posted on Sep 13, 2023 2:17PM
2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీ ఓటమి, ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దింపడమే ఎజెండా గా ఏర్పడిన ఐ డాట్ ఎన్ డాట్ డి డాట్ ఐ డాట్ ఎ… (ఇండిమా) చుక్కల కూటమి… లెక్కలు తప్పుతున్నాయా? కూటమి కలలకు శ్రీకారం చుట్టిన జనతాదళ్ (యు) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అడుగులు తడబడుతున్నాయా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. నిజమే. అడుగులు తడబడుతున్నది ఒక్క నితీష్ నడక, నడతలోనే కాదు. కూటమి పెద్ద దిక్కు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అడుగులు కూడా తడబడుతున్నాయి. ఇప్పటికే పవార్ సమీప బంధువు (మేనల్లుడు) అజిత్ పవార్ మెజారిటీ ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని, బీజేపీ, శివ సేన (షిండే) కూటమితో చేతులు కలిపారు. ఆ కూటమి ప్రభుత్వంలో కొలువు తీరారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయినా శరద్ పవార్ ‘బంధుత్వం’ ముసుగులో అజిత్ పవార్ తో రాజకీయ బంధుత్వం కొనసాగిస్తున్నారనే అనుమానాలు ఇండియా కూటమిలో వ్యక్తమవుతున్నాయి. పవార్ ముందు చూపుతోనే రెండు పడవల ప్రయాణం చేస్తున్నారని రేపు ఎన్నికల ముందో తర్వాతో పరిస్థితులను బట్టి ఆయన అటు మొగ్గినా, ఇటు మొగ్గినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.
మరోవంక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ ) మరో అడుగు ముందుకేసింది. ఓ వంక ఇండియా కూటమి బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్ధులను నిలబెట్టే ఆలోచనతో సీట్ల సర్దుబాటు గురించి చర్చలు జరుపుతుంటే, బుధవారం (సెప్టెంబర్ 13) ఢిల్లీలో శరద్ పవార్ నివాసంలో ఇండియా కూటమి కోఅర్దినేషన్, ఎలక్షన్ స్ట్రాటజీ సమావేశం జరుగుతోంది) మరోవంక, ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే,మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రాలలో పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితాను ఆప్ ప్రకటించేసింది. అంతేకాకుండా. తృణమూల్, జేడీయు, ఎస్పీ, ఆప్, ఆర్జేడీ సహా కూటమి భాగస్వామ్య పార్టీలు, కూటమి మనుగడకు సీట్ల పంపకమే కీలకమని భావిస్తున్నాయి. అలాగే అదేదో తేలిన తర్వాతనే ఉమ్మడి ప్రచార వ్యూహం గురించి మాట్లాడదామని అంటున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ మాత్రం సీట్ల సర్దుబాటు కంటే కూటమి నాయకత్వం పై నిర్ణయం అవసరమని భావిస్తోంది.
ఆదలా ఉంటే ఇప్పడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పవార్ అడుగుజాడల్లో అయితే అడుగులు వేస్తున్నారన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. నిజానికి గత సంవత్సరం ఆగష్టులో బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ఆర్జేడీతో జట్టు కట్టినా, ఆయన మళ్ళీ ఎప్పుడైనా బీజేపీ గూటికి చేరతారనే అనుమానాలు అప్పటి నుంచీ వినవస్తూనే ఉన్నాయి. అయితే నితీష్ గత జనవరి, ఫిబ్రవరి నెలలలో విపక్షాల ఐక్యత వేదిక ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆయన సారధ్యంలో, ఆయనే అనుసంధానకర్తగా బీజేపీ వ్యతిరేక విపక్ష పార్టీల తొలి సమావేశం పాట్నాలో జరిగింది. ఆ తర్వాత బెంగుళూరులో జరిగిన రెండవ సమావేశంలో ఇండియాగా నామకరణం జరిగింది. ముంబైలో మూడవ సమావేశం కూడా జరిగింది కానీ కూటమిని తమ గుప్పిట్లోకి తీసుకోవాలనే నితీష్ కల మాత్రం ముందుకు సాగ లేదు. బ్రేక్ పడింది. కూటమిని, కాంగ్రెస్ పార్టీ తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసిన చేసిన నేపధ్యంలో నితీష్ కుమార్ ఇండియా కూటమితో కొంత అంటీముట్టనట్లే ఉంటున్నారు.
అదలా ఉంటే ఇప్పడు తాజాగా నితీష్ కుమార్ అనూహ్యంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత శనివారంనాడు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన జి-20 విందు సమావేశానికి హాజరయ్యారు. దీంతో ఆయన అడుగులు జోడు పడవల ప్రయాణం వైపుగా పడుతున్నాయా అనే అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతోనూ మాట కలిపారు. బీహార్‌లో బీజేపీతో గత ఏడాది ఆగస్టులో నితీష్ తెగతెంపులు చేసుకున్న తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన కలవడం ఇదే మొదటిసారి. నితీష్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రధానమంత్రి పరిచయం చేశారు. బీజేపీని ఓడించేందుకు సర్వశక్తులూ ఒడ్డాలని నిర్ణయించుకున్న ‘ఇండియా కూటమి’ నేతలకు సహజంగానే ఇది మింగుడుపడని వ్యవహరమే. నీతీష్ మంచి రాజనీతిజ్ఞుడని, సమయానికి తగు నిర్ణయాలు తీసుకోవడంలో కాకలు తీరిన నేత అని అందరికీ తెలిసిన విషయమే. జి-20 డిన్నర్‌కు హాజరుకావడం ద్వారా సొంత నిర్ణయాలు తీసుకోగలిగిన సామర్థ్యం తనకు ఉందని నితీష్ కూటమి భాగస్వామ్య పక్షాలకు చెప్పకనే చెప్పినట్టు అయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జి-20 మెగా షోతో దేశానికి ఒరిగేదేమీ లేదని బీహార్‌లో నితీష్ భాగస్వామ పార్టీ ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ గత సోమవారంనాడు పెదవి విరిచారు.
బీహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో మహాకూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విపక్ష ఐక్య కూటమి యత్నాలకు నితీష్ సారథ్యం వహిస్తూ వచ్చారు. ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తేవడమే తన లక్ష్యమని నితీష్ చెబుతూ వచ్చారు. అయితే విపక్ష కూటమికి సారథ్యం వహించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరును లాలూ ప్రసాద్ ఇటీవల ప్రతిపాదించడం జేడీయూకు మింగుడు పడటం లేదు. జేడీయూ అగ్రనేతలు కొందరు విపక్ష కూటమి పీఎం అభ్యర్థిగా నితీష్ పేరును ప్రతిపాదించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, ఈ ముచ్చట ఏదీ ముంబై సమావేశంలో చోటుచేసుకోలేదు. కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయడం, సీట్ షేరింగ్ అంశాన్ని సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తీసుకురావాలని మాత్రమే సమావేశంలో నిర్ణయించారు. దీంతో ఒక్క నితీష్ మాత్రమే కాదు, అటు మమత, ఇటు కేజ్రీవాల్ .. అలాగే, ఇడియా కూటమిలోని ఇతర పార్టీల నేతలు కూడా, ఇండియా కూటమి సారధ్య బాధ్యతలను హస్తం పార్టీకి అప్పగించేందుకు సిద్ధంగా లేరని, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సారధ్యంలో పనిచేసేందుకు సిద్ధంగా లేరని, అంటున్నారు.