Leading News Portal in Telugu

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు స్వల్ప ఊరట


posted on Sep 26, 2023 2:14PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. మహిళనైన తనను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది. అప్పటి వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని ఈడీని ఆదేశించింది. విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసిన నేపథ్యంలో ఈడీ స్పందిస్తూ… సుప్రీంకోర్టు తుది నిర్ణయం వచ్చేంత వరకు కవితకు సమన్లను జారీ చేయబోమని తెలిపింది.

అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే ప్రారంభించిన ఉద్యమంలో కీలకనేతలుగా ఎదిగి, ఢిల్లీ ప్రజలను మెప్పించి అధికార పగ్గాలు చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ  నాయకులు అదే అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి జైలుపాలయ్యారు. రాజకీయ నాయకులు, లిక్కర్ వ్యాపారులు, పలు లిక్కర్ కంపెనీల నుంచి అధికార  పార్టీ నేతలకు వందలాది కోట్ల రూపాయలు ముడుపులుగా అందాయని, అందుకే ప్రయివేట్ వ్యక్తులకు అనుకూలంగా ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ అమలు చేసిందన్నది ప్రధానమైన ఆరోపణ. ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్, ఎక్సైజ్ కమిషనర్‌తో పాటు పలువురు నిందితులను గతంలో సీబీఐ అరెస్ట్ చేయగా,  ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ తో ఈ కుంభకోణం దేశ వ్యాప్తంగా సంచలనమైంది.  అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయ కవిత పేరు ఈ స్కాంలో బయటకొచ్చింది. కెసీఆర్ ను దారిలో తెచ్చుకోవడంలో భాగంగా బిజెపి ప్రభుత్వానికి ఆయుధం దొరికినట్టయ్యింది. ఈడీ పలుమార్లు కవితకు సమన్లు పంపించింది. తనను ఈడీ కార్యాలయానికి పిలవడాన్ని కవిత జీర్ణించుకోలేకపోయారు.  సుప్రీంకోర్టు నాశ్రయించారు. కవిత తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు.

ఢిల్లీ కొత్త మద్యం పాలసీ ఆ రాష్ట్రానికి సంబంధించిందే అయినా, దక్షిణాదికి చెందిన పలువురు రాజకీయ నాయకులతోపాటు వారి సన్నిహితులకు కూడా ఈ అవినీతి, అక్రమాల్లో సంబంధం ఉందని దర్యాప్తు సంస్థలు చార్జిషీట్లలో పేర్కొన్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె కవిత, ఆమె భర్తకు కూడా ఇందులో పాత్ర ఉందంటూ ఆమెను ఒకసారి విచారించడమే గాక సీబీఐ, ఈడీలు చార్జిషీట్లలో పలుమార్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ సిట్టింగ్ ఏంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితోపాటు ఆయన కుమారుడికి కూడా సంబంధమున్నట్లు ఆరోపణలున్నాయి.

సిసోడియా అరెస్టును ఖండించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కూతురిపై వచ్చిన ఆరోపణల విషయంలో మాత్రం ఇప్పటిదాకా నోరు మెదపలేదు. 

 ఏది ఏమైనా, నిజానిజాలు నిగ్గుతేలి, నేరం జరిగితే ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరూ జైలుపాలు కావాల్సిందే.