స్కిల్ స్కాం అంటూ జగన్ సర్కార్ కట్టుకథలూ.. కాకమ్మ కబుర్లూ!? | jagan sarkar cock and bull stories| skill| scam| babu| design| tech| seemans| vikas
posted on Sep 13, 2023 11:10AM
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం, ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడం, ఆ వెంటనే ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించడం తెలిసిందే. ఇంతకీ ఆయనను ఎందుకు అరెస్టు చేశారు. ఏ కేసులో అరెస్టు చేశారు? ఈ అరెస్టు వెనక లక్ష్యం ఏంటి? ఆసలు ఈ కేసు ఏంటి? సెక్షన్లు ఏంటి? కుంభకోణం ఏంటి? అందులో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు పాత్ర ఏంటన్నది అలా ఉంచితే.. అసలు ఆయనను అరెస్టు చేసిన తీరే జగన్ కక్షసాధింపు ధోరణికి, చర్యలకు పరాకాష్టగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చంద్రబాబు అరెస్టుపై వైసీపీ తప్ప దేశ వ్యాప్తంగా మిగిలిన అన్ని పార్టీలు, ఆయా పార్టీల నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఖండిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి, కమ్యూనిస్ట్ నేతలు కూడా చంద్రబాబు అరెస్టును తప్పుపట్టారు. అలాగే జాతీయ స్థాయిలో బీజేపీ సహా అన్ని పార్టీలూ జగన్ రెడ్డి కక్షపూరిత చర్యే చంద్రబాబు అరెస్టు అంటూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. అసలు జడ్+ కేటగిరీ భద్రత, 14 ఏళ్లపాటు సీఎంగా పనిచేసిన ఉన్నత ప్రొఫైల్ ఉన్న నాయకుడు చంద్రబాబును వారాంతంలో కోర్టుకు సెలవు చూసుకొని అరెస్టు చేయడం, అదీ రాజకీయ పర్యటనలో ఉండగా అర్ధరాతి మందీ మార్బలంతో పోలీసులు దండయాత్ర చేయడంతో ఏపీలో అసలు రాజ్యాంగం ఉందా? చట్టం, పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నాయా? లేక ఏపీ సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు అనుగుణంగా ఆయన టార్గెట్ చేసిన వారిని నిర్బంధించే పనిలో మునిగిపోయారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
ఇక స్కిల్ డెవలప్ మెట్ స్కాం కేసు విషయానికి వస్తే.. ఏపీలో యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో భాగంగా యువతకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు సీమెన్స్, డిజైన్‌టెక్ అనే సంస్థలతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 3 వేల 300 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని యువతకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇచ్చేందుకు ఈ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. 3 వేల 300 కోట్ల రూపాయల్లో 10 శాతం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చేలా.. మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ పెట్టుబడి పెట్టేలా ఒప్పందం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం 10 శాతం వాటాగా.. జీఎస్టీతో కలిపి 370 కోట్ల రూపాయలను ఆ రెండు సంస్థలకు చెల్లించింది. ఇందులో 240 కోట్ల రూపాయలను డిజైన్‌టెక్ సంస్థకు బదలాయించగా మిగతా సొమ్మును సీమెన్స్ కంపెనీకి బదలాయించారు. ఈ 370 కోట్లను ప్రభుత్వం చెల్లించినట్లుగా చూపించి వెనకేసుకున్నారనేది సీఐడీ ఆరోపణ.
ఈ కేసులోనే చంద్రబాబును అసలు ఏ మాత్రం పసలేని ఆరోపణలు చేయడం వైసీపీ నేతలకు కొత్తేమీ కాదు. ఆ మాటకొస్తే జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డి హయంలోనే చంద్రబాబుపై పదుల కొద్దీ కేసులు పెట్టారు. కానీ, న్యాయస్థానాల వద్ద ఒక్కటీ నిలబడలేదు. స్టేలు తెచ్చుకొని చంద్రబాబు మేనేజ్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. కానీ నిజానికి ఆ కేసులలో విషయం లేకనే న్యాయస్థానాల వద్ద నిలవలేదు. ఇప్పుడు ఇది కూడా అంతే. కేవలం ఓ నాలుగు రోజుల పాటు వైసీపీ నేతలు జబ్బలు చరుచుకోవటానికి, రోజా వంటి మంత్రులు సంబరాలు చేసుకుని, స్వీట్లు పంచుకోవడానికి మాత్రమే పనికొస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ జగన్ లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తుండగా.. రిటర్న్ చంద్రబాబును కూడా అవినీతి పరుడుగానే బురద జల్లేందుకు, ఆరోపణలు చేసేందుకు మాత్రమే ఈ కేసు పనికి రానుంది. అంతేతప్ప ఇందులో పసలేదన్నది పరిశీలకుల అభిప్రాయం.అదలా ఉంచితే.. ఎవరి వాంగ్మూలంతో అయితే చంద్రబాబును అరెస్టు చేశామని చెబుతున్నారో ఆ మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సీఐడీ చెప్పిన దానిని నిర్ద్వంద్వంగా ఖండించారు. తన వాంగ్మూలాన్ని సీఐడీ తనకు అనుకూలంగా మార్చుకుందన్న అనుమానం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో కుంభకోణం ఏదీ జరగలేదనీ, ఒక వేళ జరిగిందనుకున్నా అందులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏం సంబంధం ఉంటుందని పీవీ రమేష్ అన్నారు. కేసులో విచారణ చేయాల్సినా, అరెస్టు చేయాల్సినా ముందుగా ఆ కార్పొరేష్ ఎంపీ, కార్యదర్శులనేనని అన్నారు. తన వాంగ్మూలం ఆధారంగా 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా మంచి పాలన అందించిన చంద్రబాబును అరెస్టు చేశామని చెప్పడం అమానుషమని కుండబద్దలు కొట్టారు. దీంతో కంగుతిన్న సీఐడీ.. ఇప్పుడు పీవీ రమేష్ ను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోందని కూడా విమర్శలకులు అంటున్నారు. అందుకు తార్కానంగా జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన పీవీ రమేష్ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడిన మరుసటి రోజే ఆయనను మేఘా కంపెనీ నుంచి బయటకు పంపింది.
