Leading News Portal in Telugu

చంద్రబాబు అరెస్ట్.. తప్పుడు చర్య .. మాజీ ఐఏఎస్,ఐపీఎస్ ల ముక్తకంఠం | babu arrest wrong| former| ias| ips| officers


posted on Sep 15, 2023 2:03PM

నాలుగు దశాబ్దాలు పైబడిన ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర.. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి.. 15 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబును జగన్ సర్కార్ అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేయడం పట్ల సర్వత్రా నిరసన, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. చంద్రబాబు హయాంలో  జరిగిన అభివృద్శి ఎప్పటికీ ఆదర్శంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా విభజిత ఆంధ్రప్రదేశ్  అభివృద్ధి కోసం ఆయన ప్రణాళికలు, అమరాతి రాజధాని గురించి   ప్రపంచ దేశాలు సైతం గుర్తించి ప్రశంసలు కురిపించాయి.   మహిళలు, నిరుపేదలు, నిరుద్యోగులు, వృద్దుల సంక్షేమం కోసంఎన్నో పథకాలు. ఉద్యోగ, ఉపాధిలో దేశానికే ఆదర్శం.. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ లో కానీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమం గురించి చెప్పుకుంటూ పోతే అంతం అనేది ఉండదు. అలాంటి నాయకుడిని ఎఫ్ఐఆర్ లో  పేరు కూడా లేని కేసులో అరెస్ట్ చేయడంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మాట్లాడుకుంటున్నారు. హై ప్రొఫైల్ ఉన్న నేతను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పని సరి అన్న నిబంధనను తుంగలో తొక్కి  అరెస్ట్ చేయడం, అర్ధరాత్రి హైడ్రామా.. వేకువ జామున అరెస్ట్ చేయడం, 24 గంటలు గడిచిచే వరకూ  న్యాయమూర్తి ఎదుట హాజరు పరచకపోవడం లాంటి పరిస్థితులను యావత్ ప్రజానీకం తప్పుపడుతుంది.

చంద్రబాబు అరెస్టుపై ఏపీలోని అన్ని ప్రతిపక్షాలే కాకుండా జాతీయ స్థాయిలో అన్ని రాజకీయపార్టీలూ తప్పుపట్టాయి. ఖండించాయి.  మ నేషనల్ మీడియాలో కూడా  చంద్రబాబు అరెస్టుపైనే చర్చ నడుస్తున్నది. మరోవైపు మేధావులు కూడా ఈ అరెస్టు వ్యవహారాన్ని కక్ష  సాధింపు చర్యగానే చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ ఉద్యోగులు, కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబుకు మద్దతు ప్రకటించాయి హైదరాబాద్, ఢిల్లీ, కర్ణాటక , చెన్నై లాంటి  నగరాలలో యువత  చంద్రబాబుకు మద్దతుగా  నిరసనలు చేపడుతున్నారు. వీరే కాదు రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, మాజీ న్యాయమూర్తులు కూడా చంద్రబాబు అరెస్టును తప్పుబడుతున్నారు. ఈ కేసులో నమోదు చేసిన సెక్షన్లను ప్రస్తావిస్తూ  ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎండగడుతున్నారు.

చంద్రబాబు అరెస్టు విషయంలో సీఐడీ వ్యవహరించిన విధానాన్ని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు తప్పు పట్టారు. అవినీతి నిరోధక చట్టాన్ని అనుసరించే విధానంలో నిబంధనలు పాటించలేదన్నారు.  ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పూర్తి వివరాలు పంచుకున్నారు. చంద్రబాబుకు ఇచ్చిన అరెస్ట్ మెమో ప్రకారం.. ఆయన అరెస్ట్ నిబంధనల ప్రకారం జరగలేదన్నారు. ఈ కేసులో తప్పు ఒప్పులను న్యాయస్థానాలు తెలుస్తాయని.. కానీ అరెస్ట్ సహేతుకంగా చట్టబద్ధంగా జరగలేదని నాగేశ్వరరావు తేల్చి చెప్పారు. అరెస్టు సమయంలో ప్రొసీజర్ పాటించడంలో సీఐడీ అధికారులు విఫలమైనట్లు  వివరించారు. నమోదు చేసిన సెక్షన్లు, కేసు వివరాలను సమీక్షించిన ఆయన గవర్నర్ ఆమోదం లేకుండా అరెస్ట్ చేయడం చట్టాన్ని ఉల్లఘించడమేనని పేర్కొన్నారు.

అంతకు ముందు ఈ కేసులో సీఐడీ అధికారులు ప్రవర్తించిన తీరు అనుమానం కలిగించేలా ఉందని మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ఆరోపించారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఏర్పాటు చేసిన సమయంలో  ఈయనే ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కాగా.. అప్పుడు నిధులు కూడా ఈయన చేతుల మీదుగానే విడుదల అయ్యాయి. చంద్రబాబు అరెస్టుపై స్పందించిన పీవీ రమేష్.. తన స్టేట్‍మెంట్ ఆధారంగానే కేసు పెట్టారనడం దిగ్భ్రాంతి  కలిగించిందన్నారు. స్కిల్ డెవలప్‍మెంట్ లో ఆర్థికశాఖ ఏ తప్పూ చేయలేదని విస్పష్టంగా చెప్పారు. సీఐడీ తీరుపై తనకు అనుమానం కలుగుతోందనీ, తాను చెప్పిన విషయాలను  సీఐడీ తమకు అనుకూలంగా మార్చుకుందని సందేహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‍మెంట్ కేసులో ఎండీ, కార్యదర్శిల పాత్రే ప్రధానం.. మరి వారి పేర్లు ఎందుకు లేవని నిలదీశారు.

సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మి నారాయణ కూడా పలు మీడియా ఛానెళ్ల చర్చా కార్యక్రమాలలో మాట్లాడుతూ.. సీఐడీ పీసీ చట్టంలోని 17ఏ సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని.. కానీ చంద్రబాబు అరెస్టు విషయంలో అది జరగలేదన్నారు. ఇప్పుడైనా గవర్నర్ అనుమతిస్తేనే ఆ సెక్షన్ ఈ కేసు వర్తిస్తుందని.. లేకపోతే ఆ సెక్షన్ పని చేయదని వివరించారు ఈ సెక్షన్ పై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా చంద్రబాబుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. వీరే కాదు.. వీరి బాటలో మరికొందరు రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ కూడా చంద్రబాబు అరెస్టును తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆయన అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు చేస్తున్నారు.