Leading News Portal in Telugu

పోరాట యోధుడు నాన్న..ఆయన అడుగుజాడల్లోనే నేను.. లోకేష్ | chandrababu a warrior| lokesh| open| letter| people| promise| follow| father


posted on Sep 12, 2023 7:12AM

తెలుగు తెర మీద కథానాయకుడిగా… తెనుగు పుడిమిపై మహానాయకుడిగా… మదరాసి పదంతో అడుగున పడిపోతున్న ఆంధ్ర జాతికి వెలుగు జిలుగులద్దిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు.  అలాంటి ఆయన ఇంట కుమార్తెగా జన్మించి.. హెటైక్ సిటీ సృష్టికర్త.. హైదరాబాద్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కన్సెల్టెన్సీ అంటూ హైటెక్ పదానికి అర్థాన్ని.. పరమార్థాన్ని వివరించిన విజనరీ నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆర్థాంగి అయి.. ఆ జంట 43వ వసంతంలోకి అడుగు పెడుతున్న తరుణంలో.. అంటే సెప్టెంబర్ 10వ తేదీకి ఒక రోజు ముందు సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం టీడీపీ జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడుని పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఆయన్ని 14 రోజుల రిమాండ్ విధించడంతో… చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

అయితే ఇదే అధికార పార్టీకి చెందిన నేతలు.. నాడు కన్నతల్లిని ఘోరంగా అవమానిస్తే… నేడు అదే పార్టీకి చెందిన ప్రభుత్వం కన్నతండ్రినీ జైలు పాలు చేసింది. ఆ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. బాధతో బరువెక్కిన హృదయంతో.. చెమ్మగిల్లిన కన్నులతో మీ కోసం ఈ నాలుగు మాటలు అంటూ తీవ్ర భావోద్వేగంలో ఓ లేఖను సోషల్ మీడియాలో సంధించారు. ఆంధ్రప్రదేశ్ కోసం.. కోట్లాది తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం మా నాన్న తన హృదయంతో పాటు ఆత్మను పణంగా పెట్టి పని చేశారని.. ఆ క్రమంలో ఆయన ఒక్క రోజు కూడా విశ్రాంతి అనేది తీసుకోకుండా… అలుపన్నది లేకుండా పని చేయడాన్ని నేను పెరిగానని తెలిపారు.   

అలాగే ఆయన రాజకీయాలు నిజాయతీకి, హుందాతనానికి ప్రతీకగా నిలిచేవని…  ఆయన నుంచి  సేవలు పొందిన వారు.. చూపించిన ప్రేమ, కృతజ్జతతోపాటు లోతైన స్పూర్తి పొందడం.. నేను కళ్లారా చూశానని… వారి మనస్సుతో చెప్పిన కృతజ్జతతో… ఆయన హృదయం ఆనందంతో తొణకిసలాడేదని తెలిపారు. ఇది పసి పిల్లల ఆనందంతో సమానమని నారా లోకేశ్ అభివర్ణించారు. ఇది చూసి నా తండ్రి మార్గాన్నే నేను అనుసరించి.. ఆయన అడుగులో అడుగు వేశానని… అందుకోసం అమెరికాలో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని సైతం వదిలి .. భారత్‌కు తిరుగు వచ్చానని నారా లోకేశ్ స్పష్టం చేశారు.  

కానీ నాకు.. మన దేశం మీద.. మన వ్యవస్థల మీద.. మన దేశానికి సంబంధించిన మూల సూత్రాల మీద.. అలాగే వీటన్నింటింకి మించి… మన రాజ్యాంగం మీద అపారమైన నమ్మకం ఉందని.. అయినప్పటికీ ఈ రోజు నా తండ్రి ఏ నేరం చేయకుండా.. అన్యాయంగా.. రిమాండ్‌కు వెళ్లడం చూస్తుంటే.. నా కోపం కట్టలు తెంచుకొంటుందని… నా రక్తం మరిగిపోతుందన్నారు. 

దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం.. ఇంతలా కష్టపడిన నా తండ్రి ఇంత అన్యాయాన్ని ఎందుకు భరించాలని నారా లోకేశ్ ప్రశ్నించారు. పగ, ప్రతీకారం, విధ్వంసక రాజకీయాలను ఆయన ఏనాడు ప్రోత్సహించలేదని… మన ప్రజల అభివృద్ధి, సంక్షేమం, వారి ఆవకాశాలతోపాటు వారి భవిష్యత్తు కోసం ముందే ఊహించినందుకా.. అయినా రాజకీయ పగకు లోతులు కానీ.. హద్దులు కానీ ఉండవా? అని నారా లోకేశ్ ప్రశ్నించారు. కానీ అదీ ఈ రోజు నమ్మక ద్రోహంలా అనిపిస్తుందన్నారు. 

కానీ మా నాన్న ఓ పోరాటయోధుడు, నేను ఆయన లాగానే.. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి కోసం అచంచలమైన సంకల్పంతో మార్గనిర్దేశం చేస్తూ తిరుగులేని శక్తిగా ఎదుగుతామని.. అయితే ఈ పోరాటంలో నాతో  కలిసి మీరు అడుగు వేయాలని కోరుకుంటున్నానని నారా లోకేశ్ ప్రపంచంలోని తెలుగు వారికి పిలుపు నిచ్చారు.