ఎందుకీ మౌనం.. ఏమిటా భయం.. జగన్ తీరుపై వైసీపీలో ఆందోళన | jagan silence on babu arrest| ycp| leaders| cadre| fear| political| future| alliance| tdp| janasena| ysrcp| win| hopes
posted on Sep 16, 2023 12:03PM
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించడంతో వైసీపీ నేతలు, ముఖ్యంగా గత ఎన్నికలలో వెయ్యి ఓట్లు అంత కంటే తక్కువ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికలలో తమ ఓటమి ఖాయమని ఖరారు చేసుకున్నారు. తమ రాజకీయ భవిష్యత్ ఏమిటని ఆందోళన చెందుతున్నారు. గత ఏన్నికలలో ఇలా వెయ్యి అంతకంటే కొంచం తక్కువ, లేదా ఎక్కువ మెజారిటీతో వైసీపీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాలు ఒకటీ రెండూ కాదు ఏకంగా 42 ఉన్నాయి.
2019లో వైసీపీ 151 నియోజకవర్గాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. వాటిలో 42 చోట్ల గెలిచిన అభ్యర్థుల మెజారిటీ వెయ్యి లోపు ఓట్లు మాత్రమే. విజయవాడ సెంట్రల్‌లో వైసీపీ కేవలం25 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఉభయ గోదావరిజిల్లాల నుంచి శ్రీకాకుళం,విజయనగరం,కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో పలు నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులు చావుతప్పి కన్ను లొట్టపోయిన రీతిలో స్వల్ప మెజారిటీలతోనే విజయం సాధించారు. ముఖ్యంగా వెయ్యి మెజారిటీ విజేతలలో అత్యధికులకు వచ్చిన మెజారిటీ 500 ఓట్లు మాత్రమే. మిగిలిన వారి మెజారిటీ కూడా 500 నుంచి 1000 ఓట్ల మధ్యనే ఉంది. 2019లో వైసీపీ,జనసేన,టీడీపీ మధ్య ముక్కోణపు పోర జరగడంతో తెలుగుదేశం, జనసేన మధ్య భారీగా ఓట్లు చీలిపోవడంతో వైసీపీ గట్టెక్కిందని పరిశీలకులు అప్పట్లో విశ్లేషించిన సంగతి విదితమే. ఇప్పుడు, టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖరారు కావడంతో గతంలోలా ఓట్లు చీలి వైసీపీ లబ్ధి పొందే అవకాశాలు మృగ్యమని రాజకీయ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఓట్లు చీలకపోవడం, రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వైసీపీకి గెలుపు ఆశలను దాదాపు దూరం చేసేసినట్లేనని అంటున్నారు.
గతంలోనే పవన్ కల్యాణ్ పొత్తుల ప్రస్తావన చేసిన సందర్భంలో వైసీపీ ఓటమి భయంతో వణికిపోయిందనీ, ప్రత్యర్థి పార్టీల పొత్తును వ్యతిరేకిస్తూ దమ్ముంటే ఒంటరి పోరు అంటూ సవాళ్లు విసిరిందనీ గుర్తు చేస్తున్నారు. జగన్ వేవ్ అను ఆ పార్టీ చెప్పుకుంటున్న 2019 ఎన్నికలలోనే 42 నియోజకవర్గాలలో స్వల్ప మెజారిటీతో గట్టుక్కిన వైసీపీ.. ఇప్పుడు తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న తరుణంలో విపక్షాలు కలిసి పోటీ చేస్తుండటంతో. విజయంపై ఆశలు గల్లంతై.. ఒక జనాలను భయభ్రాంతులకు గురి చేసేలా విపరీతమైన నిర్బంధాన్ని ప్రయోగించైనా లబ్ధి పొందే వ్యూహంతో ముందుకు సాగుతున్నదని పరిశీలకులు అంటున్నారు. ఆ కారణంగానే విపక్ష నేత అక్రమ అరెస్టు, సీఐడీ చీఫ్ చంద్రబాబుతో అరెస్టులు ఆగవు.. లోకేష్ సహా మరింత మంది నేతలను అరెస్టు చేస్తామని మీడియా సమావేశాలలోనే చెప్పడాన్ని వారీ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
జగన్ లో కూడా ఓటమి భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోందనీ, అందుకే తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా, యావద్దేశంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అన్న వర్గాల వారూ రోడ్లపైకి రావడమే కాకుండా బాబుకు సంఘీభావంగా ఆందోళనలకు దిగుతున్నా.. జగన్ మౌనం వహిస్తున్నారని అంటున్నారు. తన విదేశీ పర్యటన ముగించుకుని రాగానే హస్తిన పర్యటనకు బయలుదేరనున్నట్లు ఆయన విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఆయన హస్తినకు వెళ్లలేదు. కేంద్రం పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడమే ఇందుకు కారణమని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. అదే సమయంలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హస్తిన వెళ్లి జాతీయ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తే ఏపీలో జగన్ ప్రభుత్వ అరాచకత్వాన్ని వివరిస్తున్నారు. అలాగే జాతీయ నేతల మద్దతు కూడగడుతున్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో కూడా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ వివిధ పార్టీల నేతలు గళమెత్తేలా వారి మద్దతు కూడగడుతున్నారు.
