కవిత అరెస్ట్ ఖాయమేనా? ఈడీ పిలుపు అందుకేనా? | ed summons kavitha| delhi| liquor| scam| south| group| members| approvers| arrest
posted on Sep 15, 2023 1:18PM
కారణాలు ఏమైనా గత కొంత కాలంగా తెలంగాణ రాజకీయాల్లో కొంత స్తబ్దత చోటు చేసుకుంది. సందడి తగ్గింది. ముఖ్యంగా, బీఆర్ఎస్, బీజేపీ జుగల్ బందీ కొంత విశ్రాంతి తీసుకుంది. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చాలా కాలంగా కమలం జోలికి వెళ్ళడం లేదు. మోదీని మాటనడం లేదు. కొద్ది కాలం క్రితం వరకు కేంద్ర ప్రభుత్వం, కమలం పార్టీ పై కత్తులు దూసిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో కమలం కంటే కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు.
అయితే ఇప్పడు మళ్ళీ మరోమారు తెలంగాణ రాజకీయాలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య తగవుకు తెరలేచింది. ఏడాదికి పైగా సా గుతున్న ఢిల్లీ లిక్క స్కామ్ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ కేసును విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవితకు మరో మారు విచారణకు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. అదికూడా ఎప్పుడో కాదు, నోటీసు ఇచ్చిన 24 గంటలు తిరక్క ముందే అంటే శుక్రవారం(సెప్టెంబర్ 15) విచారణకు రావాలని గురువారం (సెప్టెంబర్ 14) ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో మళ్ళీ మరో మారు, బీఆర్ఎస్, బీజేపీ జుగల్బందీకి తెరలేచింది. అది కూడా ఇటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తున్న సమయంలో చోటు చేసుకున్న ఈ పరిణామం సహజంగానే రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.
ముఖ్యంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత దూకుడు పెంచిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని, ఆరెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని ప్రచారం చేస్తూ వచ్చింది. ఆ ప్రచారానికి కవిత కేసు కేంద్ర బిందువుగా నిలిచింది. గత సంవత్సరం మార్చిలో ఈడీ కవితను విచారించిన సమయంలో బీజేపీ రాష్ట నాయకులు ఇంకేముంది కవితను జైలుకు పంపించబోతున్నామని గంభీర ప్రకటనలు చేశారు. అయితే, తర్వాత ఆర్నెల్లుగా ఢిల్లీ మద్యం కేసులో ఎలాంటి కదలికలు లేకపోవడంతో కేసీఆర్‌తో బీజేపీకి రాజీ కుదిరిందని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం సాగించింది. దానికి తోడు, బండి సంజయ్ ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడంతో ఇటు పార్టీలో అటు ప్రజల్లో కూడా బీఆర్ఎస్, బీజేపీ, రహస్య బంధం విషయంలో అనుమానాలు బలపడ్డాయి. దీంతో అంతవరకు బీఆర్‌ఎస్ ను ఢీకొనే విషయంలో కాంగ్రెస్ తో పోటాపోటీగా ఉన్న బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. కార్యకర్తల్లో నీరసం ఆవహించింది. కవితను అరెస్టు చేస్తే కానీ తెలంగాణలో మళ్లీ పుంజుకోలేమనే అభిప్రాయాన్ని ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర నేతలు అధిష్ఠానానికి చెప్పారు. ఢిల్లీ నుంచి నియోజకవర్గాల పర్యటనకు వచ్చిన జాతీయ నాయకులకూ కార్యకర్తల నుంచి అంతే ఫీడ్‌బ్యాక్ బలంగా వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరోసారి లిక్కర్ కేసులో కవిత ను ఈడీ మరోసారి విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అదలా ఉంటే గడచినా ఐదారు నెలలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో కవిత స్పెసిఫిక్ గా కనిపించక పోయినా, విచారణ సంస్థలు-, సిబిఐ, ఈడీ కేసును క్లోజ్ చేయ లేదు. ఈ నేపధ్యంలోనే ఈ కేసులో కీలకంగా మారిన సౌత్ గ్రూప్ లో సభ్యులుగా ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ్, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారారు. అలాగే కవిత బినామీగా చెబుతున్న అరుణ్ రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్‌గా మారారని అంటున్నారు. ఈ నలుగురు ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా కవితను ఈడీ అధికారులు మరో మారు కవితను విచారించే అవకాశముందని అంటున్నారు. అలాగే, ఢిల్లీలో మద్యం వ్యాపారం చేసిన ఇండో స్పిరిట్స్ సంస్థలో కవిత తరఫున అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై ప్రాతినిధ్యం వహించారు. ఆ సంస్థలో అరుణ్ పిళ్లైకి ఉన్న వాటాలు కవితవేనని ఈడీ చెబుతోంది. మద్యం విధానం రూపకల్పన సమయంలో ఢిల్లీ ఒబెరాయి హోటల్‌లో జరిగిన సమావేశంలో అరుణ్ పిళ్లై, కవిత పాల్గొన్నారు. హైదరాబాద్ లోనూ సౌత్ గ్రూపు సభ్యుల సమావేశం జరిగినట్లు ఈడీ ఇప్పటికే ఆధారాలు సేకరించింది. అప్రూవర్లుగా మారిన వారు కవితకు సంబంధించి కీలక సమాచారం ఇచ్చినందునే తాజాగా కవితను ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వారు ఇచ్చిన వాంగ్మూలాలను, ఈడీ సేకరించిన ఆధారాలను కవిత ముందుంచి అధికారులు ప్రశ్నించే అవకాశముందని అంటున్నారు. అయితే, కవితను ఇప్పుడైనా ఈడీ అరెస్ట్ చేస్తుందా? చేస్తే.. రాష్ట్ర రాజకీయాలపై ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలపై ఆ ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇప్పడు .. రాష్ట్ర రాకీయాలను వేడెక్కిస్తోంది.