పేరుకు జాతీయ పార్టీ.. తీరుకు ప్రాతీయం.. ఇదెక్కడి చోద్యం కేటీఆర్ సర్ | brs national party for name sake| ktr| says| only| telangana| babu| arrest| protests| allow| it
posted on Sep 27, 2023 11:19AM
తెలంగాణ రాష్ట్ర సమితికి ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమోషన్ ఇచ్చి భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ పార్టీని చేసేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ చరిత్ర గర్భంలో కలిసిపోయిందనీ, ఇక బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతుందనీ ఆర్భాటంగా ప్రకటించారు. ఓ రెండు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆవిర్భావ సభకు ఆహ్వానించారు. అయితే కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మాత్రం ఇంకా బీఆర్ఎస్ ఉనికిని గుర్తించడం లేదని అనిపిస్తున్నది. తెలంగాణ ఎన్నికల వేళ అయన కేటీఆర్ తమ పార్టీని బీఆర్ఎస్ అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నట్లు కనిపించడం లేదు. ఎన్నికలలో ఏదో మేరకు ప్రయోజనం పొందాలంటే పార్టీ పేరులో తెలంగాణ ఉండి తీరాలన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తున్నది. అందుకే ఆయన తమ పార్టీ ఇంకా టీఆర్ఎస్ అనే నమ్ముతున్నారు. భారత రాష్ట్ర సమితి అని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. తాను స్వయంగా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడైనప్పటికీ.. కేటీఆర్ ఆ విషయాన్ని అంగీకరించడం లేదు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో తమ పార్టీ టీఆర్ఎస్ మాత్రమే అని అంటున్నారు. అదేదో ప్రైవేటు సంభాషణల్లో చెప్పడం కాదు.. బహిరంగంగానే విమల్ ఓన్లీ విమల్ అన్నట్లుగా తెలంగాణ ఓన్లీ తెలంగాణ అని అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తెరాసను బీఆర్ఎస్ గా గుర్తించి నమోదు చేసిన తరువాత కూడా కేటీఆర్ తమది ఇంకా టీఆర్ఎస్ పార్టీయే అనడం పట్ల పార్టీ శ్రేణుల్లోనే కాదు, పరిశీలకులలో కూడా విస్మయం వ్యక్తం అవుతున్నది.
ఇంతకీ విషయమేమిటంటే.. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఏపీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు అక్రమ అరెస్టును ఖండిస్తూ రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అలాగే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనూ ఐటీ ఉద్యోగులు భారీ ర్యాలీలు నిర్వహించారు. అయితే తెలంగాణ సర్కార్ మాత్రం ఆ ర్యాలీలపై ఉక్కుపాదం మోపింది. ఎక్కడో ఏపీలో జరిగిన రాజకీయ అరెస్టు విషయంలో ఇక్కడ ఆందోళనలు ఏమిటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మీడియా మీట్ పెట్టి మరీ చెప్పారు. తమది తెలంగాణ రాష్ట్రమనీ, ఇక్కడ వేరే రాష్ట్రాలలో జరిగిన అంశాలపై స్పందన ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఐటీ ఉద్యోగులు చేశారని మరొకరు, వారు చేశారని ఇంకొకరు ఇలా నిరసన ప్రదర్శనలు చేసుకుంటే వెళ్లిపోతే శాంతి భద్రతల మాటేమిటని ప్రశ్నించారు. అదే సమయంలో ఆయనో లాజిక్ మిస్సయ్యారు. బీఆర్ఎస్ ఏపీ శాఖ ఒకటి ఉందనీ, దానికి ఏపీలో ఓ కార్యాలయం ఉందనీ మరిచిపోయారు. మీది తెలంగాణ మాత్రమే అయినప్పుడు అక్కడ పార్టీ కార్యవర్గం ఎందుకు? అక్కడి సమస్యలపై బీఆర్ఎస్ స్పందన ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. అలాగే మహారాష్ట్ర స్థానిక ఎన్నికలలో పోటీ గురించీ నిలదీస్తున్నారు. దేశ్ కీ నేతా కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ పోస్టర్లనీ, కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనలనూ గుర్తు చేస్తున్నారు.
