Leading News Portal in Telugu

మహిళా రిజర్వేషన్ బిల్లుకు విఘ్నాలు తొలిగి నట్లేనా? | will women reservation bill overcome hurdles| modi| special| session| first| bill| new| parliament


posted on Sep 20, 2023 11:04AM

ఇంచు మించుగా మూడు దశాబ్దాలుగా పార్లమెంట్ ను పలకరించి పోతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు కొత్త పార్లమెంట్ భవనంలో తొలి బిల్లుగా మరో మారు కొత్తగా  పాదం మోపింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు 1990 దశకంలో, అప్పటి ప్రధాని దేవేగౌడ సంకీర్ణ ప్రభుత్వం తొలిసారిగా లోక్ సభలో ప్రవేశ పెట్టింది.ఆతర్వాత వాజపేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు కూడా ఐదారు మార్లు ఈ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ప్రవేశ పెట్టాయి. కానీ సభ ఆమోదం పొందలేదు.  2010లో ఒక సారిరి పెద్దల సభ ఆమోదం పొందినా, దిగువ సభ ఆమోదం లేక గడువు ముగిసి కాలం చేసింది. 

ఇప్పుడు ఇన్నాళ్ళకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం  పార్లమెంట్ కొత్త భవనంలోకి మారుతున్న శుభ సమయంలో, కొత్త పార్లమెంట్ గడప తొక్కిన  తొలి బిల్లుగా నారీ శక్తి వందన్ అధినియం బిల్లు  (మహిళా రిజర్వేషన్ బిల్లు)ను పార్లమెంట్ ఉభయ సభల్లో  ప్రవేశ పెట్టింది. పాత పార్లమెంట్ నుంచి కొత్త పార్లమెంట్ భవనంలోకి నడిచి వచ్చిన ప్రధానమంత్రి, మంత్రులు, ఎంపీలతో పాటుగానే, మహిళా బిల్లు కూడా నడుచుకుంటూ వచ్చింది. కొత్త పార్లమెంట్ లో అడుగుపెట్టింది.  

బహుశా భారత పార్లమెంట్ చరిత్రలో ఇంతకాలం త్రిశంకు స్వర్గంలో కాలక్షేపం చేసిన బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు తప్ప మరొకటి ఉండక పోవచ్చును. ఈ బిల్లు ఒకటి రెండు కాదు, ఏకంగా మూడు దశాబ్దాలుగా విఘ్నాలను ఎదుర్కొంటూ వస్తోంది. అందుకే  ఈసారైనా బిల్లు ఆమోదం పొందుతుందా  అనే అనుమానాలు, సందేహాలూ వదలడం లేదు. అదే సమయంలో  ఈసారి  విఘ్నాలను తొలిగించే వినాయకుని పుట్టినరోజు పండగ, వినాయక చవితి  రోజున పార్లమెంట్ ప్రవేశం చేసిన, బిల్లు ఖాయంగా ఆమోదం పొందుతుందనే విశ్వాసం  వ్యక్తమవుతోంది. ప్రధానంగా  లోక్ సభలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉండడంతో పాటుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, వైసేపీ, కమ్యూనిస్టులు సహా (ఎస్పీ, ఆర్జేడీ, వంటి రెండు మూడు పార్టీలు మినహా )మిగిలిన పార్టీలన్నీ బిల్లుకు మద్దతు ఇస్తున్న నేపధ్యంలో ఈసారి, విఘ్నాలు తొలిగి మహిళా బిల్లు చట్ట్టం అయ్యే అవకాశాలే ఎక్కుగా కనిపిస్తున్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో గట్టిగా వ్యక్తమౌతోంది.  

అయితే  అదే జరిగి మహిళా బిల్లు చట్టరూపం దాల్చినా, ఆ చట్టం వెంటనే అమలులోకి రాదు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే చట్టం అమలులోకి వస్తుంది. అంటే  ఈలోగా జరగవలసిన జనగణన జరిగి, 2026లో లేదా నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాతనే చట్టం అమలులోకి వస్తుంది. ఆ లెక్కన  బిల్లు పాస్ అయినా ఇప్పటికిప్పుడు, మహిళలకు కలిగే ప్రత్యక్ష  ప్రయోజనం ఏమీ ఉండదనే చెప్పాలి.  2026 తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో, అ తర్వాత 2029 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో మాత్రమే ఈ చట్టం అమలు అవుతుంది. మహిళలకు ప్రయోజనం చేకూరుతుంది. 

అయితే  మహిళా బిల్లు చట్ట రూపం దాలిస్తే సహజంగానే రాజకీయ పార్టీలలో మహిళల ప్రాధాన్యత పెరగ వచ్చని రేపటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ముందు నుంచే  రాజకీయ పార్టీలు అనివార్యంగానే అయినా మహిళలను ఎక్కువ సంఖ్యలో ఎన్నికల బరిలో దించ వచ్చని  అంటున్నారు. అలాగే, ఈరో జు కాకపోయినా రేపైనా అవకాశం తలపు తడుతుందనే నమంకంతోమహిళలు రాజకీయాల్లో మరింత చురుగ్గా,  ఉత్సాహంగా పాల్గొనే అవకాశం లేక పోలేదని అంటున్నారు. ఫలితంగా చట్టం కంటే ముందే చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం ఎంతో కొంత పెరిగే అవకాశం లేక పోలేదనే అభిప్రాయం మహిళా నేతలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే  కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లులో ఇంకా స్పస్థత రావలసి వుందనేది కాదన  లేని నిజం.  అందుకే, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించే వారు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చట్టం అయినా అమలును వాయిదా వేయడం, చట్టం 15 ఏళ్ళు మాత్రమే అమలులో ఉంటుందని (సన్ సెట్ ఆక్ట్’) బిల్లులో పేర్కొనడంతో ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించ వలసి వస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియోక వర్గాల పునర్విభజనకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధం ఏముంది?  ఇప్పటికిప్పుడు చట్టాన్ని  అమలులోకి తీసుకువస్తే.. ఈ సంవత్సరం చివర్లో జరిగే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో, అదే విధంగా వచ్చే సంవత్సరం (2024) సార్వత్రిక ఎన్నికల్లోనూ మహిళలకు రిజర్వేషన్ ఫలాలు దక్కుతాయని అంటున్నారు. కానీ  కేంద్ర ప్రభుత్వం విస్తరిలో అన్నీ వడ్డించి  నోటికి తాళం  వేసిందని  విపక్షాలు విమర్శిస్తున్నాయి. అలాగే  ఈబీసీ వాటా విషయంలోనూ సందేహాలు వ్యక్త మవుతున్నాయి. అయితే చర్చ సందర్భంగా ప్రభుత్వమే కొన్ని సవరణలు తెచ్చే అవకాశం లేక పోలేదనే అభిప్రాయం కూడా ప్రభుత్వ వర్గాల నుంచి వినవస్తోంది.

 నిజానికి ప్రభుత్వం విపక్షాలను ఇరకాటంలోకి నెట్టేందుకు  బిల్లులో ఉద్దేశ పూర్వకంగానే  కొన్ని గ్యాప్ లను వదిలేసిందన్న అనుమానాలు కూడా బలంగా వ్యక్తమౌతున్నాయి. మరో వంక, విపక్షాలు కూడా ప్రభుతం ఏ ఉద్దేశం, దురుద్దేశంతో ఈ  సమయంలో ఈ బిల్లు తెచ్చింది అనే విషయంలో లోతుగా  విచారిస్తున్నాయి. అందుకే, ఆచి తూచి అడుగు వేస్తున్నాయి.  ఏది ఏమైనాఎజెండా ఏమిటో తెలియకుండా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రకటన చేసి మహిళ బిల్లును ముందుంచిన మోడీ ప్రభుత్వం ముందు ముందు ఏమి చేస్తుందో, పార్లమెంట్ లో, మహిళా బిల్లు అంతిమ గమ్యం ఎంతో తెలియాలంటే, వేచి చూడక తప్పదని అంటున్నారు.