Leading News Portal in Telugu

మేము సైతం బాబు కోసం.. దేశ విదేశాల్లో నిరసన జ్వాలలు | protests all over against babu arrest| nation| abroad| youth| it| political| common


posted on Sep 20, 2023 1:57PM

సరిహద్దులు చెరిగి పోతున్నాయి.  మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమ కేసుల్లో ఇరికించి, వేధింపులకు గురి చేయడాన్ని, రాష్ట్ర ప్రజలే కాదు. ఇరుగు పొరుగు రాష్టాల ప్రజలు సైతం వ్యతిరేకిస్తున్నారు. అసహ్యించుకుంటున్నారు. ఏవగించుకుంటున్నారు.


 చంద్రబాబు నాయుడు, కేవలం ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి, ఒక పార్టీకి పరిమితమైన నాయకుడు కాదు. సమకాలిన రాజకీయ నాయకుల్లో ముందు వరసలో నిలిచే జాతీయ నాయకుడు. నిజనికి చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, విజన్, విశ్వసనీయత మేళవించిన రాజనీతిజ్ఞుడు. స్టేట్స్ మన్. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా  చంద్రబాబు తెచ్చిన ఆర్థిక, సాంకేతిక సంస్కరణల ప్రయోజనాలు పొందిన వేలాది మంది ఐటీ రంగ నిపుణులు, ఇంజనీర్లు వైద్యులు, ఆర్థిక సంస్కరణలను ఆసరా చేసుకుని, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, సేవరంగాలలో దేశ విదేశాల్లో దూసుకుపోతున్నారు.

అలాంటి ఎందరో వివేచన, విజ్ఞతగల విద్యావంతులు చంద్రబాబుకు మద్దతుగా దేశ విదేశాల్లో భారీ స్థాయిలో నిరసనలకు దిగుతున్నారు. బెంగళూరు నగరంలో ఐటీ ఉద్యోగులతో మొదలైన నిరసనాగ్రహాలు రాష్ట్రంలోని తెలుగు ప్రజలు ఉన్న మారుమూల ప్రాంతాలకు చేరాయి. బళ్లారి, విజయనగర, రాయచూరు, కొప్పళ, చిత్రదుర్గం, చెళ్లకెర, కొప్పళ, గంగావతి, హుబ్బళ్లి తదితర ప్రాంతాల్లో వివిధ సంఘాలు, క్యాంపులలో ఉండే చంద్రబాబు అభిమాన సంఘాలు నిరసనలు, ర్యాలీలు కొనసాగిస్తున్నాయి. పార్టీలకు అతీతంగా ప్రవాసాంధ్రుల ఆందోళనలకు బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌) పార్టీల నాయకులు మద్దతుగా పాల్గొంటున్నారు. మంగళవారం( సెప్టెంబర్ 19) రాయచూరు జిల్లా సింధనూరులో జరిగిన భారీ నిరసనలో జేడీఎస్‏కు చెందిన మాజీమంత్రి వెంకటరావు నాడగౌడ, బీజేపీకి చెందిన మాజీ ఎంపీ విరూపాక్షప్ప, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మస్కి ఎమ్మెల్యే బసనగౌడ తుర్విహాళ్‌ పాల్గొనడం విశేషం.

అంతే కాదు  కర్ణాటక మాజీ మంత్రి వెంకటరావు నాడగౌడ మరో అడుగు ముందుకేసి  చంద్రబాబునాయుడు అరెస్టు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య  తప్ప మరొకటి కాదని, రాజకీయాలలో  ఇది ప్రమాదకర పరిణామమని పేర్కొన్నారు. మరోవంక చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ప్రవాసాంధ్రులు, తెలుగు సంఘాల ఆధ్వర్యంలో సింధనూరు నగరంలోని స్టేడియం గ్రౌండ్‌లో భారీ సమావేశం నిర్వహించారు. అనంతరం నగరంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అంతకు ముందు స్టేడియం గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ అవినీతి వ్యవహారాలకు సంబంధించి విచారణ జరిపించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని, దాని పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఇలాంటి ధోరణి రాజకీయాల్లో ఎంతమాత్రం సరికాదని, ఇందుకు బాధ్యులైన వారు భవిషత్తులో భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ క్రమంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్ష సాధింపునకు,  రాజకీయ విద్వేషాలకు పాల్పడడం ఎంతమాత్రం సమంజసం కాదని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ప్రమాదకరమైన ధోరణి అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎంపీ కె. విరుపాక్షప్ప మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు  నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని విమర్శించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్టు చేయడం దారుణమన్నారు. ఇలాంటి ధోరణి రాజకీయాల పట్ల ప్రజల్లో విశ్వానికి బదులు అసహ్యాన్ని పెంచుతుందన్నారు.

ఈ పద్ధతి విడనాడాలని, ఇది ఏ పార్టీకి మంచిది కాదని హితవు పలికారు. చం ద్రబాబు అరెస్టు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తి దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తోందని, ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని, ఈ విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలంటూ తెలుగు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఇలా, దేశ విదేశాల్లోని విజ్ఞులు, వివేచనపరులు, చద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నారు, అంతే కాదు, చందబాబు అరెస్ట్ ను వ్యతిరెకిస్తూ  తెలుగు ప్రజలు సాగించే ధర్మ పోరానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు.