Leading News Portal in Telugu

చంద్రబాబు అరెస్ట్.. అనుమానాలే నిజమయ్యాయి! | babu arrest suspicions came true| chandrababu| threedays| back| revealed| cid


posted on Sep 9, 2023 11:21AM

కేసులు ఆరోపణలు, సాక్ష్యాధారాలు నిబంధనలతో పని లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం అన్న ఒకే ఒక లక్ష్యంతో గత నాలుగున్నరేళ్లుగా జగన్ సర్కార్ చేయని ప్రయత్నం లేదు. అమరావతి రాజధానిగా నిర్ణయించడం వెనుక భూముల కుంభకోణం ఉందనీ, ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ మొదలు పెట్టి చంద్రబాబుపై జగన్ సర్కార్, వైసీపీ చేయని ఆరోపణ లేదు. వేయని నింద లేదు. నాలుగున్నరేళ్లలో చంద్రబాబుపై చేసిన ఆరోపణల్లో ఒక్కటీ రుజువు చేయలేకపోయింది కానీ.. మూడు రాజధానుల నుంచి, ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడం వరకూ ప్రతి విషయంలోనూ జగన్ సర్కార్ న్యాయస్థానాలలో మొట్టికాయలు తింది.

జగన్ ఆదేశాలకు అనుగుణంగా నిబంధనలకు తిలోదకాలిచ్చి పని చేసిన అధికారులకు కోర్టు అక్షింతలు వేసింది. కొన్ని సందర్భాలలో శిక్షలు విధించి కూడా సామాజిక సేవ వంటి వాటికి పరిమితం చేసి గట్టిగా హెచ్చరించి వదిలిపెట్టింది. అలా ఈ నాలుగున్నరేళ్లలో జగన్ గారు ఏం చేస్తున్నారయ్యా.. అంటే నిర్ణయాలు తీసుకోవడం కోర్టులు కళ్లెం వేయడంతో వాటిని సవరించుకోవడంతోనే సరిపోయిందన్న సమాధానమే వస్తుంది. రాష్ట్ర ప్రగతి కాగడా పెట్టి వెతికినా కనిపించని పరిస్థితి. విద్యుత్ చార్జీలు, బస్సు చార్జీలు పెంపు. సంక్షేమం పేరిట పందేరం చేసిన సొమ్ముకు అంతకింతా ప్రజల నుంచే పన్నుల రూపంలో వసూలు చేయడం వినా జగన్ సర్కార్ సాధించినదేమీ లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

దీంతో జనంలో జగన్ సర్కార్ పట్ల తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. జగన్ సభలలోంచి జనం గుంపులు గుంపులుగా లేచి వెళ్లిపోవడాన్ని దీనికి తార్కానంగా పరిశీలకులు చూపుతున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడపగడపకూ మన ప్రభుత్వం వంటి కార్యక్రమాలకు ఎదురైన ప్రజా నిరసనే జగన్ పాలన పట్ల ప్రజలలో ఉన్న ఆగ్రహాన్ని ఎత్తి చూపిందంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాకపోతే మరెప్పూడూ కాదు అన్న నిర్ణయానికి వచ్చిన జగన్ ఇక టార్గెట్ చంద్రబాబు అన్నట్లు ఆయన అరెస్టు చూసి ఎన్నికలకు వెళ్లి ఇంటికి వెళ్లిపోదాం అని నిర్ణయించుకున్నట్లుగా కనబడుతోందని పరిశీలకులు అంటున్నారు. అందుకే గత కొద్ది రోజులుగా చంద్రబాబు అరెస్టు గురించిన ఫీలర్లు అధికార పార్టీ వదులుతూ వచ్చిందనీ, అయితే ఏ కేసులో, ఏ ఆధారాలతో చంద్రబాబును అరెస్టు చేస్తారన్నది వెల్లడించకుండా రోజుల వ్యవధిలో చంద్రబాబు అరెస్టు ఖాయమంటై వైసీపీ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం చేసింది.

దాంతో చంద్రబాబు ఒకటి రెండు రోజుల్లో తనను అరెస్టు చేసే అవకాశం ఉందని మూడు రోజుల కిందట చంద్రబాబు చెప్పారు.  ఒక్క చాన్స్ ను పూర్తిగా దుర్వినియోగం చేసుకున్న జగన్ మరో సారి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని నిర్ధారణకు వచ్చారనీ, దీంతో తాను ప్రజలలోకి వెళ్ల కుండా అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన నిప్పులు చెరిగారు.  తనపై  దాడులు అందులో భాగమేనని అన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రజలలో మమేకం కాకుండా అడ్డుకునేందుకు తమ పార్టీ శ్రేణులపై  రౌడీలతో దాడులు చేయిస్తున్నారని.. ఇవేవీ జగన్ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదనీ, జనాదరణ, జనాభిమానం మెండుగా ఉన్న తనను ప్రజలలోకి వెళ్లకుండా ఆపడంలో విఫలమైన జగన్ సర్కార్ ఇక ఇప్పుడు తనపై తప్పుడు కేసులు పెడుతూ, జైలుకు పంపాలని కుట్ర పన్నిందని చంద్రబాబు మూడు రోజుల కిందటే ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ పాలన అంతం కావడం కోసం రాష్ట్రంలో ఇంటికి ఒకరు చొప్పున తనతో ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.  జగన్ అరాచక పాలన అంతమయ్యే రోజు ఎంతో దూరంలో లేదనీ, ఆరేడు నెలలలో జరిగే ఎన్నికలలో  తెలుగుదేశం అనూహ్య మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

 నిప్పులా బతికిన తనను తప్పుడు వ్యక్తిగా చూపేందుకు జగన్ పన్నుతున్న కుట్రలు ఫలించవన్నారు.  అంగళ్ళలో తనమీద హత్యా ప్రయత్నం చేసి తిరిగి తనపైనే ఐపీసీ 307కింద కేసు పెట్టారని  కావాలని తప్పుడు కేసులలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. యువగళం పాదయాత్రకు వచ్చి దాడులు చేసి టిడిపి నేతలపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని.. ఏపీ సీఎం సైకోలా వ్యవహరిస్తున్నారని, సైకో పాలన నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.  ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న జగన్ వచ్చే సమయానికి చంద్రబాబును అరెస్టు చేసి జగన్ కళ్లల్లో ఆనందం చూడాలని  కొందరు ప్రభుత్వ పెద్దలు కంకణం కట్టుకున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

చివరికి ఆ ప్రచారమే నిజమని తేలింది.  ఎప్పుడో విచారణ ముగిసిపోయిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తే ఆందోళనలు చెలరేగుతున్నాయి. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు బయటకు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ వారిని హౌస్ అరెస్టులు, అరెస్టులూ చేస్తూ రాష్ట్రాన్నే జైలుగా మార్చేస్తున్నారు. మరి ఇంతకీ చంద్రబాబు ఏ కేసులో అరెస్ట్ కాబోతున్నారు. ఒక వేళ ఆయన అరెస్ట్ అయితే టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకోనున్నాయో చూడాల్సి ఉంది.