Leading News Portal in Telugu

స్కిల్ స్కాంలో ఉన్నది కుంభకోణం కాదు.. జగన్ కక్షకోణమే! | no scam only jagan vendictive| skill| case| people|with| babu| angry


posted on Sep 17, 2023 7:35AM

అంతా మీరే చేశారు.. అవును నాన్నా అంతా మీరే చేశారు. బొమ్మరిల్లు సినిమాలో ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  కాస్త స్ట్రిక్ట్ గా ఉండే నాన్నలను బొమ్మరిల్లు ఫాదర్ అని పిలుచుకొనేంత ఫేమస్ అయ్యిందీ డైలాగ్. ఇదే డైలాగ్ ను కనుక ఏపీ రాజకీయాల కోణంలో చూస్తే అంతా జగనే చేశారని చెప్పుకోవాలి. ఎంతలా అంటే ఇప్పుడు ఏకంగా తన చేతిలో ఉన్న అధికారాన్ని  వెండిపళ్లెంలో పెట్టి మరీ తెలుగుదేశంకు అప్పగించేంతగా అంతా జగనే చేస్తున్నారు. అవును ఇక్కడ చెప్పుకుంటున్నది చంద్రబాబు అరెస్ట్ గురించే. స్కిల్ డెవలప్మెంట్ కేసేంటి.. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన నేరం ఏంటి? అసలు కుంభకోణం జరిగిందా? జరిగితే ఎంత మొత్తంలో ఇది జరిగింది లాంటి అంశాలన్నీ కోర్టులే తేల్చాలి. అయితే  ఇప్పుడు ఇక్కడ చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు మాత్రం అక్రమమేనని స్పష్టంగా తేలిపోయింది. రిటైర్డ్ అధికారుల నుండి న్యాయమూర్తుల వరకూ అందరూ ముక్తకంఠంతో ఈ అరెస్టును ఖండిస్తున్నారు. 

కేసు పరిధి ఏంటి.. స్థాయి ఏంటి.. ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏంటి అనే అంశాలు కాస్తా ప్రజలకు తెలిసిన అనంతరం అసలు ఈ కేసు కూడా కుట్ర పూరితమేనా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఒక వైపేమో అక్రమ అరెస్ట్.. మరోవైపేమో కుట్ర  అనుమానాలతో ఇప్పుడు చంద్రబాబు పట్ల అభిమానం, సానుభూతి గతం కంటే చాలా చాలా ఎక్కువగా  జనబాహుల్యంలో వ్యక్తం అవుతోంది. రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలలో ఆయనకి దక్కుతున్న మద్దతు చూస్తున్న ఏపీ ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డిని తిట్లుకోకుండా ఉండలేకపోతున్నారు. జగన్ తన చేతులతో టీడీపీలో కదలిక తెచ్చాడని.. ఎక్కడెక్కడో ఉన్న టీడీపీ అభిమానులందరినీ జగనే ఏకతాటి పైకి వచ్చేలా చేస్తున్నాడని చర్చించుకుంటున్నారు. ఈ అరెస్టుతో జనసేన-తెలుగుదేశం ఒక్కటయ్యాయి. దీంతో రాష్ట్రంలో రెండు పార్టీల కార్యకర్తల కలయిక ఇప్పుడు కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. కలిసి కట్టుగా చంద్రబాబుకు అండగా నిలబడుతున్నారు.

 ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ అంశమే వినిపిస్తున్నది. పల్లెల్లో రచ్చ బండల దగ్గర నుండి నగరాల్లో పార్కుల వరకూ చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సానుభూతి వ్యక్తం అవుతోంది. పేద విద్యార్థులలో నైపుణ్యం పెంచేందుకు చంద్రబాబు సంస్థ ఏర్పాటు చేస్తే అందులో జగన్ తప్పులు వెతికి అరెస్ట్ చేయించాడని.. అది కూడా కనీస ఆధారాలు కూడా లేకుండా అరెస్ట్ చేయించారన్న భావన ప్రజలలో బలంగా వ్యక్తం అవుతోంది.  జగన్ తండ్రి అధికారంలో ఉండగా అక్రమ ఆస్తుల విలువతో ఈ కేసును పోలుస్తున్న మరికొందరు.. ఎవరికీ ఉపయోగం లేని సంస్థలను ఏర్పాటు చేసి వేల కోట్లు వెనకేసుకున్న వ్యక్తికి.. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సంస్థలో తప్పులు కనిపించడం పెద్ద వింతేమీ కాదని చర్చించుకుంటున్నారు. సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ కేసుపై స్పందించి చంద్రబాబు అడ్డంగా దొరికారని చెప్పినా.. అది  గుడ్డ కాల్చి మోహన వేసే ప్రయత్నం చేయడమే తప్ప మరోటి కాదని జనం భావిస్తున్నారు. ఇదిగో ఆయన చేసిన నేరం ఇదీ అని నాలుగు మాటలు మాట్లాడలేని జగన్ అడ్డగోలుగా చంద్రబాబు తప్పు చేశాడని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం ప్రజలకు అర్ధమైపోయింది.  

ఒకవైపు రాష్ట్రంలో ఒక్కసారిగా మారిన రాజకీయాలు.. మరోవైపు దేశవ్యాప్తంగా చంద్రబాబుకు పెరిగిన మద్దతు.. ఈ కేసుపై వైసీపీ నేతలు పదే పదే దోపిడీ గురించి మాట్లాడడం.. చంద్రబాబు కుటుంబం ఆయన కోసం జైలు వద్ద పడిగాపులు కాయడం.. కోర్టుల చుట్టూ తిరగడం అన్నీ టీడీపీకి సానుకూల అంశాలుగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   స్కిల్ కేసులో చంద్రబాబు బయటపడినా.. మరో మూడు నాలుగు కేసులు సిద్ధంగా ఉన్నాయని వైసీపీ నేతలు ముందే చెప్పడం చూస్తున్న ప్రజలు.. ఇది కుంభకోణం కాదని కక్ష కోణం అని నిర్ధారణకు వచ్చేశారు. అసలు రాష్ట్రంలో పాలన అనేది ఏ మాత్రం పట్టించుకోకుండా.. సీఎం జగన్ తెలుగుదేశం నేతలను వేధించడమే పనిగా పెట్టుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుండడంతో ఈసారి జగనే తన చేతులతో తానే స్వయంగా తెలుగుదేశానికి అధికారం కట్టబెట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.