Leading News Portal in Telugu

యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు జగన్ మరణశాసనం! | jagan death warrant to employment| job| callander| dsc| industries| investores


posted on Sep 15, 2023 7:02AM

ఏపీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ పట్టా చేతికి రాగానే పొరుగు రాష్ట్రాలకు పరుగులు పెడుతున్న ఏపీ యువత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికలకు ముందు ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఏడాది జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే ముందుగా మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కానీ, నాలుగేళ్లలో వాలంటీర్ ఉద్యోగాలు, గ్రామ సచివాలయంలో పోస్టులు ఇచ్చారు. అది కూడా వైసీపీ కార్యకర్తలకేనని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్లు అయినా ఆ ఊసేలేదు. ఈ నాలుగేళ్ళలో ఒక్క ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. ఓ సారి జాబ్ క్యాలెండ్ ప్రకటించినా అందులో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు 50కి మించలేదు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో మూడు సార్లు డీఎస్సీ ప్రకటిస్తే ఇప్పుడు జగన్ నాలుగేళ్ళలో ఒక్కటేసారి డీఎస్సీ ప్రకటించారు. అందులో కూడా యాభై లోపే  ఉద్యోగాలను భర్తీ చేశారు. 

ప్రభుత్వ ఉద్యోగాల సంగతలా ఉంటే పోనీ ప్రైవేట్ ఉద్యోగాలైనా ఉన్నాయా అంటే కొత్తగా రాష్ట్రానికి వచ్చిన ఒక్క  కంపెనీ లేదు. వేల కోట్ల పెట్టుబడులు.. వందల కంపెనీలు వచ్చాయని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి తప్ప రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదు. నిరంతరం కొత్త కంపెనీలను ఆహ్వానించాల్సిన మంత్రులు ప్రతిపక్షాలను వేధించేందుకు, ప్రతిపక్ష నేతలను తిట్టిపోసే పనిలో ఉంటున్నారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి అయితే.. ఉద్యోగాల గురించి అడిగితే కోడి గుడ్డు పొదగాలంటే సమయం పడుతుందని గుడ్డు సిద్దాంతాలు చెప్తున్నారు. కనీసం రాష్ట్రంలో ఉన్న కంపెనీలను తరలిపోకుండా కాపాడుతున్నారా అంటే వాళ్ళని  వాటాలు, కమిషన్ల కోసం  వేధించి అధికార పార్టీ నేతలే తరమేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కియా పరిశ్రమ ప్రతినిధులను బెదిరించడం.. దశాబ్దాలుగా చిత్తూరు జిల్లాకు తలమానికంగా అవతరించిన అమర్ రాజా బ్యాటరీస్ సంస్థను కాలుష్యం పేరిట వేధించడం, ఆ కంపెనీ ఏపీని వదిలేసి తెలంగాణకు తరలిపోవడం రాష్ట్ర ప్రజలంతా చూసినదే.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేక ప్రైవేట్ రంగంలో ఉపాధి దొరకక ఏపీ యువత హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు వలస వెళ్లిపోతున్నారు. కొత్త సంస్థలు, పరిశ్రమలు రాష్ట్రానికి రావాలంటే భయపడే విధంగా ఏపీ పాలకులు పనిగట్టుకొని మరీ చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కూడా. సీమెన్స్, డిజైన్టెక్ సంస్థలతో ఒప్పందం ద్వారా టీడీపీ ప్రభుత్వ హయాంలో 2 లక్షల 13 వేల మంది యువతీ యువకులకు శిక్షణ ఇచ్చారు. వీరిలో 75 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 6 చోట్ల ఎక్స్లెన్స్ కేంద్రాలు, 36 శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇచ్చారు. అప్పుడు ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడు తమకి అప్పుడు పెట్టిన ఖర్చును వడ్డీతో సహా వెనక్కి ఇచ్చేస్తామని ముందుకు వస్తున్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ తమ భవిష్యత్ కుఎంత ఉపయోగపడిందో చెప్తూనే చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు. 

యువతకి బంగారు బాటలు వేసిన స్కిల్ డెవలప్మెంట్ సంస్థను తప్పుడు సంస్థగా ముద్ర వేసిన ఈ ప్రభుత్వ నిర్ణయం విద్యార్థుల పాలిట శాపంగా పరిగణించాల్సిందే. ఇప్పటికే ప్రపంచ పారిశ్రామిక రంగం దృష్టిలో ఏపీ అంటే బ్యాడ్ నేమ్ ఉంది. ఇప్పుడు ఈ స్కిల్ స్కాం పేరుతో పూర్తిగా బ్లాక్ లిస్టులో పెట్టేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఉద్యోగాలంటే కేవలం వాలంటీర్లు, సచివాలయాలనే చూపించే ఈ ప్రభుత్వానికి స్కిల్ డెవలప్మెంట్ లాంటి సంస్థలలో అవినీతి కనిపించడం పెద్ద విడ్డూరం కాకపోయినా దీని పర్యవసానం మాత్రం రాష్ట్రంలో యువత అనుభవించాల్సిందే. మొత్తంగా స్కిల్ స్కాం పేరుతో సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఏపీ యువతను నట్టేట ముంచేశారని, వారి భవిష్యత్ కు మరణశాసనం లిఖించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.