Leading News Portal in Telugu

ఆర్థిక అసమానతలకు జి20 సదస్సులో పరిష్కారం! | g20 summit| solution| financial| inequalities| delhi| modi


posted on Sep 9, 2023 2:32PM

దేశ రాజధాని ఢిల్లీలో  జీ 20 శిఖరాగ్ర సదస్సు మొదలైంది. శని, ఆదివారాలు రెండు రోజుల పాటు (సెప్టెంబర్ 9. 10) జరిగే ఈ శిఖరాగ్ర సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు, భారత ప్రభుత్వం సకల ఏర్పాట్లూ చేసింది.  వివిధ దేశాల దేశాధి నేతలు, మరెందరో ప్రపంచ ప్రముఖులు,హాజరవుతున్న ఈ సదస్సు ద్వారా భారత దేశ శక్తి, సామర్ధ్యాలు, భారతీయ సంస్కృతీ సాంప్రదాయ విలువలను ప్రపంచం ముందు ఉంచేందుకు  భారత ప్రభుత్వం సమున్నత స్థాయిలో సన్నాహాలు చేసింది. 

దేశ రాజధాని నగరం దిల్లీ కనీ వినీ ఎరుగని రీతిలో అంగ రంగ వైభవంగా ముస్తాబైంది. ఇండియా అనుకుని భారత దేశంలో అడుగు పెట్టిన విదేశీ  ప్రముఖులు సైతం విస్తుపోయేలా రాజధాని నగరం అందంగా అలంకరించుకుంది. ఓ వంక కట్టు దిట్టమైన భద్రతా ఏర్పట్లు,మరో వంక అతిథులను రంజింప చేసే విధంగా స్వాగత సత్కారాలు. కనువిందు చేస్తున్న భారతీయ కళా రూపాల ప్రదర్శనలు. హస్త కళల వైభవ ప్రదర్శనలు.. ఇలా  ఢిల్లీ నగరంలో ఎటు చూసినా  పండగ కళ కనువిందు చేస్తోంది.  కొత్త ఢిల్లీ  ప్రపంచానికి  కొత్త  భారత్ ను పరిచయం చేస్తోందా అన్న విధంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఏర్పాట్లు ఉన్నాయి.  మరో వైపు మొదటి సారిగా భారత దేశానికి  జీ 20 అధ్యక్ష బాధ్యతలు దక్కడం, మరో మరుపు రాని మధుర జ్ఞాపకంగా మిగిలి పోతుందని అంటున్నారు.  

నిజమే భారత దేశానికి జీ 20 అధ్యక్ష బాధ్యతలు దక్కడం, యాధృచ్ఛికమే కావచ్చు. వరస క్రమలో వచ్చిందే అయినా, ఇన్నేళ్ళలో మొదటి సారిగా భారత దేశానికి  జీ 20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే గౌరవం దక్కడం ఒక మధుర స్మృతిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అందుకే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్   అంతటి వారు ఈ గౌరవం భారత్ కు దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తన  జీవిత కాలంలో భారత దేశానికీ  జీ 20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే గౌరవం దక్కడం, నిజంగా .. చాలా చాలా సంతోషంగా వుంది. జీ 20 దేశాధి నేతలకు భారత దేశం ఆతిధ్యం ఇవ్వడం   చూస్తున్నాను  అంటూ మన్మోహన్ హర్షం వ్యక్తం చేశారు. ఆవిధంగా ఆయన ఈ సదస్సు ప్రాముఖ్యత ఏమిటో చెప్పకనే చెప్పారు. అలాగే, భారత దేశ పరిపాలనా విధానంలో, అభివృద్ధిలో విదేశాంగ విధానం అత్యంత కీలకమని చెప్పడం ద్వారా మన్మోహన్ సింగ్ 20 శిఖరాగ్రసదస్సు ప్రాముఖ్యతను   వివరించారు. ఆ సదస్సును భారత్ నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేసి మన్మోహన్ తన రాజనీతిజ్ఞతను చాటుకున్నారు.

అదలా ఉంటే అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, భారతీయ సంతతికి చెందిన ఇంగ్లాండ్   ప్రధానమంత్రి రిషి సునాక్ సహా వివిధ దేశాల అధినేతలు  ఈ రెండు రోజుల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. మరోవంక రెండు రోజుల చర్చలు, సంప్రదిపుల అనంతరం ఢిల్లీ డిక్లరేషన్ పేరున వెలువడే, జీ 20, 18 వశిఖరాగ్ర సమావేశం  ప్రకట కోసం ప్రపంచం మొత్తం, ఎదురు చూస్తోంది. నిజానికి, అంగరంగ వైభవంగా జరిగిన ఏర్పాట్లు, మన దేశం పై ప్రపంచ దేశాలు కురిపిస్తున్న ప్రశంసల జల్లుల విషయాన్ని పక్కన పెడితే  రెండురోజుల సదస్సు ముగిసిన అనంతరం వెలువడే,  న్యూ ఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్  కోసం సభ్య దేశాలే కాదు, ప్రపంచం మొత్తం  వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది.

