కేంద్రం పెద్దలకు తెలిసే చంద్రబాబు అరెస్ట్.. అశోక గజపతి రాజు | babu arrest with center consent| ashoaka| gajapati| raju| sensation
posted on Sep 20, 2023 5:13PM
తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు అరెస్ట్‌పై కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత పి.అశోక్ గజపతి రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా.. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగిందంటే నమ్మబుద్ది కావడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇదంతా కేంద్రానికి తెలిసే జరిగిందని తమ నమ్మకమని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
చంద్రబాబు అరెస్ట్ అక్రమమని ఇతర రాష్ట్రాల్లో కూడా అనుకుంటున్నారని ఆయన తెలిపారు. అయితే తాను న్యాయవాది కాకపోయినా.. సుదీర్ఘ కాలం చట్టసభల్లో పని చేసిన అనుభవంతో ఈ విషయాన్ని చెబుతున్నారు. ఇక ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా.. అది కేబినెట్ మొత్తం బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. అది పరిగణలోకి తీసుకోకుండా.. ఇప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టి సాక్ష్యాలు కోసం వెతుకున్నారని ఆయన వివరించారు. అయితే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
అశోక్ గజపతి రాజు.. మాటలకు విశ్వసనీయత ఉందని నెటిజన్లు ఈ సందర్బంగా పేర్కొంటున్నారు. అయినా నిప్పు లేకుండా పొగ రాదంటున్నారు. అదీకాక జగన్ తొలి మలి కేబినెట్లోని పలువురు మంత్రుల్లాగా అశోక్ గజపతి రాజు మాట్లాడరని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. ఇక అశోక్ గజపతి రాజు వ్యవహరశైలినే కాదు.. ఆయనలోని నీతి నిజాయితీని సైతం ప్రధాని మోదీ.. గతంలో ప్రశంసించిన విషయాన్ని నెటిజన్లు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. మరోవైపు అశోక్ గజపతి రాజు.. ఆయన రాజకీయ జీవితం.. తెరిచిన పుస్తకమని… ఆయన ప్రజా ప్రతినిధిగా అటు ఢిల్లీలో ఉన్నా.. ఇటు విజయనగరంలో ఉన్నా.. ప్రజలు, వారి సంక్షేమం కోసమే పాటు పడ్డారని జిల్లా వాసులు సైతం చెప్పుకుంటారని నెటిజన్లు చెబుతున్నారు.
మరోవైపు.. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై జాతీయ మీడియా విస్తృతంగా కవర్ చేసిందని.. దీంతో ఈ విషయం కేంద్రంలోని పెద్దలకు తెలిసే ఉంటుందని నెటిజన్లు వివరిస్తున్నారు. అదీకాక.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారని.. ఇంకోవైపు కేంద్రంలోని పెద్దలతో జగన్ ప్రభుత్వంలోని పెద్దలు.. అంటకాగుతున్నారన్నది బహిరంగ రహస్యమేనని నెటిజన్లు అంటున్నారు. ఎన్నికలు రానున్నాయి.. అలాంటి వేళ.. మాకు మీరు.. మీకు మేము అంటూ.. అటు బీజేపీ, ఇటు వైసీపీలు కలిసి మెలసి ఈ పని చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో మాజీ ఎంపీ మధు యాష్కి.. చంద్రబాబు అరెస్ట్ వెనుక మోడీ, కేసీఆర్ ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతిని ప్రస్తావిస్తున్నారు.
ఇక చంద్రబాబును జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసినా.. పక్క రాష్ట్రాల నేతలు.. విభిన్నరకాల ఆరోపణలు సైతం గుప్పిస్తున్నారని.. ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే.. ఆ వెనుక.. ఉన్నది కేంద్ర ప్రభుత్వమా? లేకుంటే జగన్‌తోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కలిసి ఈ అరెస్ట్‌కు పథక రచన చేశారా? అదీ ఇదీ కాకుంటే.. జగన్ ప్రభుత్వంతో కలిసి… కేంద్రం ఈ చర్యకు పూనుకుందా? అనే సందేహాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
ఇంకోవైపు జగన్ విదేశీ పర్యటనలో ఉండగా.. చంద్రబాబు అరెస్ట్ అయితే.. ఏపీ సీఎం స్వదేశానికి వచ్చిన వెంటనే.. ఢిల్లీ పర్యటనకు వెళ్తారంటూ.. పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా ఇప్పటికీ సీఎం జగన్.. నేటికి ఢిల్లీకి వెళ్లిందీ లేదని.. ఓ వేళ.. జగన్ డిల్లీకి వెళ్లి.. కేంద్రంలోని పెద్దలతో భేటీ అయితే.. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై మరిన్ని రాజకీయ ప్రచారాలు ఊపందుకొంటాయనే ఉద్దేశ్యంతో కేంద్రం పెద్దలే ఆయనను రానీయలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.