Leading News Portal in Telugu

సునీల్ కనుగోలు మాటే శాసనం.. ఈయన చెప్పిన వారికే ఏఐసీసీ సీట్లు! | sunil kanugolu word final| telangana| congress| candidates| selet| final| hicommand| faith| karnataka| result


posted on Sep 9, 2023 11:41AM

సునీల్ కనుగోలు.. గతంలో ఈ పేరు అక్కడక్కడా వినిపించినా కర్ణాటక  అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం తర్వాత ఈ పేరు మార్మోగిపోతోంది. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద అసెట్ గా సునీల్ కనుగోలు మారిపోయారని చెప్పొచ్చు. గతంలో కర్ణాటక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సమయంలో ఈయన మాటే శాసనంగా మారిపోయింది.  తన వ్యూహలు, ప్రతివ్యూహాలతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించేస్తున్న సునీల్ మాటే ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు కూడా వేద వాక్కుగా మారిపోయింది. అంతకు ముందు ఎన్నికల వ్యూహకర్త అంటే ప్రశాంత్ కిషోర్ పేరు మాత్రమే వినిపించేది.  ఇప్పుడు సునీల్ కనుగోలు పేరు అదే స్థాయిలో వినిపిస్తుంది. అవుతుందా లేదా.. బీజేపీ సక్సెస్ సీక్రెట్ గా మారిన మోడీ-షాల ద్వయం వ్యూహాలను సునీల్ ఛేదించగలరా అనే అనుమానాల మధ్యనే కర్ణాటకలో ఆయన వ్యూహాలు వర్కౌట్ అయ్యాయి. 

కర్ణాటకలో కాంగ్రెస్ కోసం ఏడాది కాలంగా ఆయన చేసిన సేవలు భేష్ అనిపించాయి. లెక్కలేసి పక్కగా ప్లాన్ అమలు చేయడంతో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. మ్యాజిక్ ఫిగర్ కు మించి స్థానాలను గెలిచిన కాంగ్రెస్ కర్ణాటకలో సింగిల్ గానే అధికారంలోకి వచ్చేసింది. ఒక్క కర్ణాటకలో అధికారంలోకి రావడం మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు జవసత్వాలు నింపింది. ఇంతటి విజయానికి కారణమై, పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చిన కనుగోలుకు సిద్ద రామయ్య సర్కార్ పెద్దపీట వేసింది. ప్రభుత్వ మీడియా సలహాదారుడిగా నియమించింది.  నెక్ట్స్ టార్గెట్ గా ఇప్పుడు సునీల్ తెలంగాణ మీద ఫోకస్ చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా ఇక్కడ అభ్యర్థుల ఎంపిక కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. మొత్తం ఆరు పాయింట్లతో సెగ్మెంట్లలో కనుగోలు విశ్లేషణ తెలంగాణలో కొనసాగుతుంది. దీంతో ఇప్పుడు సునీల్ అభ్యర్థులను ఎలా ఫైనల్ చేస్తారా అన్న ఉత్కంఠ కొనసాగుతుంది.

ఇప్పటికే సునీల్ అభ్యర్థుల ఎంపికలో ఒకదశ పూర్తి కాగా వివరాలను నేరుగా ఏఐసీసీ అధిష్టానికే అప్పగించినట్లు తెలుస్తుంది. రాష్ట్రస్థాయి నేతల సిఫారసులు, రిఫరెన్సులు లేకుండా ఢిల్లీ పెద్దలు కూడా సునీల్ నివేదికలకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ సునీల్ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఆసక్తి ఉన్న నేతలు దరఖాస్తు చేసుకోవాలనే ప్రతిపాదన తీసుకురాగా.. ఇప్పటికే టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 119 స్థానాలకు గాను వెయ్యికి పైగా అప్లికేషన్లు వచ్చాయి. దీంతో పార్టీ స్టేట్ ఎలక్షన్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీలు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై దరఖాస్తుల్ని పరిశీలించింది. నియోజకవర్గాల వారీగా పరిశీలించి 1:3 నిష్పత్తిలో  అభ్యర్థులను ఫిల్టర్ చేసినట్లు తెలుస్తుంది.

అయితే, ఇదంతా కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియలో  భాగంగా గతంలో చేసినట్లే ఇప్పుడు కూడా చేసినా ఫైనల్ గా సునీల్ ఫైనల్ చేసిన అభ్యర్థులకే టికెట్లు ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది. ఈ నెలలో హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు, సోనియాగాంధీ పర్యటన ఉండగా ఈ హడావిడి ముగిసిన అనంతరం అభ్యర్థుల తొలి జాబితా వెలువడనున్నట్లు తెలుస్తుంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఇప్పటికే 30 మంది పేర్లతో తొలి జాబితా సిద్దమైనట్లు తెలుస్తుంది. ప్రత్యామ్నాయ అభ్యర్థుల గురించి ఆలోచించాల్సి న అవసరం లేని ముప్పై నియోజకవర్గాలతో సునీల్ టీం ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చేయగా ఆ  30 స్థానాల్లో ఎలాంటి మార్పులు లేకుండా కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ ఫస్ట్ లిస్ట్ సునీల్ నివేదిక ప్రకారం వస్తే.. ఇక మిగతా నియోజకవర్గాలలో కూడా నేతల రిఫరెన్సులు ఏ మాత్రం పనిచేయవు. ఫైనల్ గా కాంగ్రెస్ అభ్యర్థులను సునీల్ నివేదికలేఎంపిక చేయనున్నాయి.