అక్రమ కేసులకీ అసెంబ్లీని వాడుకుంటారా? | jagan sarkar plan to use assembly session to discuss illegal arrest of babu| courts
posted on Sep 17, 2023 9:44AM
ఈ నెల 21 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు 21వ తేదీన మొదలైతే ఎన్నిరోజులు జరగాలని బీఏసీ సమావేశంలో డిసైడ్ అవుతుంది. కాకపోతే, వర్షాకాల సమావేశాలు కాబట్టి సుమారు ఐదారు రోజులు నిర్వహించే అవకాశం ఉందన్నది అంచనా. మరి ఈ సమావేశాలలో ప్రభుత్వం ఏం ప్రతిపాదనలు చేయనుంది? ఎలాంటి నిర్ణయాలను తీసుకోనుంది? ఏపీ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ఏం చెప్పనుంది? ప్రతిపక్ష పార్టీ ఈ సమావేశాలలో పాల్గొంటుందా? పాల్గొంటే ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తేవాలనుకుంటుంది? సహజంగానే ఇలాంటి చర్చ ప్రజలలో విస్తృతంగా జరుగుతోంది. ఇది ఎన్నికల ఏడాది కనుక ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఏ స్థాయి హీట్ పెంచనున్నాయన్న ఉత్కంఠ కూడా నెలకొంది.
అధికార పార్టీ ప్రభుత్వం తరపున ప్రజలకు ఎలాంటి తాయిలాలు సిద్ధం చేస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. అయితే, ఏపీలో ఇప్పుడు మాత్రం పైన చెప్పుకున్న అంశాల కన్నా టీడీపీకి వ్యతిరేకంగా అసెంబ్లీ సెషన్ ను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసినట్లు పరిశీలకులు విశ్లేషించింది. తమ ప్రభుత్వం అంత చేసింది.. ఇంత చేసింది అని అసెంబ్లీ వేదికగా ప్రజలకు చెప్పుకుంటూనే చంద్రబాబును ఒక అవినీతి పరుడిగా చిత్రీకరించేందుకు ఈ సమావేశాలను వేదికగా ఉపయోగించుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారని అంటున్నారు.
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్, అస్సైన్డ్ భూములు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు, ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలు, గత ప్రభుత్వంలో వచ్చిన కంపెనీలకు ఇచ్చిన రాయతీలు ఇలా అన్నిటిలో తెలుగుదేశం పార్టీని కుట్రదారుగా చూపించాలని.. చంద్రబాబును దోపిడీ దారుగా చూపించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నార చెబుతున్నారు. తెలుగుదేశం సభ్యులు అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశాలు తక్కువ గా ఉన్నాయి. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళన బాటలో ఉన్న తెలుగుదేశం సభ్యులు అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఈ సమావేశాలను పూర్తిగా తెలుగుదేశం పార్టీపై బురదజల్లేందుకే వినియోగించుకోవాలని వైసీపీ పన్నాగం పన్నుతున్నదంటున్నారు.
నిజానికి అసెంబ్లీ వేదికగా అవినీతి ఆరోపణలు చేసుకున్నంత మాత్రాన ఏమీ కాదు. చంద్రబాబు కేసు కోర్టు మెట్లెక్కేసింది. కాకపోతే ఇంకా ట్రయల్ మొదలు కాలేదు. సీఐడీ కస్టడీకి కోరినా అక్రమ అరెస్టుతో కోర్టు ముందు వివరాలు కావాలని కోరింది. మరోవైపు చంద్రబాబు ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టులో కూడా బెయిల్ దరఖాస్తు చేసున్నారు. రెండు చోట్లా కేసుపై విచారణలు మొదలైతే ఈ కేసు బండారం బయట పడిపోతుంది. అసలు ఈ కేసు నిలబడుతుందా? అన్న అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ నిలబడితే దర్యాప్తు జరిపి అప్పుడు అవినీతి జరిగిందా? లేదా అన్నది కోర్టు తేలుస్తుంది. కానీ, జరిగిన, జరుగుతున్న పరిణామాలను చూస్తే మాత్రం ఇందులో కుట్ర ఉందన్నది విశ్లేషకుల వివరిస్తున్నారు. మేధావులు, మాజీ అధికారులు, మాజీ న్యాయమూర్తులూ కూడా చంద్రబాబు అరెస్టు అక్రమమనీ, కక్షపూరిత రాజకీయంలో భాగమే అని నిర్ద్వంద్వంగా చెబుతున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు, చంద్రబాబు అక్రమ అరెస్టు వల్ల ఇప్పటికే వైసీపీకి భారీ నష్టం వాటిల్లిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాంటిది ప్రభుత్వం ప్రతిపక్షంపై ఇలా తప్పుడు కేసులు పెట్టి వాటిని తిరిగి అసెంబ్లీలో చర్చ పెట్టి చర్చిస్తామని చెప్పడం.. కోర్టులు కేసును తేల్చక ముందే చట్టసభలలో దోషులుగా ముద్ర వేయాలని ప్రయత్నించడం దేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదు. ఎక్కడైనా కేసులు పెడితే దర్యాప్తు చేసి కోర్టులో పెట్టి శిక్షలు వేస్తారు. దీనికి పక్కా ఆధారాలు కావాలి. కానీ, ఇక్కడ అవే లేకపోవడంతో బట్ట కాల్చి మీద వేయడమే ప్రభుత్వ వ్యవహారశైలిగా భావించాల్సి వస్తున్నదంటున్నారు. అందుకు అసెంబ్లీని వేదికగా వాడుకోవాలని ప్రయత్నించడం ప్రభుత్వ దుర్మార్గం వినా మరొకటి కాదని చెబుతున్నారు. అదే జరిగితే ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక కావాల్సిన అసెంబ్లీ చివరికి రాజకీయ కక్షల కేసుల కోసం చేసే దుష్ప్రచారానికి వేదిక కావడం ఏపీ ప్రజల దురదృష్టంగానే భావించాలి.