ఇది కూడా పక్కన పెడితే.. అసలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందేమీ లేదని.. అది కేవలం సర్వీస్ టాక్స్ కు సంబంధించిన అంశం మాత్రమేననీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఒప్పందం చేసుకున్న డిజైన్‌టెక్ సిస్టమ్స్ వ్యవస్థాపక ఛైర్మన్, ఎండీ వికాస్ ఖన్వీల్కర్ విస్పష్టంగా చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకే కాదు, ఎవరికీ కూడా తాము సోమ్ము చెల్లించలేదనీ, షెల్ కంపెనీల ద్వారా సొమ్ము తరలించారనేది పూర్తి అవాస్తవమనీ, అభూత కల్పన అనీ కుండబద్దలు కొట్టారు. అప్పటి ప్రభుత్వంతో ఒప్పందం మేరకు పరికరాలను సరఫరా చేశామని, ఆడిటర్లను పంపితే అన్ని వివరాలనూ రశీదులతో అందిస్తామని చెప్పారు. ఫోరెన్సిక్ ఆడిట్ సంస్థ, సీఐడీ నివేదికలు తప్పుల తడక అని తేల్చి చెప్పారు. ఏమీ లేకుండా కేసు నమోదు చేసి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయడం బాధాకరమన్నారు. ఈ కేసులో విచారణ సంస్థలు తమను సంప్రదించలేదన్నారు. అంతే కాకుండా ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలతో కూడిన వీడియో విడుదల చేశారు. ‘మోడీ ప్రధాని అయ్యాక జర్మనీ పర్యటనలో భాగంగా సీమెన్స్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. భారత్‌లో నైపుణ్యాభివృద్ధికి మంచి అవకాశాలున్నాయని భావించిన ఆయన చొరవతోనే నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయి’ అని పేర్కొన్నారు.
‘సీమెన్స్ సంస్థతో ఒప్పందంలో భాగంగా గుజరాత్‌లో మొదటి ప్రాజెక్టు చేపట్టామనీ, ఆ రాష్ట్రంలో అయిదు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయగా ప్రాజెక్టు విజయవంతం అయ్యిందనీ, దీంతో గుజరాత్ ను చూసి పలు రాష్ట్రాలు సిమ్మెన్స్ ప్రాజెక్టును తమ తమ రాష్ట్రాలలో ఏర్పాటు చేయాలంటూ తమను సంప్రదించాయని వివరించారు. అలాగే గుజరాత్ ప్రభుత్వం అమలు చేస్తున్న నమూనా ప్రాజెక్టును.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కార్యదర్శుల స్థాయి సీనియర్ అధికారుల బృందం అప్పట్లో పరిశీలించి, కళాశాలల్లో ప్రిన్సిపాల్స్, ఫ్యాకల్టీలు, విద్యార్థులు, డైరెక్టర్‌తో మాట్లాడిందనీ వికాస్ ఖన్వీల్కర్ వివరించారు. ఆ తరువాతే ఆంధ్రప్రదేశ్, సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థల మధ్య చర్చలు జరిగాయన్నారు. గ్రాడ్యుయేట్ విద్యార్థులతోపాటు డిప్లొమా, ఐటీఐ విద్యార్థులకు కూడా శిక్షణకు సంబంధించిన ప్రయోజనాలను అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. ఒప్పందం మేరకు కేంద్రాలు, కోర్సుల వారీగా 2.14 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా వారిలో 75వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. కియా మోటర్ ఉద్యోగులకు కూడా వారి అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ అందింది. నాలుగేళ్లపాటు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించామనీ, మా పనితీరును అభినందిస్తూ ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ లేఖ ఇచ్చిందనీ, డిజైన్‌టెక్ సిస్టమ్స్ వ్యవస్థాపక ఛైర్మన్, ఎండీ వికాస్ ఖన్వీల్కర్ సోదాహరణంగా వివరించారు.
తప్పుడు ఆరోపణలతో మార్కెట్లో తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రస్తుత ఏపీ ప్రభుత్వం, సీఐడీ వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. దీంతో స్కిల్ స్కాం అంటూ ఏపీ సర్కార్, ఏపీ సీఐడీ కట్టు కథలతో.. కాకమ్మ కబుర్లతో అక్రమంగా, అప్రజాస్వామికంగా చంద్రబాబును వేధింపులకు గురి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తేటతెల్లమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.