చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్?! | bjp master plan behind babu arrest| tdp| strengthen| bjp| expand| hurdle| modi
posted on Sep 9, 2023 12:14PM
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అరెస్టు అనూహ్యమేమీ కాదు. గత కొంత కాలంగా రాజకీయ సర్కిల్స్ లో చంద్రబాబు అరెస్టు పై విస్తృతంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. స్వయంగా చంద్రబాబే తనను జగన్ సర్కార్ రెండు మూడు రోజులలో అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రకటించారు. ఆయన తన అరెస్టు గురించి చెప్పి మూడు రోజులు గడిచాయో లేదో ఆయన అనుమానాలు నిజమేనని తేలుస్తూ ఏపీలో అత్యంత విదూషక పాత్ర పోషిస్తున్న సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసింది. అయితే సీఐడీ గత అరెస్టులు, కేసులకు భిన్నంగా చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ అధిష్ఠానం మాస్టర్ ప్లాన్ ఉందని పరిశీలకులు అంటున్నారు. తీవ్ర మైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న మోడీ మరో సారి అంటే ముచ్చటగా మూడో సారి కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టాలంటే దేశంలో, అలాగే బీజేపీకి కనీసం ఒక శాతం ఓటు స్టేక్ కూడా లేని ఏపీలో కూడా ఏదో ఒక విధంగా అలజడి, అనిశ్చితి ఏర్పడితే.. అది అంతిమంగా జగన్ కు అనుకూలంగా మారితే.. ఏపీలో సీట్లు, ఓట్లూ లేకపోయినా బీజేపీకి వచ్చిన బాధేమీ లేదు. కేంద్రంలో మరో సారి మోడీ అధికారంలోకి రావడమంటూ జరిగితే..జగన్ ఎటూ తన చెప్పుచేతల్లోనే ఉంటారు కనుక మద్దతుకు ఢోకా ఉండదు. జగన్ పార్టీ పేరుకు ఎన్డీయే భాగస్వామ్య పార్టీ కాదు కానీ.. ఆ భాగస్వామ్య పక్షాలకు మించిన విధేయతా, విశ్వాసం వైసీపీ నుంచి బీజేపీకి దక్కుతోంది. ముందు ముందు దక్కుతుంది కూడా. ఇక బీజేపీ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏపీలో బలమైన రాజకీయ పార్టీ ఉండకూడదు. 2019 ఎన్నికలలోనూ అదే లక్ష్యంతో పని చేసింది. ఇప్పుడు 2024 ఎన్నికలలోనూ అదే లక్ష్యంతో పని చేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే ఏపీలో తెలుగుదేశం బలం తగ్గించడం కోసం రాష్ట్రంలో బీజేపీ స్వయంగా ఉనికిని సైతం కోల్పోవడానికి రెడీ అవుతోంది. అందుకే పార్టీ రాష్ట్ర నాయకులతో సంబంధం లేకుండా నేరుగా కేంద్ర నాయకత్వమే జగన్ తో సంబంధాలు నెరుపుతోంది. అడ్డగోలు అప్పులకు సహకారం అందిస్తోంది. జగన్ కు మద్దతుగా నిలవడం వల్ల రాష్ట్రంలో బీజేపీ ఏమాత్రం బలపడే అవకాశాలు లేవు. అసలా పార్టీకి ఏపీలో ఉన్న బలం దాదాపు శూన్యం. అందుకే తన ప్రయోజనాల కోసం కాకుండా జగన్ ప్రయోజనాల పరిరక్షణ కోసం బీజేపీ అధినాయకత్వం ఏపీల పావులు కదుపుతోంది. ప్రస్తుతం ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీలో తెలుగుదేశం పార్టీకి జనం సానుకూలంగా ఉన్నారనీ, ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే.. పొత్తులతో సంబంధం లేకుండా ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమనీ బీజేపీ అంచనాకు వచ్చింది. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఐటీ షోకాజ్ నోటీసుల పేరుతో జగన్ కు ఒక ఆయుధాన్ని ఇచ్చింది. ఆ షోకాజ్ నోటీసులతో చంద్రబాబు అరెస్టయ్యే అవకాశం లేకపోయినా.. జగన్ చేతుల్లో ఉన్న ఏపీ సీఐడీని చంద్రబాబుపై ప్రయోగించే వెసులు బాటు వచ్చింది. చంద్రబాబు అరెస్టు వెనుక ఐటీ నోటీసులే ఉన్నాయన్న భావన ఏపీ ప్రజలలో కల్పించి.. ఏపీ సీఐడీ అడ్డగోలుగా రెండేళ్ల కిందటి స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్టు చేసింది. ఇందుకు వెనుక నుంచి బీజేపీ మద్దతు, ప్రోత్సాహం దండిగా ఉన్నాయనడంలో సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు.
వచ్చే ఎన్నికలలో చంద్రబాబు అధికారంలోనికి వచ్చి మళ్లీ బలపడకుండా బీజేపీ చేస్తున్న వ్యూహరచనలో భాగమే ఈ అరెస్టు అని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే జనగ్ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు చంద్రబాబును ప్రజలలోకి వెళ్లకుండా అడ్డుకోవడం ద్వారా తెరవెనుక నుంచి ఏపీలో తన మిత్రపక్షమైన జనసేన పట్ల జనం మొగ్గు చూపేలా ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి తీసుకువచ్చి కొత్త అంకానికి బీజేపీ తెరలేపే అవకాశం ఉందని కూడా పురిశీలకులు విశ్లేషిస్తున్నారు.