Leading News Portal in Telugu

ప్రాణాలు పోతున్నా.. పాషాణం కరగదా ? | jaganreddy vendictive politics| babu| arrest| pt|acb


posted on Sep 20, 2023 9:26AM

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు,  మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రజలు, పార్టీ శ్రేణులు ఎక్కడి కక్కడ నిరశన దీక్షలు చేస్తున్నారు. అలాగే  తెలుగునా  తెలుగు దేశం పార్టీని ఇంటి పార్టీగా, చంద్రబాబును ఇంటి ఇలవేలుపుగా ఆరాధించే ప్రజలు, అభిమానులు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రాణాలు ఇచ్చేందుకు అయినా సిద్దమనే రీతిలో దీక్షలు చేస్తున్నారు. 

చంద్రబాబు క్షేమంగా తమ మధ్యకు రావాలని, వైసీపీ అరాచక, అవినీతి, అక్రమ, అధర్మ పాలనకుచరమ గీతం పాడాలని కోరుకుంటున్నారు.  జైల్లో బాబు ఎలా ఉన్నారో .. అనే బాధతో , అలాగే చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేని  తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిద్రాహారాలు మాని, బాబు కోసం ప్రార్ధనలు చేస్తున్నారు. గుళ్ళలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చంద్రబాబు విడుదల కోరుకుంటూ మొక్కులు మొక్కు తున్నారు. చంద్రబాబును తమ ఆరాధ్య దైవంగా భావించే, పూజించే ఐటీ ఉద్యోగులు,ఇటు హైదరాబాద్, అటు బెంగుళూరు, ఇంకా చెన్నైలో  నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆందోళన బాటపట్టారు. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేని పలువురు  ఆ బాధలో కన్ను ముస్తున్నారు.  చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి ఇంతవరకు పదుల సంఖ్యలో   చంద్రబాబు అభిమానులు మనస్తాపంతో కన్ను మూశారు. 

కాగా ఇప్పడు తాజాగా, విశాఖ నగరంలో  టీడీపీ బాబాయ్‌ గా పిలుచుకునే విశాఖపట్నం షీలానగర్‌కు చెందిన పి.రాధాకృష్ణమూర్తి(82) మృతి చెందారు. చంద్రబాబును అరెస్టు చేసిన నాటి నుంచి నాయకులకు ఫోన్‌ చేస్తూ ఆయన ఎప్పుడు బయటకు వస్తారు? జైల్లో ఎలా ఉన్నారు? అంటూ వాకబు చేసిన అయన సోమవారం కన్నుమూశారు. కన్నుముసేందుకు కొద్ది క్షణాల ముందు కూడా ఆయన చంద్రబాబు బెయిల్‌ విషయంపై కుటుంబ సభ్యులతో చర్చించారు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారని కుటుంబ సభ్యులు చెప్పారు.

మరో వంక కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో టీడీపీ కార్యాలయం వద్ద, చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో గుడ్లవల్లేరు మండలం అంగలూరు ఎస్సీవాడకు చెందిన వ్యవసాయ కూలీ కోటేశ్వరరావు(62) కుప్పకూలి కన్ను మూశారు. చంద్రబాబు అరెస్టు అయినప్పటి నుంచి అవేదన చెందుతున్న కోటేశ్వరరావు  మంగళవారం(సెప్టెంబర్ 19)దీక్షలో పాల్గొన్నారు. కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్లే పడిపోయారు. ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జైలులో చంద్రబాబు ఎలా ఉన్నారోనన్న బాధతో గడచిన మూడు రోజుల్లో ఆదివారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు  రాష్ట్రంలో ఏడుగురు మరణించారు.

 ఇంతగా ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నా, ప్రజల ప్రాణాలే పోతున్నా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, కక్ష సాధింపు ధోరణిని కొనసాగిస్తున్నారు. అధికారుల అండతో ఒక దాని వెంట ఒకటిగా అక్రమ కేసులు బనాయించేందుకు కుట్రలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా, మరో కేసును తెరమీదకు తెచ్చి  చంద్రబాబును వేధింపులకు గురిచేస్తున్నారు. ఫైబర్‌నెట్‌ కేసులో ఆయన్ను విచారించాల్సి ఉందంటూ విజయవాడలోని ఏసీబీ కోర్టులో  మంగళవారం(సెప్టెంబర్ 19)) పీటీ వారెంట్‌ దాఖలు అయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్‌లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్‌ కంపెనీకి అడ్డదారిలో టెండర్లను కట్టబెట్టారని.. ఈ వ్యవహారంలో రూ.120కోట్ల అవినీతి జరిగిందని వారెంట్‌లో పేర్కొన్నట్లు సమాచారం.  దీనిని కోర్టు విచారణకు స్వీకరించింది. 

కాగా  ఓటమి భయంతోనే జగన్ రెడ్డి ఎన్నికల ముందు ఎలాంటి అధారాలు లేని  కేసులను బయటికి తీసి చంద్రబాబును, తెలుగు దేశం పార్టీని వేధింపులకు గురి చేయడమే  లక్యంగా కనిపిస్తోంది. అయితే   ఎవరు ఎన్ని కుట్రలు  చేసినా అంతిమంగా ధర్మమే విజయం సాధిస్తుంది. ఇది చారిత్రక సత్యం అంటున్నారు, విజ్ఞులు, విమర్శకులు. వినాశకాలే విపరీత బుద్ధే అన్నట్లుగా జగన్ రెడ్డి తన అధికారాంతంలో తన పతనాన్ని తనే శాశించుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.