిస్తున్నారంటూ.. హోంగార్డులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ.. తమను పోలీసులతో సమానంగా చూడాలంటూ హైదరాబాద్‌లో ట్రాఫిక్ కామాండెంట్ కార్యాలయం ఎదుట ఎం రవీంద్ర ఓంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొన్నారు. 60 శాతంపైగా కాలిన గాయాలతో.. అతడిని తొలుత ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

అయితే అతడి పరిస్థితి విషమంగా మారడంతో.. కంచన్ బాగ్‌లోని డీఆర్డీవో అపోలో ఆసుపత్రికి తరలించారు. ఉపిరితిత్తులు దెబ్బతినడంతో.. వెంటిలేటర్‌ ద్వారా కృత్రిమ శ్వాస అందించారు. ఆ క్రమంలో శుక్రవారం అంటే ఆగస్ట్ 8వ తేదీన రవీంద్ర మరణించారు. అతడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

రవీంద్ర మృతితో హోం గార్డులు జేఏసీ ఆందోళన బాట పట్టింది. ఈ నెల 16వ తేదీ వరకు విధులు బహిష్కరించాలంటూ పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం అప్రమత్తమై.. పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఓ ప్రచారం అయితే ఊపందుకొంది. ఆ క్రమంలో హోంగార్డులందరు డ్యూటీలో తప్పని సరిగా ఉండాలని.. డ్యూటీలో లేని హోంగార్డులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్‌లో ఉండాలని సూచించారు. అలాగే వీరంతా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సర్కిల్ ఇన్స్‌పెక్టర్లను ఆదేశించారు. లా అండ్ ఆర్డర్‌లో పని చేసే వారుసమ్మెకు దిగితే.. వారిని విధుల నుంచి బహిష్కరిస్తామని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.   

మరోవైపు.. హోంగార్డు రవీంద్ర భార్య సంధ్య ఇతర కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. తన భర్త ఉన్నతాధికారుల వేధింపుల వల్లే మరణించారంటూ ఆరోపించారు. తన భర్త ఆత్మహత్మకు ఉన్నతాధికారుల వేధింపులే కారణమని.. అందుకు సంబంధించిన పలువురు ఉన్నతాధికారుల పేర్లను సైతం ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు.  అలాగే ఆమె ఆందోళన చేస్తున్న క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆమెను పరామర్శించారు. 

ఇంకోవైపు ఆందోళనకు దిగిన హోంగార్డు భార్యతో పోలీస్ ఉన్నతాధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలవంతమయ్యాయి.  రెండు రోజుల తర్వాత నగర పోలీస్ కమిషనర్ వద్దకు తీసుకెళ్లనున్నట్టుగా డీసీపీ హామీ ఇచ్చారు. అలాగే హోంగార్డు ఉద్యోగం కాకుండా పోలీస్ శాఖలో మరో ఉద్యోగం  ఇప్పించే ప్రయత్నం చేస్తామని  సంధ్యకు డీసీపీ హామీ ఇచ్చారు. ఈ హామీతో సంధ్య సానుకూలంగా స్పందించారు. దీంతో ఆమె తన ఆందోళన విరమించారు.