పేద సీఎం జగన్ విదేశీ పర్యటన ఖర్చెంతో తెలుసా?! | poor cm jagan foriegn trip expenditure| london| wife| daughters| special| flight
posted on Sep 8, 2023 1:26PM
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2 శనివారం రాత్రి 9.30 గంటలకు తన సతీమణి భారతితో కలిసి జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన పూర్తిగా సీఎం జగన్ తన వ్యక్తిగత పర్యటన. అక్కడే ఉంటున్న తమ పిల్లలు హర్షారెడ్డి, వర్షా రెడ్డిలతో గడిపేందుకు చేస్తున్న పర్యటన. సెప్టెంబర్ 11న సీఎం జగన్ తిరిగి మళ్లీ రాష్ట్రానికి రానున్నారు. అప్పటి వరకూ జగన్ అక్కడి నుండే పాలన సాగించనున్నారు. అయితే, జగన్ లండన్ పర్యటన ఖర్చు, ఆయన ప్రయాణ వివరాలు, వ్యక్తిగత పర్యటనకు ప్రభుత్వ ధనం వినియోగం ఇదే రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిన సంగతి తెలిసిందే. అటువంటి ధనిక ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అంతకు మించి లగ్జ్యూరియస్ గానే ఉంటుంది అందులో సందేహం లేదు. ఆ విషయాన్నే వైసీపీ నేతలు మళ్లీ మళ్లీ చెబుతూ.. జనం సొమ్ముతో జల్సాలు చేసే సీఎం కాదు మా జగన్ అంటూ కీర్తిస్తున్నారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. జనానికి గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముతో జల్సాలు చేసే సీఎం కాదని, కేవలం రూ.20 విలువ చేసే వాటర్ బాటిల్ మాత్రమే తాగుతారని, సీఎంగా జీతాన్ని కూడా జగన్ త్యాగం చేశారని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తానో సర్వసంగ పరిత్యాగిననీ, పేదల పక్షపాతినని సందర్భం వచ్చినా రాకపోయినా.. సందర్భం ఉన్నా, లేకపోయినా చెప్పుకుంటూ జగన్ కూడా తన భుజాలను తానే చరుచుకోవడం కూడా కద్దు. అయితే అదే సీఎం ఆ మధ్య తాడేపల్లి నుండి తెనాలి వరకూ జస్ట్ 28కిలో మీటర్ల రోడ్డు ప్రయాణానికి కూడా హెలికాఫ్టర్ పై వెళ్లారు. అప్పుడే దానిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఆ తర్వాత అమరావతి రాజధానిలో తన ఇంటికి అత్యంత సమీపంలో జరిగిన ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమానికీ హెలికాప్టర్లోనే వెళ్లారాయన. జస్ట్ పది నిమిషాల రోడ్డు ప్రయాణానికి కూడా హెలికాఫ్టర్ లో వెళ్లిన పేద సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో ఆయనను ట్రోల్ చేశారు.
అదలా ఉండగా ఇప్పుడు జగన్ లండన్ పర్యటన ఖర్చు కూడా విమర్శల పాలవుతోంది. జగన్ దంపతులు ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లారు. అది కూడా ఏదో ఆషామాషీ ఫ్లైట్ కాదు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన విమానాలలో ఒకటైన ఎంబ్రాయెర్ లినేజ్ 1000 ఫ్లైట్ . 435 కోట్ల రూపాయల విలువైన ఈ విమానంలో సుమారు 19 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చు. ఈ విమానం అద్దె గంటకు సుమారు 14 వేల 850 డాలర్లు. మన కరెన్సీలో చూస్తే గంటకు సుమారు 2 లక్షల 71 వేలు. విజయవాడ నుంచి లండన్ వెళ్లేందుకు సుమారు 11 గంటల సమయం పడుతుంది.. అలాగే అటు నుంచి రావడానికి మరో 11 గంటలు పడుతుంది. దీంతో పాటు ఇంధనం నింపుకోవడానికి నిలిపే సమయానికి కూడా అద్దె కట్టాల్సిందే. ఫ్లైట్ ఫ్యూయల్ అండ్ ఆపరేషన్ కాస్ట్ కూడా అద్దెకి తీసుకున్న వారే చెల్లించాలి. ఈ లెక్కన చూస్తే జగన్ లండన్ పర్యటనకు ఒక్క విమాన ఖర్చు రూ.40 కోట్ల పైమాటే.
అంతేకాదు, ఒకవేళ విమానాన్ని పర్యటన మొత్తం తనతో ఉంచుకోవాలని అనుకుంటే అక్కడ దానికి పార్కింగ్ ఛార్జీలు, ఫైలట్ మెయింటనెన్స్, ఇతరత్రా ఖర్చులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే ఈ ఖర్చు మరో 10 లేక 20 కోట్లు పెరిగిపోతుంది. జగన్ వ్యక్తిగత పర్యటనకు వెళ్లినా ఈ ఖర్చు మొత్తం ప్రభత్వ ఖజానా నుండే చెల్లిస్తారన్న విషయం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈ క్రమంలో తాను పేద సీఎంను అని.. పేదల పెన్నిధిని అంటూ జగన్ చెప్పుకోవడం, ఆయన పార్టీ నేతలు తానతందాన అనడం ఎవర్ని మభ్య పెట్టడానికనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే జగన్ పర్యటనపై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు వేశారు. పేద సీఎం తన కుమార్తెపై ప్రేమ చూపేందుకు రూ.40 కోట్లు ఖర్చు పెట్టారు, కానీ ప్రజల పనులు మాత్రం చేయరు అని చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ పేదవాళ్లు చేయాల్సిన పనులు చేస్తున్నారా అంటూ నిలదీశారు.
మరోవైపు సోషల్ మీడియాలో కూడా జగన్ లండన్ పర్యటన వ్యయంపై తెగ ట్రోల్స్ వస్తున్నాయి. అనగనగా ఓ పేదవాడు.. వాడి ఇంట్లో డ్రైవర్లు, పనిమనుషులు, వంట మనిషి అందరూ పేదవారే అంటూ సాగే ఓ సినిమా వీడియోతో సీఎంను తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. జగన్ గతంలో దావోస్ కు వెళ్ళినపుడు కూడా ప్రభుత్వ ఖర్చుతో అత్యంత విలాసవంతమైన విమానంలోనే వెళ్లారు. ప్రయాణికుల విమానంలో బిజినెస్ క్లాస్లో ప్రయాణించడమూ ఆడంబరమే అవుతుందని ఆయన భావిస్తారేమో పాపం. అందుకే సొంతంగా అత్యంత విలాసవంతమైన విమానాన్ని అద్దెకి తీసుకొని సతీసమేతంగా కుమార్తెల వద్దకు వెళ్లారు ఈ పేద సీఎం.