Leading News Portal in Telugu

జగన్ బరితెగుంపునకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అరెస్ట్! | babu arrest a proof of jagan arrogance| ap| cid| skii| developement


posted on Sep 9, 2023 7:32PM

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం జరిగినట్లు ఏపీ సీఐడీ పోలీసులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం (సెప్టెంబర్ 8) అర్ధరాత్రి పెద్ద ఎత్తున మోహరించి  శనివారం (సెప్టెంబర్ 9) ఉదయం 6 గంటలకు నంద్యాలలో చంద్రాబుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకు సంబంధించి ముందుగా నోటీసులు ఇవ్వకుండా అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో చంద్రబాబుతో పాటు ఆయన న్యాయవాదులు సీఐడీ అధికారులతో వాదనకు దిగారు. రిమాండ్ రిపోర్ట్ ద్వారా అన్ని అనుమానాల్ని నివృత్తి చేస్తామని సీఐడీ నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. మరోవైపు వందలాది మంది కార్యకర్తలు చంద్రబాబు అరెస్టును అడ్డుకోగా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు చంద్రబాబు తన కాన్వాయ్ లోనే వచ్చేందుకు అంగీకరించడంతో ఆయన్ను అక్కడ నుండి తరలించారు.

కాగా  చంద్రబాబుపై 120 (బి) 166, 167, 418,420, 465,468, 471, 409, 201, 109 రెడ్ విత్ 34, 37 ఐపీసీ, 1988 అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 12, 13 ( 2) రెడ్ విత్ 13(1)(సి),(డి) నమోదు చేసినట్టు చంద్రబాబుకు ఏపీ సీఐడీ డిప్యూటీ సూపరింటెండెండ్ ధనుంజయుడి పేరుతో అప్పటికప్పుడు జారీ చేసిన నోటీసులో ఉంది. సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 6 గంటలకు నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో చంద్రబాబును నాన్ బెయిలబుల్ నేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేస్తున్నట్టుగా ఆయన మీడియాకు  తర్వాత వివరించారు. అయితే ఈ మొత్తం  ఆరోపణలు, ఈ కేసులు, అర్ధరాత్రి హైడ్రామా, వందలాది కార్యకర్తలున్న ఓరాజకీయ కార్యక్రమం జరిగే చోట వందలమంది పోలీసులతో సీఐడీ రణరంగం సృష్టించడం చూస్తుంటే ఒక్కటి క్లియర్ కట్ గా అర్ధమవుతుంది. కేసేంటి అన్నది పక్కన పెడితే ఈ వ్యవహారంలో జగన్ కక్షసాధింపు మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్నది.

 16 నెలల పాటు జైల్లో ఉన్న వైఎస్ జగన్ కనీసం 16 రోజులైనా చంద్రబాబును జైల్లో ఉంచాలి. తనను లక్ష కోట్ల అవినీతి పరుడిగా ముద్ర వేసిన చంద్రబాబు కూడా అవినీతి పరుడే అని ప్రచారం చేయాలి. ఇదే జగన్ లక్ష్యం. ఇందుకోసమే వ్యవస్థలను అడ్డగోలుగా వాడేసి తన పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే  జగన్ జైలుకు కాంగ్రెస్ కదా కారణం చంద్రబాబును ఏం చేశారని చాలా మందికి ఒక అనుమానం ఉంది. జగన్ పదహారు నెలలు జైలు పాలు చేసిన ఘటనలో కాంగ్రెస్ తో పాటు చంద్రబాబు హస్తం కూడా ఉందని వైసీపీ ఆది నుంచి అనుమానిస్తోంది. జగన్ కి కనీసం బెయిల్ కూడా రానీయకుండా అన్ని నెలల పాటు జైలులో ఉంచారన్నది వారి బాధ. చంద్రబాబే వ్యసస్థలను మ్యానేజ్ చేసి బెయిల్ రాకుండా చేశారని జగన్ బలంగా నమ్ముతున్నారు. అందుకే అప్పటి నుండి ఏ చిన్న కేసు దొరికినా దాన్ని చంద్రబాబుకు ఆపాదిస్తున్నది.

నిజానికి అమరావతి రాజధాని అతి పెద్ద స్కాం అని, దాని మీద ఎన్నో విచారణలు జరిపించిన జగన్ ప్రభుత్వం  ఆ కేసులో ఎలాంటి ఆధారాలు లభించక  స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కేసును అందిపుచ్చుకుంది. లేని కంపెనీలను సృష్టించి ప్రభుత్వ వాటాగా నిధులు మళ్లించారన్నది ప్రభుత్వ వాదన. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో భాగస్వామ్యం కావాలని ఈడీని కోరారు సీఐడీ అధికారులు. అయితే, ఈడీ ఈ వ్యవహారంలోకి రాలేదు. ఈ కేసు మిస్ చేస్తే చంద్రబాబును అరెస్ట్ చేయడం కుదరదని భావించిన సీఐడీ నియమ నిబంధనలను తుంగలో తొక్కి అర్ధరాత్రి అరెస్టుకు తెర తీశారు. అయితే   ఈ కేసులో బాబు పాత్ర ఉందని ఆధారాలు పట్టుకోవడం అసంభవమని ఇప్పటికే విశ్లేషకులు తేల్చేశారు. కేవలం కక్షసాధింపు కోసమే  జగన్   ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్లుగా ఉందన్న  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద చంద్రబాబు అరెస్టు ను జగన్ బరితెగింపునకు నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.