చంద్రబాబు అరెస్ట్.. ఒక్కటిగా కదిలిన ఏపీ ప్రతిపక్షాలు! | babu arrest united opposition in ap| tdp| janasena| cpi
posted on Sep 10, 2023 5:53AM
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముందునుంచీ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగానే ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో రాజకీయ పర్యటనలో ఉన్నచంద్రబాబును కనీసం రెండు బెటాయిలియన్ల పోలీసుల్ని పంపి అక్రమంగా అరెస్ట్ చేశారు. అర్థరాత్రి నుంచి మొదలు పెట్టిన అరెస్ట్ డ్రామాను తెల్లవారే వరకూ కొనసాగించి టీడీపీ శ్రేణులను భయాందోళనకు గురి చేశారు. అసలు తెల్లవారే వరకూ చంద్రబాబును ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పడానికి పోలీసులు నిరాకరించడం తీవ్ర విమర్శల పాలవుతున్నది. కనీసం జెడ్+ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు అరెస్టుపై ముందుగా ఎలాంటి నోటీసు ఇవ్వకపోవడం.. కేంద్ర హోమ్ శాఖ భద్రత ఉన్న ఆయన అరెస్టుపై కేంద్ర హోమ్ శాఖకు కూడా సమాచారం ఇవ్వకపోవడం మరింత విమర్శల పాలవుతోంది.
చంద్రబాబు అరెస్టు కేవలం కక్షపూరిత రాజకీయంగా మాత్రమే కనిపిస్తుండగా.. ఒక్క రోజు అయినా చంద్రబాబును జైల్లో పెట్టాలన్న సీఎం జగన్ రెడ్డి కోరికను తీర్చుకునేందుకు ఇలా పోలీసు వ్యవస్థను, అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శని, ఆదివారం కోర్టులకు సెలవు కావడం, మరో వైపు ఢిల్లీ వేదికగా జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతుండటం అన్నీ చూసుకొని శుక్రవారం అర్ధరాత్రి అరెస్టుకు ఉపక్రమించడం చూస్తే వైసీపీ ప్రభుత్వం ఎంతటి సైకో మెంటాలిటీతో ఉందో అర్ధమవుతున్నదని టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తాను తప్పు చేస్తే నడి రోడ్డులో ఉరి తీయాలని చంద్రబాబు సవాల్ చేయగా.. ఆయన చేసిన తప్పేంటో, కేసేంటో చెప్పకుండా అరెస్ట్ కు ప్రయత్నించడం ఏపీ పోలీసు వ్యవస్థను అభాసుపాలు చేసింది. అప్పటికప్పుడు నోటీసులు అందించడం.. మిగిలిన వివరాలను రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేస్తాం.. ఇప్పుడు మాకు సహకరించాలని పోలీసులు వేడుకోవడం చూస్తే.. పోలీస్ వ్యవస్థ జగన్ మోహన్ రెడ్డికి ఎంత ఊడిగం చేస్తున్నదో స్పష్టమవుతుంది.
అయితే, చంద్రబాబు అరెస్టు ఏపీలో ప్రతిపక్షాల ఐక్యతకు వేదికగా మారింది. చంద్రబాబు అరెస్టును వైసీపీ మినహా దాదాపుగా అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండిచాయి. ప్రతిపక్ష నేతలంతా ఈ అరెస్టును ప్రజాస్వామ్యం మీద దాడిగా అభివర్ణించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి, కమ్యూనిస్ట్ నేతలు కూడా చంద్రబాబు అరెస్టుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రాథమిక ఆధారాలను చూపించకుండా అర్థరాత్రి అరెస్ట్ చేయడం దుర్మార్గమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఏ తప్పూ చేయని నాయకులపై మర్డర్ కేసులు పెట్టి జైళ్లకు నెడుతున్నారంటూ విమర్శించారు. పాలన పరంగా అనుభవం ఉన్న వ్యక్తి పట్ల ప్రభుత్వ తీరు సరైంది కాదని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశంలో ప్రభుత్వం పోలీసులు అందరి పట్ల ఒకేలా ఉండాలని పవన్ హితవు పలికారు. అరెస్టుపై నిరసన తెలిపితే హౌస్ అరెస్టులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు అండగా ఉంటూ మద్దతు తెలుపుతున్నామని పవన్ స్పష్టం చేశారు.
చంద్రబాబును అరెస్టు చేసిన తీరును బీజేపీ చీఫ్ పురందేశ్వరి తప్పు పట్టారు. ప్రోసీజర్ పాటించకుండా చంద్రబాబును అరెస్టు చేయడమేమిటని ఆమె ప్రశ్నించారు. కనీసం ముందస్తు నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చకుండా చంద్రబాబును అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని పురంధేశ్వరి అన్నారు. చంద్రబాబు అరెస్టును ఆమె ఖండించారు. చంద్రబాబు అరెస్టును సిపీఐ ఏపీ కార్యదర్శి కె. రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. పోలీసులు అర్థరాత్రి హంగామా సృష్టించాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. నారా లోకేష్ సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలను నిర్బంధించడం దుర్మార్గమని ఆయన అన్నారు. వైఎస్ జగన్ సర్కార్ ప్రతిపక్షాలపై పాల్పడుతున్న వేధింపు చర్యలకు చంద్రబాబు అరెస్టు పరాకాష్టగా ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టు తీరు పట్ల సీపీఎం రాష్ట్ర కమిటీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అర్ధరాత్రి చంద్రబాబు వసతిపై దాడిచేసి, జనాన్ని భయభ్రాంతులకు గురిచేసి అరెస్టు చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు.
రానున్న ఎన్నికల సమయానికి పొత్తులు ఉంటాయా.. విడివిడిగానే ఎన్నికలకు వెళ్తారా అన్నది తెలియదు కానీ చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఎన్నికల సమయానికి ఎవరు ఎలా అనేది పక్కన పెడితే ఇప్పుడైతే అన్ని పార్టీల నేతలు ముక్తకంఠంతో వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదని.. అలాంటిది ఇష్టారాజ్యంగా అర్ధరాత్రి అక్రమ అరెస్టులను తెరతీయడాన్ని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ అరెస్టు అంశంలో అధికార పార్టీ వైసీపీ ఒక్కటీ ఒకవైపు ఉంటే.. మిగిలిన పార్టీలన్నీ ఒకవైపున నిలబడ్డాయి. దీంతో సీఎం జగన్ మోహన్ రెడ్డే ఏపీ ప్రతిపక్షాలను ఏకం చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.