అదే సమయంలో కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబు అక్రమ అరెస్టును నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం (సెప్టెంబర్ 15)న రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం సందర్భంగా జగన్ ప్రసంగంలో చంద్రబాబు అరెస్టు, అందుకు నిరసనగా తన ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న నిరసనలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. తెలుగుదేశం, జనసేన పొత్తుపై కూడా పన్నెత్తు మాట మాట్లాడలేదు. అసలు ప్రభుత్వ కార్యక్రమానికీ, పార్టీ కార్యక్రమానికీ తేడా లేకుండా చంద్రబాబు, తెలుగుదేశంపై విమర్శలు తప్ప మరో మాట రాని జగన్ నోటి వెంట రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా బహిరంగ సభలో అందుకు సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
బాబు అరెస్టు, తదననంతర పరిణామాలతో జగన్ భయపడుతున్నారనీ, ఈ పరిస్థితుల్లో మౌనాన్ని ఆశ్రయించడమే మేలనీ ఆయన భావిస్తున్నారని అంటున్నారు. అలా కాకుండా చంద్రబాబు అరెస్టును సమర్ధించుకుంటూ జగన్ ఏమైనా మాట్లాడితే ఆ మాటలు బూమరాంగ్ అవుతాయంటున్నారు. ఏళ్ల తరబడి బెయిలుపై బయటకు తిరుగుతూ, అక్రమాస్తుల కేసు, కోడికత్తి కేసులలో కనీసం కోర్టుకు కూడా హాజరు కాకుండా మినహాయింపు కోరుకుంటూ తిరుగుతున్న వ్యక్తి నాలుగుదశాబ్దాలకు పైగా మచ్చ లేని నేతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన దార్శనికుడు చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనీ అందుకే అరెస్టు అయ్యారనీ ఎలా చెప్పగలుగుతారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆ కారణంగానే జగన్ మౌనాన్ని ఆశ్రయించారని చెబుతున్నారు.
అయితే చంద్రబాబు అరెస్టుపై జగన్ మౌనం వైసీపీ నేతలను, శ్రేణులను భయాందోళనలకు గురి చేస్తున్నది. అధినేతే మౌనం వహిస్తున్నప్పుడు తాము మాత్రం బాబు అరెస్టును సమర్ధిస్తూ మీడియాకు ఎక్కడం ఎందుకని నేతలు సైతం వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వాధినేతగా, అధికార పార్టీ అధినేతగా జగన్ విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై స్పందించక పోవడం ఏమిటని వైసీపీ నేతలే అంతర్గత సమావేశాల్లో ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. జగన్ మౌనం చంద్రబాబును వైసీపీ సర్కార్ అక్రమంగా, కక్ష సాధింపు చర్యలలో భాగంగానే అరెస్టు చేసిందని వెల్లువెత్తుతున్న విమర్శలకు బలం చేకూరుస్తోందని వారు అంటున్నారు. మొత్తంగా చంద్రబాబు అరెస్టుపై జగన్ మౌనం.. వైసీపీ నేతలలో ఆందోళనను పెంచడమే కాకుండా వచ్చే ఎన్నికలలో పార్టీకి తీరని నష్టం జరగడం తథ్యమన్న భావనకు వచ్చేలా చేసింది.