చంద్రబాబు అరెస్టు.. అన్ని వైపుల నుంచీ నిరసనలతో జగన్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి | jagan sarkar suffocation with protests from all over| babu| arrest| national| wide| agitation| bja| nsg
posted on Sep 15, 2023 11:04AM
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్ రాష్ట్రంలోనే కాదు , జాతీయ స్థాయిలో కూడా ప్రకంపనలు సృష్లిస్తోంది. ఏపీలో జగన్ అరాచక పాలనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకూ జగన్ ను అన్ని విధాలుగా సమర్థిస్తూ, ఆర్థిక అరాచకత్వాన్ని ప్రోత్సహిస్తూ వచ్చిన కేంద్రం కూడా జగన్ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జగన్ విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే హస్తిన పర్యటన పెట్టుకున్నారు. ముందస్తు కోసమో, మరిన్ని అప్పుల కోసమో.. అదీ కాకపోతే వచ్చే ఎన్నికల వరకూ చంద్రబాబును జైలులోనే మగ్గేలా రూపొందించిన తన వ్యూహాలకు మద్దతు కోసమే జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీలతో భేటీకి అప్పాయింట్ మెంట్ కోరారు. అయితే కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రం భగ్గుమంటున్నా.. ఆయన మాత్రం నీరో చక్రవర్తిలా తాడేపల్లి ప్యాలెస్ లో ఏ క్షణంలో హస్తిన నుంచి పిలుపు వస్తుందా అన్న ఎదురు చూస్తున్నారు. రోమ్ నగరం తగలడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చున్నారట. అలాగే ఏపీ భగ్గు మంటుంటే.. తన అరాచక, అక్రమ, అడ్డగోలు పాలన పట్ల జనాగ్రహం పెల్లుబుకుతుంటే జగన్ మాత్రం మౌనంగా.. హస్తిన పెద్దన కరుణకటాక్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే చంద్రబాబు అక్రమ అరెస్టును రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నిబంధనలను తుంగలోకి తొక్కి.. ఏ మాత్రం నిలబడని కేసులు పెట్టి.. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేసిన తీరు పట్ల సర్వత్రా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ, తెలంగాణలలోనే కాకుండా తమిళనాడు, బెంగళూరు సహా ఎక్కడికక్కడ జనం, ఐటీ ఉద్యోగులు, మహిళలూ స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఐయామ్ విత్ బాబు అంటూ ప్లకార్డులు చేతబట్టి సంఘీభావం తెలుపుతున్నారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు, న్యాయ కోవిదులు కూడా బాబును అరెస్టు చేసిన తీరును తప్పుపడుతున్నారు. జగన్ సర్కార్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని విమర్శిస్తున్నారు. ఓ సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయితే.. అమరావతి కేసులో జగన్ సర్కార్ హైకోర్టు తీర్పును ధిక్కరించి వ్యవహరిస్తున్న తీరుపై మండి పడుతూ.. తానైతే ముఖ్యమంత్రి జగన్ ను జైలుకు పంపేవాడినని పేర్కొన్నారు.
ఇక ఇలా నలుమూలల నుంచీ జగన్ సర్కార్ చంద్రబాబు అరెస్టు విషయంలో వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతుండటంతో కేంద్రం కూడా జగన్ విషయంలో ఇక కఠినంగా వ్యవహరించక తప్పదన్న నిర్ణయానికి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుపై ఎన్ఎస్జీ కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చింది. చంద్రబాబును అరెస్టు చేసిన తీరు, జైలులో ఆయన భద్రత తదితర అంశాలపై ఎన్ఎస్జీ ఆ నివేదికలో పేర్కొందని చెబుతున్నారు. అంతే కాకుండా చంద్రబాబును అరెస్టు చేసి విజయవాడకు రోడ్డు మార్గంతో తరలించిన తీరుపై కూడా ఎన్ఎస్జీ ఆ నివేదికలో సవివరంగా పొందుపరిచిందంటున్నారు. అలాగే ఏ మాత్రం పటిష్ట భద్రత లేని ఏసీబీ కోర్టు హాలులో చంద్రబాబు గంటల తరబడి ఉన్న విషయాన్నీ ఎన్ఎస్జీ ఆ నివేదికలో పేర్కొందంటున్నారు. అలాగే చంద్రబాబు పర్యటనలలో రాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరు గురించి కూడా సోదాహరణంగా ఆ నివేదిక పేర్కొందంటున్నారు. ఎన్ఎస్జీ నివేదికకు తోడు కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా ఏపీలో జగన్ పాలన అత్యంత దారుణంగా ఉందంటూ కేంద్ర హోంశాఖకు నివేదికలు అందాయని చెబుతున్నారు.
వీటికి తోడు జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న సమయం చూసుకుని చంద్రబాబును అరెస్టు చేయడం ద్వారా దేశ ప్రతిష్ట మసకబారేవిధంగా జగన్ వ్యవహరించారని కూడా కేంద్రం భావిస్తున్నది. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ వంటి ప్రముఖుల ప్రశంసలు పొందిన చంద్రబాబు పట్ల ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలకు గౌరవం ఉంది. అటువంటి చంద్రబాబును అక్రమంగా అర్ధరాత్రి అరెస్టు చేయడంతో కేంద్రం ప్రతిష్ట మసకబారిందన్న అభిప్రాయం కూడా బీజేపీ అధినాయకత్వంలో వ్యక్తం అవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చంద్రబాబును నిన్న రాజమహేంద్రవరం జైలులో కలిసిన తరువాత జనసేనాని పవన్ కల్యాణ్ తెలుగుదేశం, జనసేన కలిసే వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తామని ప్రకటించడం కూడా కేంద్రం తన వైఖరిని పునస్సమీక్షించుకోవలసిన అవసరాన్ని ఎత్తి చూపిందని అంటున్నారు.
ఇక తెలుగుదేశం అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటములలో భాగస్వామ్య పార్టీ కాకపోయినప్పటికీ రెండు కూటములలోని భాగస్వామ్య పార్టీలూ బేషరతుగా చంద్రబాబుకు మద్దతు పలకడం, జగన్ సర్కార్ అక్రమ అరెస్టును ఖండించడంతో తమ చర్యను సమర్ధించుకోలేక వైసీపీ ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. అదే సమయంలో ప్రధాని, హోంమంత్రి నుంచి అప్పాయింట్ మెంట్ కూడా లభించకపోవడంతో కేంద్రం జగన్ కు దూరం జరుగుతోందన్న సంకేతాలను ఇచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో పొత్తు ఉంటుందని ప్రకటించగానే, అలా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాజమహేంద్రవరం నుంచి హుటాహుటిన ప్రత్యేక విమానంలో హస్తిన బయలుదేరి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆయన బీజేపీ పెద్దలనే కాకుండా, జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల అధినేతలనూ కలిసి చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. అలాగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో చంద్రబాబు అరెస్టు తీరుపై అన్ని పార్టీల నేతలూ గళమెత్తేలా వారి సంఘీభావాన్ని కూడగట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.