ఎన్నికలకు ముందు బాబు అరెస్ట్.. కోరి మరీ టీడీపీకి మైలేజ్ ఇస్తున్న జగన్?! | babu arrest before elections| jagan| milafe| tdp| ycp
posted on Sep 10, 2023 5:19AM
ఎట్టకేలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరిక కొంతమేర నెరవేరింది. టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు శిక్ష పడుతుందా? పడితే ఎన్నేళ్లు పడుతుంది? రిమాండ్ కు తరలిస్తారా? ఎన్నిరోజుల రిమాండ్ విధిస్తారు? బెయిల్ వస్తుందా? ఇలాంటి అనుమానాలన్నీ ముందు ముందు తేలాల్సి ఉండగా.. ప్రస్తుతానికి అయితే కొంతమేర సీఎం జగన్ తన కోరిక నెరవేర్చుకున్నారు. రూ.371 కోట్ల రూపాయలను లేని కంపెనీలను సృష్టించి నిధులు తరలించారన్న ఆరోపణలపై ఈ అరెస్ట్ జరిగింది. దీనికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ పేరుతో స్కాంకు పాల్పడినట్టు వైసీపీ తీవ్ర ప్రచారం చేస్తుంది. మరి ఈ అరెస్ట్ రాజకీయంగా ఎవరికి కలిసి వస్తుంది? చంద్రబాబును అరెస్ట్ చేసిన హీరోగా జగన్ మైలేజ్ పొందుతాడా? తనను అక్రమంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు సానుభూతి పొందుతారా అన్న చర్చలు జరిగిపోతున్నాయి.
నిజానికి ఏపీలో ఇప్పుడు టీడీపీ ఫుల్ స్వింగ్ లో ఉంది. జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేతలు యమా దూకుడు మీదున్నారు. ఒకవైపు నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వ తీరును ఎండగడుతుంటే.. చంద్రబాబు బస్సు యాత్రలు, సాగునీటి ప్రోజెక్టుల పరిశీలన అంటూ జగన్ మోహన్ రెడ్డిని గుక్క తిప్పుకోకుండా చేస్తున్నారు. టీడీపీ నేతలు చేస్తున్న ఈ యాత్రలతో టీడీపీ క్యాడర్ ఉత్సహం రెట్టింపు అవుతుంది. ప్రజల నుండి కూడా అనూహ్య స్పందన వస్తుంది. టీడీపీ నేతలు ఎక్కడ ఎలాంటి కార్యక్రమం జరిగినా ప్రజల నుండి ఊహించని రీతిలో స్పందన వస్తుంది. దీంతో వైసీపీ నేతలకు ఇది మింగుడు పడడం లేదు. వైసీపీకి ఊపిరాడని పరిస్థితి నెలకొంది. దీంతో ఎలాగైనా టీడీపీ దూకుడుకు బ్రేక్ వేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అదే ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ రూపంలో ఆచరణలోకి వచ్చిందా అనే అనుమానాలు కలిగిస్తుంది.
అయితే, ప్రస్తుతానికి చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి కాస్త ఇబ్బందిగానే మారినా తర్వాత మాత్రం టీడీపీకి ఇది ప్లస్ అయ్యే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయ నిపుణులు సీఐడీ సృష్టించిన హడావుడి అంత సీన్ ఈ కేసులో ఉండదని తేల్చేశారు. ఒకవేళ నిజంగా చంద్రబాబు హయంలో అవినీతి జరిగిందని ఆధారాలున్నా మహా అయితే 14 రోజుల రిమాండ్ సాధ్యమవుతుందని.. అయితే, కేసు తీవ్రత లేని దృష్ట్యా బెయిల్ దొరకడం పెద్ద కష్టమేమీ కాదని చెప్తున్నారు. ఈక్రమంలో మహా అయితే శని, ఆదివారాలు చంద్రబాబు కస్టడీలో ఉండనున్నారు. సోమ లేదా మంగళవారం బెయిల్ దొరకడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ కేసులో హైకోర్టుకు వెళ్లేందుకు కూడా టీడీపీ నేతలు అన్ని సంప్రదింపులు జరుగుతుండగా ఏది ఏమైనా ఎక్కువ రోజులు ఈ కేసులో చంద్రబాబును తమ అధీనంలో ఉంచుకోవడం సీఐడీకి కుదరని పనిగానే భావించాలి.
ఈ క్రమంలో ఈ అరెస్ట్ వ్యవహారం టీడీపీకి సానుభూతిపరంగా మరింత మైలేజీ తేవడం గ్యారంటీగా కనిపిస్తుంది. ప్రభుత్వ తీరును ఎండగడుతున్నందుకే తనను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని చంద్రబాబు ప్రజలకు చెప్పుకొనేందుకు మంచి స్టఫ్ దొరికినట్లే భావించాలి. తమను ఎదుర్కోలేని జగన్ పోలీసులను అడ్డం పెట్టుకొని కక్ష్య సాధింపు చర్యలకు పాలపడ్డాడని ఆరోపించేందుకు టీడీపీకి ఇది ఆయుధంగా మారనుంది. ప్రశ్నించిన వారిపై ఇలా కేసులు బనాయించి నోళ్లు మూయించాలని చూడడం జగన్ మోహన్ రెడ్డికి కొత్తేమీ కాదని.. ఇప్పటికే రాష్ట్రమంతా జగన్ బాధితులు ఉన్నారని ఉదాహరణలతో సహా టీడీపీ గోల్ చేసుకోవడం గ్యారంటీ. సరిగ్గా ఎన్నికలకు ముందు జగన్ ఈ అరెస్టుతో తన చేతులతో తానే మరో ఆయుధాన్ని సిద్ధం చేసి టీడీపీ నేతలకు ఇచ్చినట్లే భావించాల్సి వస్తుంది. భావోద్వేగాలకు విలువలనిచ్చే ఏపీ ప్రజలు ఈ అరెస్టు పట్ల కూడా ఎమోషనల్ అయ్యేలా అన్ని దారులు కనిపిస్తున్న తరుణంలో ఇది జగన్ మోహన్ రెడ్డికి మరో సంకటంగా మారనుంది.