స్కిల్ కేసులో చంద్రబాబు విచారణను పర్యవేక్షించిందెవరో తెలుసా? | do you know who monitored babu exquiry| acb| sit| office| remand| advocates| leagal
posted on Sep 11, 2023 11:00AM
స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబును అరెస్టు చేయడానికి సీఐడీ పోలీసులు ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో రాష్ట్రం మొత్తం శుక్రవారం అర్ధరాత్రి నుంచీ గమనిస్తూనే ఉంది.
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును.. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో అరెస్టు చేసిన సీఐడీ పోలీసుల విచారణ తీరును విపక్షాలు, న్యాయనిపుణులు, పరిశీలకులే కాదు..సామాన్యజనం కూడా తప్పుపడుతున్నారు. అసలు మొత్తంగా సీఐడీ చంద్రబాబునాయుడును విచారిస్తున్న ఫొటో, వీడియో సామాజిక మాధ్యమంలో రచ్చరచ్చ చేస్తున్నాయి. చంద్రబాబు విచారణకు కనీసం చంద్రబాబు న్యాయవాదులను సైతం అనుమతించని సీఐడి ఒక మీడియా ఫొటోగ్రాఫర్ కు మాత్రం రెడ్డ కార్పెట్ పరిచి మరీ అనుమతి ఇచ్చింది.
నంద్యాల నుంచి విజయవాడ సిట్ ఆఫీసుకు తీసుకువచ్చిన చంద్రబాబును, సీఐడీ ఉన్నతాధికారులు గంటల తరబడి సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. తన తండ్రిని చూసేందుకు లోకేష్, , తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, మామ బాలకృష్ణతో కలిసి సిట్ కార్యాలయానికి వచ్చారు. కానీ సిట్ అధికారులు మాత్రం చంద్రబాబు నాయుడు ఉన్న పై అంతస్తులోకి వారిని అనుమతించలేదు. గంటల తరబడి వారు కింద ఫ్లోర్‌లోనే వేచిచూడాల్సి వచ్చింది. తరువాత ఎప్పుడో చంద్రబాబును కలిసేందుకు వారికి అనమతించారు. చంద్రబాబు అధైర్యపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. అదలా ఉంచితే చంద్రబాబు విచారణ సమయంలో తాము కూడా ఆయన వెంట ఉంటామంటూ వచ్చిన తెలుగుదేశం లీగల్ సెల్ న్యాయవాదులను పోలీసులు అనుమతించలేదు. ఆయనతో ఏమైనా మాట్లాడాలంటే కోర్టు హాలులోనే మాట్లాడుకోండంటూ నిష్కర్షగా చెప్పారు. కానీ చంద్రబాబును విచారిస్తున్న చోటికి మాత్రం ఓ ప్రెస్ ఫొటోగ్రాఫర్ ను పోలీసులు రాచమర్యాదలతో అనుమతించారు. చంద్రబాబును విచారిస్తున్న సిట్ అధికారుల పక్కనే ఆ ఫొటో గ్రాఫర్ ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమంలో విపరీతంగా వైరల్ అవుతోంది.
సిట్ కార్యాలయం వద్దకు మీడియాను అనుమతించని పోలీసులు ఏకంగా ఒక ఫొటో గ్రాఫర్ ను విచారణ గదిలోనికి ఎలా అనుమతించారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విపక్ష నేతలు సైతం ఫొటోగ్రాఫర్ ను అనుమతించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు విచారణను పర్యవేక్షిస్తున్నది పోలీసులా.. అధికార పార్టీ మీడియా ప్రతినిథులా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. న్యాయవాదులకే అనుమతి నిరాకరించిన పోలీసులు, ఆ ఫొటోగ్రాఫర్‌ను ఎలా, ఎందుకు అనుమతించారు? ఆయన ఏమైనా ప్రత్యేక ఆహ్వానితుడా? అంటు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అధికార పార్టీ ఫొటోగ్రాఫర్‌ను అనుమతించిన పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళతామని తెలుగుదేశం లీగల్ సెల్ నేతలు స్పష్టం చేశారు. జగన్ హయాంలో పోలీసుల విచారణ ఇలా హాస్యాస్పదంగా, ఒక ఫార్సుగా మారిపోయిందని అంటున్నారు. ఇలా ఉండగా ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ ఇచ్చిన తరువాత ఏపీ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఆంక్షలు విధించారు. ఏపీ మొత్తం 144వ సెక్షన్ విధించారు. కానీ అంతకు ముందు నుంచే రాష్ట్రంలో జనం స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత నుంచీ ఆదివారం చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువడేంత వరకూ రాష్ట్రం మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. జనం అంతా టీవీలకు అతుక్కుపోయి ప్రొసీడింగ్స్ ను నిశితంగా గమనిస్తూ ఇళ్లకే పరిమితమైపోయారు.
చంద్రబాబును అరెస్టు చేసిన తీరు, ఆయనను సిట్ ఆఫీసు నుంచి ప్రభుత్వాసుపత్రికి అక్కడ నుంచి మళ్లీ సిట్ ఆఫీసుకూ తిప్పిన తీరును తీవ్రంగా నిరసించారు. కనీసం రిమాండ్ రిపోర్టు తయారు చేయడానికే సీఐడీ పడిన ప్రయాసను గమనించారు. చంద్రబాబుపై కక్ష సాధింపు ధోరణి వినా కేసులో మెరిట్స్ ఏవీ లేవన్న విశ్లేషకుల అభిప్రాయంతో వారు పూర్తిగా ఏకీభవించారు. రాష్ట్రం మొత్తం పోలీసుల కంట్రోల్ లో పెట్టి బంద్ ను నిరసనలను అడ్డుకుని చంద్రబాబును అరెస్టు చేస్తే జనంలో కదలిక లేదన్న బిల్డప్ ఇవ్వడానికి అధికార వైసీపీ, జగన్ సర్కార్ ఎంతగా తాపత్రేయపడినా, రోజా వంటి మంత్రులు సంబరాలు చేసుకున్నా జనం మాత్రం బాబుకు రిమాండ్ విధించిన తరువాత స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. అరెస్టులకు బెదరకుండా రోడ్లపైకి వస్తున్నారు. బాబు అరెస్టుకు నిరసనగా సీఎం జగన్ బసచేసిన లండన్ నివాసం వద్ద ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారంటేనే తెలుగు వారిలో చంద్రబాబు అరెస్టు తీరు పట్ల ఎంతటి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయో అర్ధమౌతోందని అంటున్నారు పరిశీలకులు.