యూటీగా హైదరాబాద్.. బీజేపీ త్రి బర్డ్స్ ఎట్ వన్ షాట్ వ్యూహం! | hyderabad as ut| bjp| strategy| three| birds| one
posted on Sep 21, 2023 4:37PM
కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ ను ప్రకటించడం ఖాయమైపోయింది. ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలోనే ఈ ప్రకటన ఉంటుందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అందుకు గ్రౌండ్ లెవెల్ లో ప్రిపేర్డ్ నెస్ కోసం కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. కంటోన్మెంట్ అధికారులతో చర్చలు జరిపారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనే విధంగా వారిని సమాయత్తం చేస్తున్నారు. 2024లో హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుగువన్ ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు అదే నిజం కాబోతున్నది.
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అప్పట్లో ఈ ప్రతిపాదనకు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా అంగీకారం తెలిపారు. అయితే తరువాత ఈ ప్రతిపాదన మరుగున పడింది. హైదరాబాద్ ను రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు. పదేళ్ల పాటు రెండు తెలుగు రాష్ట్రాల రాజధానిగా హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఆ గడువు 2024 జూన్ తో ముగుస్తుంది. రాష్ట్ర విభజన తరువాత పాలనా సౌలభ్యం కోసం, రాష్ట్రానికి సొంత రాజధాని నిర్మాణం లక్ష్యంతోనూ విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి పాలనను షిఫ్ట్ చేశారు. పేరుకు హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అయినా.. ఆచరణలో మాత్రం హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా, అమరావతి విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగాయి.
అయితే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై విభజిత ఏపీలో జగన్ సర్కార్ కొలువుదీరింది. దీంతో అమరావతి రాజధాని కాదు, ఏపీకి మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అంతే తప్ప ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కనుక అక్కడ నుంచి పాలన సాగిస్తూ.. మూడు రాజధానులను నిర్మిస్తామని చెప్పలేదు. దీంతో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం మారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విభజిత ఏపీ రాజధాని అమరావతిని నిర్వీర్యం చేశారే తప్ప విభజన చట్టంలో ఉన్న విధంగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కనుక అక్కడ నుంచి పాలన సాగిస్తామంటూ క్లెయిమ్ చేయలేదు. దీంతో హైదరాబాద్ తెలంగాణ రాజధానిగానే కొనసాగుతూ వచ్చింది. మధ్యలో అడపాతడపా ఉమ్మడి రాజధాని అంశాన్ని ఏపీ మంత్రులు తెరపైకి తీసుకువచ్చినా వారి మాటలలో కానీ, చేతలలో కానీ ఎన్నడూ సీరియస్ నెస్ కనిపించలేదు. ఏదో రాజకీయ పబ్బం గడుపుకునేందుకు చేసిన ప్రకటనల్లాగే మిగిలిపోయాయి.
వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల రాజధానిగా హైదరాబాద్ హోదా 2024 జూన్ తో ముగుస్తుంది. ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నిర్మాణం పూర్తయినా, కాకపోయినా ఆ రాష్ట్రం హైదరాబాద్ పై హక్కులు కోల్పోయినట్లే. సరిగ్గా ఈ తరుణంలో కేంద్రం కొత్తగా యూనియన్ టెరిటరీగా హైదరాబాద్ అంటూ పాత ప్రతిపాదననే తెరపైకి తీసుకువచ్చింది. ఇది రాజకీయంగా కేంద్రంలోని మోడీ సర్కార్ కు సానుకూలం అని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఎంతగా ప్రయత్నించినా కనీస మాత్రమైన రాజకీయ బలాన్ని పెంచుకోవడంలో విఫలమైన బీజేపీ.. యూనియన్ టెరిటరీ పేరుతో కనీసం హైదరాబాద్ పై పెత్తనం సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయన్న ఉద్దేశంతో ఆ దిశగా సీరియస్ గా దృష్టిపెట్టిందన్నది పరిశీలకుల విశ్లేషణ. హస్తిన తరహా అభివృద్ధి ఉంటుందన్న భావనలో హైదరాబాదీయులు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటెసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నిర్ణయం ద్వారా ఒకే సారి ఇటు బీఆర్ఎస్ సర్కార్ ను, అటు ఏపీ సర్కార్ నూ ఇరుకున పెట్టడమే కాకుండా.. ఎంఐఎం కు హైదరాబాద్ నగరంలో ఉన్న పట్టు కూడా కోల్పోయేలా చేయవచ్చన్నది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు. అంటే త్రిబర్డ్స్ ఎట్ వన్ షాట్ ఎత్తుగడగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
హైదరాబాద్ కు నలువైపులా రక్షణ శాఖ భూములు ఉండటం, రక్షణ పరంగా హైదరాబాద్ అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో ఈ ప్రతిపాదనకు జాతీయ స్థాయిలో పెద్దగా వ్యతిరేకత వచ్చే అవకాశాలు లేవన్నది కూడా పరిశీలకులు చెబుతున్న మాట. వస్తే గిస్తే తెలంగాణ నుంచే పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురు కావచ్చుననీ, దానిని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదనీ బీజేపీ భావిస్తోందంటున్నారు. ఏదో విధంగా రాష్ట్రం సాధించుకోవడమే లక్ష్యంగా హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అన్న ప్రతిపాదనకు గతంలో కేసీఆర్ అంగీకారం తెలిపారనీ, అప్పుడు ఔనని ఇప్పుడు కాదనడం ఏమిటన్న వాదనతో తెలంగాణ అభ్యంతరాలకు కొట్టి పారేయొచ్చున్నది బీజేపీ పెద్దల భావనగా చెబుతున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకూ అడపాదడపా మాత్రమే వినిపించిన యూనియన్ టెరిటరీ హైదరాబాద్ అన్న మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయనడానికి తార్కానంగా కిషన్ రెడ్డి కంటోన్మెంట్ అధికారులను ఎటువంటి పరిస్థితి ఎదురైనా సంసిద్ధంగా ఉండేలా సమాయత్తం చేయడాన్ని పరిశీలకులు చూపుతున్నారు.