Leading News Portal in Telugu

జైళ్ల శాఖ డీఐజీగా బుగ్గన బంధువు.. టార్గెట్ బాబేనా?! | buggana relative as jails dig| target| babu| kadapa| viveka| murder| case| accused| cbn| security


posted on Sep 18, 2023 8:04AM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ సంస్థకు కేటాయించిన నిధులలో స్కాం జరిగిందని ఏపీ ప్రభుత్వం ఆయనపై అక్రమ కేసులు పెట్టి.. అర్ధరాత్రి అక్రమ అరెస్టుతో ఆయనను జైలుకు పంపింది. చంద్రబాబుపై బనాయించిన కేసులు అక్రమమని.. కనీస ఆధారాలు కూడా లేకుండా ఆయనను అరెస్ట్ చేయడంపై దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు భగ్గుమంటున్నారు. ప్రస్తుతానికి ఈ కేసు కోర్టు పరిధిలో ఉండగా.. కనీసం చంద్రబాబును సీఐడీ రిమాండ్ కు కూడా ఇవ్వలేదు. అయితే, చంద్రబాబుకు జైల్లో ప్రాణహాని ఉందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కేసు వివరాలు, నేరం జరిగిందా లేదా అన్నది ఎలా ఉన్నా ఎన్ఎస్జీ జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న వ్యక్తి భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు ప్రభుత్వం ఈ విషయంపై మరింత దృష్టి సారించాలి.

కానీ, ఇప్పుడు ప్రభుత్వంపైనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కక్ష్ పూరితంగానే ఈ కేసు పెట్టారని ఇప్పటికే స్పష్టమైంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు ఒక్కటే కాదు.. మరో మూడు కేసులు సిద్ధంగా ఉన్నాయని.. చంద్రబాబును జైలుకు పరిమితం చేస్తామని.. ఇక ఆయనను బయటకి రానివ్వమని వైసీపీ నేతలు బహిరంగంగానే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరోవైపు చంద్రబాబుకు జైల్లో విశ్రాంతి లేకుండా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి సమయంలో జైలు బ్యారక్స్ వద్ద పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఆయనను నిద్రపోనివ్వడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు పెళ్లి రోజున ఆయన భార్య భువనేశ్వరిని ములాఖత్ కు అనుమతి ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. జైల్లో ఆయనను చంపేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని   తీవ్ర విమర్శలకు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా చంద్రబాబును హింస పెట్టేందుకే ప్రభుత్వం ఈ తరహా చర్యలకు దిగుతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇదిలా ఉండగానే ఇప్పుడు ఈ అంశంలో మరో కొత్త కోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. రాజమండ్రి జైలుకు సూపరిండెంట్ వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లగా.. ఆయన స్థానంలో జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీగా ఎం.ఆర్.రవికిరణ్ వ్యవహరిస్తున్నారు. ఆయన ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి రవికిరణ్ సమీప బంధువు కాగా.. ఇప్పుడు ఆయనకు ఈ రాజమండ్రి జైలు బాధ్యతలు అప్పగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ముందు రవి కిరణ్ కడపలో పనిచేయగా.. అదీ కూడా వివేకా హత్య కేసు నిందితులు జైళ్లలో ఉన్నప్పుడు కడప జైలు బాధ్యతలు చూశారు. ఆ సమయంలో వివేకా హత్యకేసు నిందితులను కోర్టు అనుమతి లేకుండా ఖైదీల్ని బయటకి వదిలి జైలు కాదు గెస్ట్ హౌస్ అనేలా చేశారని విమర్శలున్నాయి. అప్పట్లో ఆయన తీరును సీబీఐ కూడా కోర్టులో తప్పు పట్టింది. 

అయితే, ఇప్పటికిప్పుడు ఆయన్ను హఠాత్తుగా కోస్తాంధ్రకు తీసుకురావడం, రాజమండ్రి జైలు సూపరిండెంట్ సుదీర్ఘ సెలవుపై వెళ్లడం.. జైలు బాధ్యతలను రవి కిరణ్ చూసుకోవడం అంతా ప్లాన్ ప్రకారమే చేశారన్న అనుమానాలు బలపడుతున్నాయి.   జైల్లో చంద్రబాబును ఏం చేయబోతున్నారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై స్పందించిన డీజీపీ రవి కిరణ్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తాను బంధువునేనని.. అంత మాత్రాన తాను ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడన్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రాజకీయ నాయకులతో బంధుత్వం ఉన్నంత మాత్రాన నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తానన్న ఆలోచన సరికాదని చెప్పుకొచ్చారు. కానీ, వివేకా హత్యకేసు నిందితుల విషయంలో ఆయన వ్యవహరించిన తీరు.. సీబీఐ కోర్టులోనే ఆయనపై ఆరోపణలు చేయడం రావడం వంటి ఘటనలతో చంద్రబాబు భద్రతపై అనుమానాలు బలపడుతున్నాయి.   మరి ప్రభుత్వ పెద్దల వ్యూహమేంటో.. ఏ ఉద్దేశంతో జైలు బాధ్యతను రవికిరణ్ కు అప్పగించారో చూడాల్సి ఉంది.