Leading News Portal in Telugu

మోడీ తెలంగాణ పర్యటన.. కేసీఆర్ కు వైరల్ ఫీవర్.. లింకేమైనా ఉందా? | kcr avoids modi once again| telangana| tour| pm| cm| viral| frver| rest


posted on Sep 27, 2023 10:22AM

ప్రధాని నరేంద్రమోడీ ఎప్పుడు తెలంగాణ పర్యటనకు వచ్చినా.. అందరిలోనూ ఆయన పర్యటన కంటే.. ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వాగతం పలుకుతరా? లేదా? ప్రధాని అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారా? లేదా? అన్న ఆశక్తే ఎక్కువగా కనిపిస్తుంటుంది.  ఎందుకంటే గత రెండేళ్లుగా ప్రధాని నరేంద్రమోడీ ఎప్పుడు అధికారిక పర్యటనపై తెలంగాణకు వచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో ఒక సాకుతో రాష్ట్రం దాటి బయటకు వెడుతున్నారు. లేదా అనారోగ్యమంటూ ప్రగతిభవన్ కో.. ఫామ్ హౌస్ కో పరిమితమైపోతున్నారు. అంతే తప్ప  ప్రధాని నరేంద్ర మోడీకి ఎదురుపడటం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ముఖం చాటేస్తున్నారు.

మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టాలని శతధా ప్రయత్నించి భంగపడిన కేసీఆర్.. తానే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి తనను తాను జాతీయ నాయకుడిగా ప్రకటించుకున్నారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడం, మోడీ సర్కార్ ను గద్దె దింపడమే లక్ష్యంగా ప్రకటించేసుకున్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ అటు మోడీకి, ఇటు విపక్ష కూటమికి కూడా చెందని వ్యక్తిగా, బీఆర్ఎస్ ఏ కూటమీ దరి చేరనీయని పార్టీగా మిగిలిపోయిందనుకోండి అది వేరే సంగతి. ఇక్కడ విషయమేమిటంటే.. ఇటీవలి కాలంలో కేసీఆర్ బీజేపీ లక్ష్యంగా చేసే విమర్శలలో తీవ్రత కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆయన మోడీ, షా, బీజేపీలపై విమర్శలు చేయడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తడం, ఆమెను ఒకటికి మూడు సార్లు ఈడీ, సీబీఐ విచారణ చేయడంతో ఆయన కేంద్రం లక్ష్యంగా విమర్శల దాడిని మానేశారు.  

దీంతో మారిన పరిస్థితుల్లో  వచ్చే నెల 1న అధికారిక పర్యటనపై తెలంగాణ రానున్న ప్రధాని నరేంద్రమోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం చెబుతారా? లేక  యథా ప్రకారం గతంలో వలె ముఖం చాటేస్తారా అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. వచ్చే నెల 1న హైదరాబాద్ లో అధికారిక కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ తరువాత ప మహబూబ్ నగర్ లో జరిగే పార్టీ బహిరంగ సభలో పాల్గొంటారు.  ఆ తరువాత మూడో తేదీన కూడా మరోసారి తెలంగాణ పర్యటనకు మోడీ వస్తారు. సరే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడానికి ముందే కేంద్రంపై అంటే మోడీ సర్కార్ పై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఒక్క సందర్బంలో కూడా ప్రధానికి ఎదురుపడలేదు. అలా ఎదురుపడాల్సి వచ్చిన ప్రతి సందర్బంలోనూ ఏదో ఒక కారణం చెప్పి దూరంగానే ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులలో వచ్చిన పెను మార్పులు కారణంగా, అలాగే బీజేపీపై విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేసిన పరిస్థితుల్లో ఈ సారి కేసీఆర్ ప్రధాని మోడీకి స్వాగతం పలికే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు కూడా విశ్లేషించారు.

అయితే వారి విశ్లేషణలకు తప్పాయి. కేసీఆర్ ఈ సారి కూడా మోడీకి ఎదురుపడే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆయన వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా ఆయనకు ఐదుగురు వైద్యుల బృందం వైద్య సేవలు అందిస్తోంది. మరో వారం రోజుల పాటు ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారంటూ ఆయన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మీడియా సమావేశంలో తెలిపారు. అంటే ఒక వేళ తన పట్టుదల పక్కన పెట్టి మోడీకి స్వాగతం చెబుదామని కేసీఆర్ భావించినా, అందుకు ఆయన అరోగ్యం సహకరించదని తేలిపోయింది. మొత్తం మీద మోడీకి కేసీఆర్ ముఖం చాటేయడమనే ఇటీవలి సంప్రదాయం ఇంకా కొనసాగుతుందనే చెప్పాలి.