కార్డు ఎందుకు దండగ.. ఏటీఎంలో యూపీఐ స్కాన్ ఉండగా! | upa in atm available| debit| credit| cards| necessary| scan
posted on Sep 9, 2023 12:41PM
ఏటీఎం.. ఇప్పుడంటే పేటీఎం, జీపే, ఫోన్ పే, భారత్ పే, వాట్సాప్ పే, భీమ్ పే ఇలా ఎన్నో రకాల యూపీఐ పేమెంట్ యాప్స్ వచ్చాయి కానీ.. అంతకు ముందు బ్యాంకు, లేదంటే ఏటీఎం మాత్రమే లావాదేవీలకు దిక్కు. బ్యాంకులో రద్దీని తట్టుకోలేక వీలైనంతవరకు అందరూ ఏటీఎంల మీదనే ఎక్కువగా ఆధారపడేవారు. ఇప్పటికీ చాలా మంది నగదు కావాలంటే ఏటీఎంలలో విత్ డ్రా చేసుకుంటారు. అయితే తరచుగా ఎక్కడో చోట పెట్టేసి కార్డులు మర్చిపోవడం, పోగొట్టుకోవడం, లేదా పిన్ నంబర్ మర్చిపోవడం పలువురికి పెద్ద సమస్యగా ఉంటుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే కొన్ని బ్యాంకులు కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాయల్ అప్షన్స్ తీసుకొచ్చారు. అయితే సదరు బ్యాంక్ యాప్ ఉంటేనే ఇది వీలవుతుంది. ముందుగా యాప్ లో ఎంత కావాలో అంతకు కార్డ్ లెస్ లో సెలక్ట్ చేసుకుంటే ఒక పాస్ వర్డ్ వస్తుంది. దాంతో ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు.
అయితే ఈ కార్డ్ లెస్ విత్ డ్రాయల్ విధానంలో ఇప్పుడు మరో ముందడుగు పడింది. యూపీఐ పేమెంట్ అప్షన్ ద్వారా కూడా ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. హిటాచీ పేమెంట్ సర్వీసెస్ కంపెనీ ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. యూపీఐ ఏటీఎంను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో ఈ సర్వీస్‌ను లాంచ్ చేసింది. దీన్ని హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఏటీఎం అని పిలుస్తారు. దీనిని ఉపయోగించుకుని డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుతో పని లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2023లో ఈ హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఏటీఎంను లాంచ్ చేశారు. త్వరలో ఈ ఏటీఎంలను అందుబాటులోకి రానున్నాయి.
యూపీఐ ద్వారా నగదు పొందాలంటే ముందుగా ఎంత మెుత్తం డ్రా చేయాలో నిర్ణయించుకోవాలి. తర్వాత ఏటీఎంలో యూపీఐ క్యాష్ విత్‌డ్రా అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ సాధారణ ఏటీఎంల మాదిరే రూ.100, రూ.500, రూ.1000, వంటి మొత్తాల వంటి నగదు అప్షన్స్ కనిపిస్తాయి. ఎంత డబ్బు విత్‌డ్రా చేస్తున్నారో ఎంటర్ చేయాలి. అనంతరం ఏటీఎం స్క్రీన్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ ఫోన్‌లో యూపీఐ యాప్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. తర్వాత మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూపీఐ పిన్ కరెర్ట్‌గా ఎంటర్ చేసిన తర్వాత ఏటీఎంలో ట్రాన్సాక్షన్ ప్రక్రియ మెుదలవుతుంది. అది పూర్తి అయిన తర్వాత ఏటీఎం నుంచి డబ్బులు వచ్చేస్తాయి.
సాధారణంగా ఏటీఎం కార్డుతో ఎలా ట్రాన్సక్షన్ చేస్తామో ఈ ఏటీఎంలో కూడా అంతే ఉంటుంది. అక్కడ కార్డు వివరాలను ఏటీఎం రీడ్ చేసి మీ వివరాలను స్క్రీన్ మీద చూపిస్తే.. ఈ యూపీఏ ఏటీఎంలలో మాత్రం మీరు స్కాన్ చేసిన అనంతరం యూపీఐ యాప్ వివరాలను స్కాన్ చేస్తుంది అంతే తేడా. ప్రస్తుతం దేశంలో 3000 ఏటీఎంలకు ఇది యాక్సస్ కలిగి ఉన్నట్లు చెప్తుండగా.. త్వరలోనే ఈ ఏటీఎంలలో సేవలు అందుబాటులో రానున్నాయని చెప్తున్నారు. ఇది నాన్ బ్యాంకింగ్ సంస్థలచే నిర్వహించబడుతుండగా.. యూపీఏ, కార్డుల స్కిమ్మింగ్ వంటి ఆర్థిక మోసాలను నిరోధించేందుకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని టెక్నాలజీ నిపుణులు అంచనా వేస్తున్నారు.