చంద్రబాబు అరెస్ట్.. అసలు కేసేంటి? సీఐడీ అత్యుత్సాహం ఎందుకు? | cid overactiom to arrest babu| case| what| nandyal| function| hall| vijayawada| acb
posted on Sep 9, 2023 7:13PM
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగిన విషయం తెలిసిందే. మూడు రోజుల కిందట చంద్రబాబు అనుమానం వ్యక్తం చేసినట్లుగానే చివరికి ఏపీ పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. అయితే, ఈ అరెస్టు వెనక లక్ష్యం ఏంటి? ఆసలు ఈ కేసు ఏంటి? సెక్షన్ ఏంటి? కుంభకోణం ఏంటి? అందులో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు పాత్ర ఏంటన్నది కాసేపు పక్కన పెడితే అసలు అరెస్ట్ చేసిన తీరుపైనే తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. ముందుగా రాజకీయ పర్యటనలో ఉండే సమయంలో అరెస్టుకు ఉపక్రమించడం విమర్శలకు తావిస్తోంది. అదీ ముందుగా ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం.. అదీ అర్ధరాత్రి హడావిడి చేయడం మరింత అభ్యంతరకరంగా ఉంది. చుట్టూ వందలాది మంది కార్యకర్తలు, నాయకులు ఉండగా, అరెస్టు చేసేందుకు ఏపీ సిఐడి అధికారులు వెళ్లడం తప్పుడు చర్యగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబు అరెస్టుపై ఏపీలో వైసీపీ తప్ప మిగతా అన్ని పార్టీలు, ఆ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి, కమ్యూనిస్ట్ నేతలు కూడా చంద్రబాబు అరెస్టుపై తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు రాజకీయ పరిశీలకులు, మేధావులు కూడా చంద్రబాబు అరెస్ట్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసలు జడ్+ కేటగిరీ భద్రత, 14 ఏళ్లపాటు సీఎంగా పనిచేసి ఉన్నత ప్రొఫైల్ ఉన్న నాయకుడు చంద్రబాబును వారాంతంలో కోర్టుకు సెలవు చూసుకొని అరెస్టు చేయడం, అదీ రాజకీయ పర్యటనలో ఉండగా అర్ధరాతి మందీ మార్బలంతో పోలీసులు దండయాత్ర చేయడంతో ఏపీలో అసలు రాజ్యాంగం అనే ఒకటుందా? చట్టం, పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నాయా? లేక రాజకీయ కక్ష్య సాధింపులో భాగంగా ప్రభుత్వ తొత్తులుగా మారిపోయాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కాగా, అసలు ఈ కేసు విషయానికి వస్తే ఏపీలో యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో భాగంగా యువతకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు సీమెన్స్, డిజైన్టెక్ అనే సంస్థలతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 3 వేల 300 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని
యువతకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇస్తామని ఈ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. 3 వేల 300 కోట్ల రూపాయల్లో 10 శాతం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చేలా.. మిగిలిన 90 శాతం
సీమెన్స్ సంస్థ పెట్టుబడి పెట్టేలా ఒప్పందం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం 10 శాతం వాటాగా.. జీఎస్టీతో కలిపి 370 కోట్ల రూపాయలను ఆ రెండు సంస్థలకు చెల్లించింది. ఇందులో 240 కోట్ల రూపాయలను డిజైన్టెక్ సంస్థకు బదలాయించగా మిగతా సొమ్మును సీమెన్స్ కంపెనీకి బదలాయించారు. ఈ 370 కోట్లను ప్రభుత్వం చెల్లించినట్లుగా చూపించి వెనకేసుకున్నారనేది సీఐడీ ఆరోపణ. ఈ కేసులోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు.
ఈ కేసు చూస్తేనే అర్ధమవుతుంది ఎంత సిల్లీగా ఉందో.. కానీ ఈ కేసును అడ్డం పెట్టుకొనే జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేయడం చూస్తే కుక్క తోక పట్టుకొని నదిని ఈదినట్లే కనిపిస్తుంది. అసలు ఏ మాత్రం పసలేని ఆరోపణలు చేయడం వైసీపీ నేతలకు కొత్తేమీ కాదు. ఆ మాటకొస్తే జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డి హయంలోనే చంద్రబాబుపై పదుల కొద్దీ కేసులు పెట్టారు. కానీ, న్యాయస్థానాల వద్ద ఒక్కటీ నిలబడలేదు. స్టేలు తెచ్చుకొని చంద్రబాబు మేనేజ్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. కానీ, నిజానికి ఆ కేసులలో విషయం లేకనే న్యాయస్థానాల వద్ద నిలవలేదు. ఇప్పుడు ఇది కూడా అంతే. కేవలం ఓ నాలుగు రోజుల పాటు వైసీపీ నేతలు జబ్బలు చరుచుకోవటానికి మాత్రమే పనికి వస్తుంది. ఇప్పటి వరకూ జగన్ లక్ష్య కోట్ల అవినీతి ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తుండగా.. రిటర్న్ చంద్రబాబును కూడా అవినీతి పరుడుగానే బురద జల్లేందుకు, ఆరోపణలు చేసేందుకు మాత్రమే ఈ కేసు పనికి రానుంది. అంతేతప్ప ఇందులో పసలేదన్నది పరిశీలకుల అభిప్రాయం.