నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో.. జూనియర్ ఉలిపికట్టె తీరు! | junior ntr route separate| keep| distance| ntr| family| silence| babu
posted on Sep 14, 2023 3:41PM
నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో” అన్నట్టుగా ఉంది నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ తీరు. “నందమూరి కుటుంబసభ్యులందరిదీ ఒక దారి.. నాది మాత్రం మరో దారి” అన్నట్టుగా ఆయన అడుగులు పడుతున్నాయి.
ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ అక్రమం అంటూ కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ఎందరో తమ స్వరం వినిపిస్తున్నారు. కానీ కుటుంబసభ్యుడైన జూనియర్ మాత్రం.. తన మావయ్య చంద్రబాబు అరెస్ట్ పై స్పందిస్తూ కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. నేరుగా కలవాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో స్పందించలేదేమో.. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉండి ఉంటాడు, త్వరలోనే వెళ్ళి బాబుని కలుస్తాడు అని కొందరు నందమూరి అభిమానులు సర్ది చెప్పుకున్నారు. కానీ బాబు అరెస్ట్ అసలు తనకు పట్టనట్టుగా జూనియర్ విదేశాలకు చెక్కేయడం అటు నందమూరి, ఇటు టీడీపీ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.
సైమా అవార్డుల వేడుక సెప్టెంబర్ 15,16 తేదీల్లో దుబాయ్ లో జరగనుంది. ఈ వేడుక కోసం తన కుటుంబంతో కలిసి దుబాయ్ పయనమయ్యాడు తారక్. ఇప్పటిదాకా ఆయన దేవర సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు అనుకున్నారంతా. కానీ ఆయన మాత్రం ఎంచక్కా దుబాయ్ వెళ్తున్నాడు. విదేశాలకు వెళ్ళే టైం ఉంది కానీ.. బాబుని, బాబు కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పే టైం లేదా?. ఆఖరికి ఇతర భాషకు చెందిన రజినీకాంత్ వంటి వారు బాబు కుటుంబానికి ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారు. కానీ తారక్ మాత్రం కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. ఎంతసేపూ తన సినిమాలు, తన అవార్డులు, తన పేరు తప్ప.. కుటుంబం సభ్యులకి ఏం జరిగినా పట్టించుకోడా అంటూ నందమూరి అభిమానులు కాస్త ఘాటగానే సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
మాట్లాడితే తాత పేరు చెప్పుకునే తారక్.. మేలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకి వెళ్లకుండా ఫ్రెండ్స్ తో కలిసి తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇటీవల తన తాత పేరు మీద కేంద్రం వెండి నాణేలు విడుదల చేస్తే, ఆ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి కూడా డుమ్మా కొట్టాడు. ముందే షూటింగ్ కి డేట్స్ ఇచ్చి ఉన్నాడేమో, తన వల్ల నిర్మాతలకు నష్టం వాటిల్లకూడదన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమానికి వెళ్ళలేదేమో అని అప్పుడూ అభిమానులు సర్దిచెప్పుకున్నారు. కానీ ఇప్పుడు బాబు అరెస్ట్ అయితే అసలు ఏమాత్రం పట్టనట్టు అవార్డుల ఫంక్షన్ కోసం విదేశాలకు వెళ్లిన తీరుపై మాత్రం కాస్త గట్టిగానే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.