చంద్రబాబు అక్రమ అరెస్టు.. తెలుగుదేశంకు సంక్షోభంలోనూ సానుకూలం! | babu arrest a blessing in disguise to tdp| crisis| positine
posted on Sep 18, 2023 8:51AM
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం కక్షపూరిత చర్య అంటే ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేద విద్యార్థులలో నైపుణ్యం పెంపుకోసం చేపట్టిన ప్రాజెక్టులో తప్పులు వెతికి.. తీవ్రమైన సెక్షన్లను ఆపాదించి చంద్రబాబును అరెస్ట్ చేయడంపై సామాన్య జనం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేధావుల నుండి విశ్లేషకుల వరకూ.. మాజీ అధికారుల నుండి మాజీ న్యాయమూర్తుల వరకూ అందరూ చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబుని విడుదల చేయాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్, బెంగళూర్ల, చెన్నై… ఇలా దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడెక్కి నిరసనలు తెలుపుతున్నారు. అమెరికాలోని ప్రధాన నగరాలలో కూడా చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ, ఆయనను వెంటనే విడుదల చేయాలంటూ తెలుగు వారు నిరసనలు తెలుపుతున్నారంటే చంద్రబాబుకు మద్దతు ఏ స్థాయికి చేరిందో అర్ధం చేసుకోవచ్చు.
అయితే, చంద్రబాబు జైలు నుండి బయటకి వస్తారా? వస్తే ఎప్పుడు వస్తారు? హైకోర్టులో బాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు ఏ విధంగా ఉంటుంది? భవిష్యత్ పరిణామాలేంటి? చంద్రబాబు మరి కొంత కాలం జైలులోనే ఉండాల్సి వస్తే.. తెలుగుదేశంను ముందుకు నడిపించేది ఎవరు? ఇలా ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది ఈ పరిస్థితిని ఒక సంక్షోభంగానే చూడాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. మరికొందరైతే ఇది తెలుగుదేశం పార్టీకి సంక్షోభంలోనూ సానుకూలమేనని భావించాలంటున్నారు. ఎటూ ఇది అక్రమ అరెస్టు అనేది ప్రజలలోకి బలంగా వెళ్లిందనీ, తెలుగుదేశంకు, చంద్రబాబుకు ప్రజా మద్దతు దండిగా ఉందని, నాలుగేళ్ళ జగన్ కక్షపూరిత పాలన, వైసీపీ నేతల వ్యాఖ్యలు విన్న ప్రజలు ఇది కూడా జగన్ సర్కార్ కక్షపూరితంగా, అక్రమంగా వ్యవహరిస్తున్నదని బలంగా నమ్ముతున్నారు. అన్ని వైపుల నుంచీ జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా, చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి కనుక ఇది టీడీపీకి అనుకూల అంశమని వాదిస్తున్నారు.
భారీ సంక్షోభాలను చూసిన చంద్రబాబుకు ఈ కేసులు పెద్ద లెక్కేమీ కాదు. కేంద్రంలో చక్రం తిప్పి దేశాన్ని తన వైపుకు తిప్పుకున్న ఆ నాయకుడు ఇప్పుడు ఈ అక్రమ కేసులకు ఉలిక్కిపడతారని అనుకోవడం అమాయకత్వమే అవుతుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో వైసీపీకి తీరని డ్యామేజీ జరిగింది. ఇంకా ఇంకా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకూ ఎక్కడ చూసినా చంద్రబాబు అక్రమ అరెస్టుపైనే చర్చ జరుగుతోంది. జాతీయ మీడియాలో కూడా చంద్రబాబు అక్రమ అరెస్టే ప్రధాన వార్తగా హైలైట్ చేస్తున్నది. జగన్ మోహన్ రెడ్డితో పోల్చుకుంటే చంద్రబాబు జాతీయ మీడియాకు బాగా తెలిసిన పొలిటీషియన్. దీంతో జాతీయస్థాయి మీడియా ఏపీ రాజకీయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఢిల్లీకి వెళ్లి అక్రమ అరెస్టును చర్చకు పెట్టారు. నేషనల్ మీడియా ఛానెళ్లలో కూర్చొని సీఎం జగన్ మోహన్ రెడ్డికి లైవ్ లో సవాళ్లు విసురుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నేతల నుండి కూడా చంద్రబాబుకు భారీ మద్దతు లభిస్తుంది.
ఏపీలో తెలుగుదేశం, జనసేన క్యాడర్ కలిసి సమష్టిగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అమెరికాలో చేపట్టిన నిరసనలలో కూడా జనసేన మద్దతు దారులు కనిపిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు ఇప్పుడు తెలుగుదేశం, జనసేన కార్యకర్తలనే కాదు సామాన్య జనాన్ని కూడా కదిలించింది. జనం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి.. పోలీసు నిర్బంధాలను కూడా లేక్క చేయకుండా నిరసన తెలుపుతున్నారు. ఇక రేపు చంద్రబాబు స్వచ్ఛంగా పులు కడిగిన ముత్యంలా బయటకు రాగానే తెలుగుదేశం భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఒక రోజు అటూ ఇటూగా చంద్రబాబుకు ఈ కేసులు బెయిలు రావడం తథ్యమని, ఆయనపై వైసీపీ అక్రమంగా బనాయించిన ఈ కేసు నిలవదని న్యాయనిపులు మీడియా చర్చలలో సోదాహరంగా వివరిస్తున్నారు. దీంతో ఎన్నికల ముంగిట జగన్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించడం ద్వారా తన ఓటమిని, తన పతనాన్ని తానే లిఖించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.