మరో వంక ఢిల్లీ డిక్లరేషన్, గతానికి భిన్నంగా  ఆచరణ సాధ్యంగా ఉటుందని, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, దక్షిణ ప్రపంచం (గ్లోబల్ సౌత్) ఆశలు, ఆశయాలకు ప్రతీకగా నిలుస్తుందని, భారత దేశం విశ్వాసాన్ని ప్రకటించింది. నిజానికి జీ 20 శిఖరాగ్ర సదస్సుల గత చరిత్ర అంత ఘనంగా లేదనేది అంగీకరించి తీరాల్సిన వాస్తవం. అయితే   కొవిడ్ అనంతర ప్రపంచానికి  ఇండియా చూపిన వెలుగు మార్గం నేపధ్యంలో  జి 20 శిఖరాగ్ర  సదస్సు ప్రధాన వేదికైన భారత్ లో కనుల పండగగా కొలువు తీరిన నేతలు గతానికి భిన్నంగా ఆచరణయోగ్యమైన, అంతకంటే ముఖ్యంగా మారుతున్న ప్రపంచం అవసరాలకు అనుగుణంగా భారత దేశం రూపొందించిన ఢిల్లీ డిక్లరేషన్’కు  ఆమోద ముద్ర వేస్తాయని ఆశిద్దాం.

  జీ20లో ప్రారంభంలోనే కీలక  పరిణామం చోటు చేసుకొంది.  ఆఫ్రికన్‌ యూనియన్‌ కు శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. నేడు భారత్‌ లో జరిగిన వన్‌ ఎర్త్‌ సెషన్‌ ప్రారంభోపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రతిపాదించారు. అందరు సభ్యుల అంగీకారంతో ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆఫ్రికన్‌ యూనియన్‌ అధినేతను శాశ్వత సభ్యులకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు.

అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ తమ ప్రారంభోపన్యాసంలోనే 21వ శతాబ్దంలో ప్రపంచానికి కొత్త దిశ, దశ సూచించడానికి ఇదే కీలక సమయం అంటూ భారత ఆలోచనలు  సభ్య దేశాల ముందుంచారు.  పాత సవాళ్లు ఇప్పుడు కొత్త సమాధానాలు కోరుతున్నాయి  తన మాన్ కీ బాత్ ను పంచుకున్నారు.  అందుకనే మనం హ్యూమన్‌ సెంట్రిక్‌ అప్రోచ్‌తో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. కొవిడ్‌ 19 సంక్షోభం తర్వాత ప్రపంచంలో విశ్వాస రాహిత్యం ఏర్పడిందనే నగ్న సత్యాన్ని గుర్తు చేస్తూ యుద్ధం ఈ అపనమ్మకాన్ని మరింత పెంచిందని, అందరి మనసులోని మాటను మోడీ తన నోట వినిపించారు. కొవిడ్‌ను ఓడించిన మనం ఈ విశ్వాస రాహిత్యంపై కూడా విజయం సాధించవచ్చునని అదరం  కలిసి ప్రపంచంలో నెలకొన్న అపనమ్మకాన్ని పారదోలుదామని పిలుపు నిచ్చారు. ఈ క్రమంలో సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌ మంత్రం మనకు మార్గదర్శిగా ఉంటుందని అన్నారు. ప్రపంచంలో పేద, సంపన్న దేశాల మధ్య తేడాలు, ఆహారం, ఇంధనం నిర్వహణ, హెల్త్‌, ఎనర్జీ, నీటి భద్రత వంటి సమస్యలకు సమాధానం కోసం ముందుకు వెళ్లాల్సిందే. భారత్‌ జీ20 అధ్యక్షతన దేశం లోపలా, బయట అందరిని కలుపుకొని పోవడానికి ప్రతీకగా నిలిచింది. ఇది ప్రజల జీ20 అనడానికి నిదర్శనంగా మారింది. దేశంలోని 70 పైగా నగరాల్లో 200కుపైగా జీ20 సదస్సులు జరిగాయి.  

అయితే, జీ 20 శిఖరాగ్ర  సదస్సుపై ఎన్నో ఆశలు ఉన్న మాట ఎంత నిజమో, అంతకు పదిరెట్లు .. అనుమానాలు ఉన్నాయన్నది కుడా అంతే నిజం. ఈ నేపధ్యంలో   మొదలైన  జీ 20 మరో ప్రస్థానం .. ప్రపంచ సమస్యలకు  ముఖ్యంగా ప్రపంచ ప్రగతికి ప్రతిబంధకంగా నిలిచిన పర్యావరణ, కాలుష్య సమస్యలు, ఆర్థిక అసమానతల వంటి సంస్యలకు పరిష్కారం చూపుతుందని ఆశిద్దాం.