కళ్ళ ముందున్న సాక్ష్యాలు కనిపించవా? | cant see evidences before eyes| skill| scam| babu| arrest| vindictive| politics| jagan| ap| cid
posted on Sep 14, 2023 1:00PM
అబద్ధం చెప్పినా అతికి నట్లుండాలి, అలాగే అబద్ధాలు చెప్పే వారికి జ్ణాపకశక్తీ ఎక్కువ ఉండాలి కానీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు దడి కట్టినట్లు కూడా లేవు.. సర్కార్ జ్ణాపక శక్తి కూడా అంతంత మాత్రమే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారంలో లేని అవినీతిని చూపించేందుకు అబద్ధాల కట్టుకధలు అల్లుతోంది. పచ్చి అబద్ధాలను పక్కా నిజాలుగా చూపించే ప్రయత్నం చేస్తోంది.
నిజానికి, నిజంగా అవినీతి జరిగినా జగన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోక పోవును, కానీ, ఇక్కడ అవినీతి జరిగిందా లేదా అన్నది అసలు ప్రశ్నే కాదు. తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏదో విధంగా అరెస్ట్ చేసి, జైలుకు పంపాలి, అందుకోసమే జగన్ రెడ్డి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాం ను తెరపైకి తెచ్చింది. ఆ ఒక్క పాపపు ఆలోచనతో, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆయన బృందం కట్టు కథలు అల్లుతోంది.కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలను కప్పి పెట్టి కట్టుకధలతో అబద్ధాలను నిజం చేసే విఫల ప్రయత్నం చేస్తున్నది. నిజానికి, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు అదే పనిలో ఉన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెలుగు దేశం పార్టీ నాయకులు, క్యాడర్ ను వేధింపులకు గురి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎందరో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారు. చివరకు తెలుగు దేశం ఓటర్లపై కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి.
ప్రజా వేదిక కూల్చి వేతతో పరిపాలనకు శ్రీకారం చుట్టిన జగన్ రెడ్డి అప్పటి నుంచే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు ప్రారంభించారు. ఇందులో ఏమీ రహస్యం లేదు. ఇది జగన్ ఎరిగిన సత్యం. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడిని, ఆయన కుటుంబ సభ్యులను, సన్నిహితులను ఏదో విధంగా కేసుల్లో ఇరికించే ప్రయత్నం సాగిస్తూనే ఉన్నారు. అప్పటి నుంచే జగన్ రెడ్డి చంద్రుడిపై మచ్చలు వెతికే ప్రయత్నం సాగితున్నారు.
అయితే గడచిన నాలుగున్నరేళ్ళుగా ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేసేందుకు చేసిన కుట్ర పూరిత ప్రయత్నాలు బూమరాంగ్ అయ్యాయి. న్యాయ స్థానాల ముందు జగన్ రెడ్డి ‘స్కిల్స్’ పని చేయలేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిపై అవినీతి బురద చల్లి బద్నాం చేసేందుకు విఫల ప్రయత్నం చేసిన అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ రెడ్డి తండ్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎదురైన అనుభవమే, జగన్ రెడ్డికీ ఎదురైంది.
అందుకే అధికారం ఆఖరి క్షణాలకు చేరుకున్న సమయంలో జగన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జరిగిన మంచిని మరుగు పరిచి కుట్రపూరితంగా అవినీతి బురద చల్లేందుకు, తద్వారా చంద్రబాబు నాయుడు పై కక్ష తీర్చుకునే అకృత్యానికి తెగబడింది. కళ్ల ముందు అభివృద్ధి ఫలాలు కనిపిస్తున్నా.. వాటిని పరిశీలించకుండా చంద్రబాబును ఇరికించడమే లక్ష్యంగా కుట్రకు తెరలేపింది. ఇక్కడే జగన్ రెడ్డి ప్రభుత్వ జ్ణాపక శక్తి ఎంత ఘనంగా ఉందో ప్రపంచానికి తేటతెల్లమైంది కూడా. స్కిల్ డెవలప్ మెంట్ లో ఏపీ నంబర్ వన్ అంటూ ఆ చంద్రబాబు దూరదృష్టి కారణంగా దక్కిన ఫలాలను మీడియాలో జగన్ రెడ్డి ప్రభుత్వమే ప్రకటనలు విడుదల చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు అద్భుత ఫలితాలను ఇచ్చిందని ప్రపంచానికి చాటింది. ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోయిన జనగ్ రెడ్డి సర్కార్ ఇప్పుడు తాను నాడు ఘనంగా ప్రకటనల రూపంలో ప్రచారం చేసిన స్కిల్ ఘనతను చెరిపివేయడానికి శతథా ప్రయత్నించి నవ్వుల పాలు అవుతోంది.