ఇక ఏపీ రాజకీయాలు మనకెందుకు అంటూ మీడియా సమావేశంలో ప్రశ్నించిన కేటీఆర్ ను నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఏపీలో బీఆర్ఎస్ నిర్వహించిన ఆందోళనలు ఎత్తి చూపారు. అలాగే తెలంగాణలోనే బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ చేసిన ప్రకటనలూ, ఆందోళనల్లో పాల్గొన్న ఉదంతాలను ఎత్తి చూపారు. రాజకీయాలకు అతీతంగా ఆందోళనకు దిగిన ఐటీ నేతలను అడ్డుకున్న కేటీఆర్ సొంత పార్టీ నేతలే.. చివరాఖరకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సహా పలువురు నాయకులు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తున్నారని గుర్తు చేశారు. ఏకంగా ఏపీ వెళ్లి మరీ సంఘీభావం తెలిపి వస్తున్న బీఆర్ఎస్ నేతలూ ఉన్నారు. అయినా జాతీయ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడై ఉండి కూడా కేటీఆర్ సంకుచితంగా వేరే రాష్ట్రంలో ఏం జరిగితే మనకెందుకు అనడం ఏమిటని నిలదీస్తున్నారు.
అయినా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఉన్న ప్రతి చోటా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ పదేళ్ల కిందటి వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే హైదరాబాద్ అభివృద్ధి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే సైబరాబాద్ నిర్మాణం జరిగింది. అంతర్జాతీయ క్రీడోత్సవాలు జరిగాయి. ప్రపంచ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు నిర్మాణమయ్యాయి. ఐటీ హబ్ గా బెంగళూరును హైదరాబాద్ అధిగమించింది. ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలు హైదరాబాద్ కు వచ్చాయి. అన్నిటికీ మించి ఐటీ ఉద్యోగాల విషయంలో తెలుగువారి ఆధిపత్యానికి కారణం ఆయన దార్శనికతే అనడంలో సందేహానికి తావులేదు. స్వయంగా ఇదే కేటీఆర్ చంద్రబాబు దార్శనికత వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందనీ, ఆయన బాటలోనే తాను దానిని మరింత విస్తరిస్తున్నానని పలు సందర్భాలలో చెప్పారు. అటువంటి కేటీఆర్ ఇప్పుడు ఇలా చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ తెలంగాణలో నిరసనలు అంగీకరించబోమనీ, కావాలంటే ఏపీ వెళ్లి చేసుకోండనీ చెప్పడం బాధ్యతారాహిత్యమే కాదు, అప్రజాస్వామికమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మొత్తం మీద ఏపీలో చంద్రబాబు అక్రమ అరెస్టు తెలంగాణలో బీఆర్ఎస్ కాళ్ల కింద భూమిని కదిలిస్తోందని, అందుకే కేటీఆర్ బాబు అరెస్టుపై తెలంగాణలో నిరసనలేంటని రుసరుసలాడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. త్వరలో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే అన్ని స్థానాలలో పోటీ చేస్తుందని ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో మెజారిటీ స్థానాలలో తెరాసకు నష్టం జరిగే అవకాశం ఉందన్న ఆందోళనతోనే కేటీఆర్ ప్రాంతీయ నినాదం అందుకున్నారనీ అంటున్నారు.
అయితే కేటీఆర్ ప్రాంతీయ నినాదం బీఆర్ఎస్ కు లాభం కంటే నష్టమే ఎక్కువ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. తెలంగాణ సెంటిమెంట్ అనేదే లేదనీ, ఇక అభివృద్ధి అజెండాతోనే ఎన్నికలకు వెడదామని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్పష్టంగా చెప్పేసిన తరువాత నిజమైన అభివృద్ధి చంద్రబాబు హయాంలోనే జరిగింది కదా? అంటూ నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్నలు తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసేలా ఉన్నాయన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది.