మరో చాన్స్ లేదా? విషయం జగన్ కు బోధపడిందా? | did jagan understood that he has no second chance| vindictive| politics| babu| harassment
posted on Sep 20, 2023 10:31AM
చూస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరో సారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవన్న నిర్ధారణకు వచ్చేసినట్లు కనిపిస్తోంది. అందుకే ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీని వేధింపులకు గురి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే చంద్రబాబును కేసుల పేరుతో వేధించి..కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపారు.
ఎన్నికల ముంగిట ఇటువంటి తీరు తన సర్కార్ పై ప్రజాగ్రహం మరింత ప్రజ్వరిల్లేందుకే దోహదపడుతుందని తెలిసినా జగన్ వెనుకాడటం లేదు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు అన్నట్లుగా కనిపించిన ప్రతి విషయంలోనూ లొసుగులు వెతుకుతూ వాటికి చంద్రబాబును బాధ్యుడిని చేయడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన వెతికి వెతికి చంద్రబాబుపై నమోదు చేస్తున్న కేసులు న్యాయస్థానాలలో నిలవవని.. కోర్టులు, చట్టాల గురించి కనీస పరిజ్ణానం ఉన్న ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. అటువంటిది జగన్ కు ఆయన వందిమాగధులకు, ఆయన మాట పట్టుకుని కేసులు బనాయించి, వాటిని సమర్ధిస్తున్న దర్యాప్తు అధికారులకూ విషయం తెలిదనుకోలేం.
అందుకే స్కిల్ కే సులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టివేయాలంటూ ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు సీనియర్ మోస్ట్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ కూడా సమర్ధ వాదనలు వినిపించలేకపోయారు. ఈ కేసులో చంద్రబాబు పాత్రను ఎస్టాబ్లిష్ చేయడానికే దర్యాప్తు జరపాల్సి ఉందనీ, అందుకే క్వాష్ పిటిషన్ కొట్టివేయాలనీ కోరడంలోనే జగన్ రెడ్డి సర్కార్ బనాయించిన కేసులలోని డొల్ల తనం బట్టబయలైందని న్యాయనిపుణులు అంటున్నారు. ఇక విషయానికి వస్తే..
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేసులో క్వాష్ పిటిషన్‌పై జరిగిన మంగళవారం (సెప్టెంబర్ 13) ఏపీ హైకోర్టులో జరిగిన వాదనల్లో.. స్కిల్ స్కాంలో చంద్రబాబు ప్రమేయాన్ని విచారించి ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉందనీ, అందుకే ఆయన క్వాష్ పిటిషన్ ను కొట్టివేయాలంటూ ప్రభుత్వ తరఫు న్యాయవాదుల వాదనలతో ఈ కేసులో డొల్లతనం స్పష్టంగా బయటపడింది. అడ్వకేట్ జనరల్, సీఐడీ చీఫ్ జంటకవుల వలే ఊరూరా, తెలంగాణ రాజధాని హైదరాబాద్, దేశ రాజధాని హస్తిన సైతం వెళ్లి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ చెప్పిన విషయాలనే సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మరో సారి హైకోర్టులో చెప్పారు. రంజిత్ కమార్ అనే ప్రభుత్వ లాయర్ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఇప్పటికిప్పుడు ఎలాంటి డాక్యుమెంట్లు లేవని చేతులెత్తేశారు. అదే సమయంలో ఐటీ శాఖ ఈ కేసుతో సంబంధం లేకుండా ఇచ్చిన నోటీసుల్ని చూపించారు. వాటిని చూపుతూ ఇలాంటి నేరాలు చేశారని భావించడానికి అవకాశాలు ఉన్నాయంటూ వితండ వాదన వినిపించారు.
చంద్రబాబుకు సంబంధం ఉందని ఒక్క డాక్యుమెంట్ కూడా లేదన్న ప్రభుత్వ లాయర్, సిమెన్స్‌కు, గుజరాత్ లో స్కిల్ ప్రాజెక్టుకు ఈమెయిల్స్ పంపామని వివరాలు రావాల్సి ఉందన్నారు. అలాగే డిజైన్ టెక్.. క్లాజ్ లో లేకపోయినా సబ్ కాంట్రాక్టులకు ఇచ్చిందని.. ఆ సంస్థ రూ. రెండు వందల కోట్లను దారి మళ్లించిందని చెప్పారు. ఆ సమయంలో ఈ సబ్ కాంట్రాక్టర్లకు.. చంద్రబాబుకు ఉన్న సంబంధం ఏమిటన్న న్యాయమూర్తి ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం ఇవ్వలేదు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా ప్రభుత్వం వద్ద లేదన్న విషయం హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయమూర్తల మాటలతో తేటతెల్లమైపోయిందని న్యాయనిపుణులు అంటున్నారు. క్వాష్ పిటిషన్ పై ఇరు వైపు వాదనలూ విన్న తరువాత న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. ఈ మధ్యలో ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్.. వచ్చే శుక్రవానికి మరో కౌంటర్ దాఖలు చేస్తామని కోరినా హైకోర్టు న్యాయమూర్తి అంగీకరించలేదు. కేసులో ఇవ్వాలే వాదనలు పూర్తి కావాలని స్పష్టం చేశారు.
చంద్రబాబు స్క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే జగన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుపై కేసు నిలవదనీ, ఆయన బయటకు రావడం ఖాయమనీ నిర్ధారణకు వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాదనలు ఇలా ముగిశాయో లేదో.. అలా జగన్ రెడ్డి సర్కార్ చంద్రబాబుపై మరో కేసును తెరపైకి తెచ్చింది. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో పీటి వారెంట్ దాఖలు చేసింది. వెంటనే ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. విశేషమేమిటంటే ఈ ఫైబర్ నెట్ కోసు కూడా ఇప్పటిది కాదు.. ఎప్పుడో నాలుగున్నరేళ్ల నాడు, అంటే జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 2019లో పెట్టిన కేసిది. అప్పట్లో 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేశారు. ఏ1గా వేమూరి హరి ప్రసాద్, ఏ2 మాజీ ఎండీ సాంబశివరావులను పేర్కొన్నారు. వారిని అరెస్ట్ చేశారు. ఆ కేసులో అందరూ బెయిల్ పై విడుదలయ్యారు. ఇంత వరకూ దర్యాప్తులో ఏం తేలిందో వివరాలు లేవు. ఇప్పటి వరకూ చార్జిషీటు కూడా వేయలేదు.
కానీ ఇప్పుడు ఎన్నికల ముంగిట ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందంటూ పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇప్పుడు ఇక గురువారం (సెప్టెంబర్ 21) నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో కోర్టులో ఉన్న కేసులపై చర్చిస్తామంటున్నారు. పిచ్చివాడి చేతిలో రాయి ఎంత ప్రమాదమో, ఒక ఉన్మాది చేతిలో అధికారం కూడా అంతే ప్రమాదం అని జగన్ రెడ్డి తన నాలుగున్నరేళ్ల పాలనలో రుజువు చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.