ఇక విషయానికి వస్తే.. విద్యార్థులు, నిరుద్యోగుల భవితకు బాటలు వేసే స్కిల్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టు పెద్ద స్కామ్ అని, దానికి సూత్రధారి చంద్రబాబే అని జగన్ సర్కారు విషం చిమ్ముతోంది. ప్రభుత్వ నిధులు రూ.370 కోట్లు దుర్వినియోగమయ్యాయని, అవన్నీ షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకే చేరాయని గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్ చేసిన ఆరోపణలనే ఇప్పుడు సీఐడీ కూడా అచేస్తోంది. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది. అయితే అదే నిజమైతే, ఇంజనీరింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు, నైపుణ్యాభివృద్ధి ఇన్‌స్టిట్యూట్లు ఎలా ఏర్పాటు చేశారు? 372 అత్యాధునిక సాంకేతిక ల్యాబ్‌లు స్థాపించడం, 3,37,869 మందికి శిక్షణ ఇవ్వడం, 2,394 జాబ్‌మేళాలతో 85,711 మందికి ఉద్యోగాలు కల్పించడం వాస్తవం కాదా? స్కిల్ డెవల్‌పమెంట్ వెబ్‌సైట్ చూస్తే ఈ విషయాలు తెలుస్తాయి కదా. ప్రాజెక్టులో కీలకమైన మౌలిక వనరులు, ల్యాబ్‌లు, నెట్‌వర్క్ కేంద్రాలను పరిశీలించకుండానే ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్ చేయించింది. వాస్తవాలను దాచిపెడుతోంది.
అయితే ఇవేవీ దాచేస్తే దాగే సత్యాలు కాదు. ఎందుకంటే, ఈరోజుకు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలలో శిక్షణ కొనసాగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 3.37 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. 85,711 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరిలో 35వేలమంది విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఉద్యోగాలు సాధించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2016-17 నుంచి 2019 వరకు 64,444 మందికి ఉద్యోగాలు వచ్చాయి. జగన్ సర్కారు వచ్చాక మూడున్నరేళ్లలో 21,267 మందికి ఉద్యోగాలు వచ్చాయి. వీరిలోనూ గత ప్రభుత్వ కాలంలో (2019-20)లో శిక్షణ పొందినవారు 15,372 మంది ఉన్నారు. అంటే సీమెన్స్ ప్రాజెక్టు కార్యకలాపాలు, శిక్షణ ఫలితం కళ్లముందు కనిపిస్తోంది. ఏపీ స్కిల్ డెవల్‌పమెంట్ శాఖ అధికారిక వెట్‌సైట్‌లో ఈ వివరాలను నిర్ధారించుకోవచ్చు. సంవత్సరాల వారీగా అందులో సవివరమైన గణాంకాలు ఉన్నాయి.అయితే ఇవేవీ, జగన్ రెడ్డి ప్రభుత్వానికి తెలియవా? అంటే తెలుసు. ఇది నిలిచే కేసు కాదని జగన్ రెడ్డి ప్రభుత్వానికి తెలుసు. అయినా అబద్ధాలు, అసత్య ప్రచారంతో అందరినే నమ్మించ వచ్చనే, మొండి వైఖరీ, మూర్ఖపు ఆలోచన, అహంకారంతో ప్రభుత్వం చంద్రబాబు అరెస్ట్ చేసింది . జైలుకు పంపింది . కానీ, అందరినీ అన్ని వేళలా మోసం చేయడం, మోసాలలో పుట్టి మోసాలలో పెరిగిన వారికైనా సాధ్యమయ్యే పని కాదు.అందుకు మూల్యం చెల్లించక తప్పుదు.